iDreamPost

1997 సంక్రాంతిని గుర్తు చేస్తామన్న వీరయ్య

1997 సంక్రాంతిని గుర్తు చేస్తామన్న వీరయ్య

నిన్న ప్రెస్ మీట్ పేరుతో మీడియాని పిలిచి ఏకంగా ప్రీ రిలీజే ఈవెంట్ అంత హడావిడి చేసింది వాల్తేరు వీరయ్య టీమ్. చెప్పిన టైం కన్నా చాలా ఆలస్యంగా మొదలుకావడం, చిన్నా చితక ఆర్టిస్టులతో సహా టెక్నికల్ క్రూ మొత్తాన్ని తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడించడం వెరసి వచ్చే నెల 8న వైజాగ్ లో జరగబోయే అసలు వేడుకలో ఇంకేం మాట్లాడ్డానికి లేవనే రీతితో సుదీర్ఘంగా ప్రసంగించేశారు. దర్శకుడు బాబీ ఏకంగా పాతిక నిమిషాల దాకా తీసుకోవడంతో మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు తానేం చెప్పనని అన్ని విషయాలు అసలైన టైంలో చెప్పుకుందామని స్మార్ట్ గా తప్పించుకున్నారు. చిరంజీవి మాత్రం ఎప్పటిలాగే తన సమయం తాను తీసున్నారు

ఈ సందర్భంగా ఒక జర్నలిస్ట్ వీరసింహారెడ్డితో పోటీ ప్రస్తావన తీసుకొచ్చారు. గతంలో చాలా సార్లు తలపడినప్పటికీ 1997 లాగా మళ్ళీ అదే సీన్ రిపీట్ చేస్తామని మెగాస్టార్ నొక్కి వక్కాణించారు. ఆ సంక్రాంతికి హిట్లర్, పెద్దన్నయ్య కేవలం పదిరోజుల వ్యవధిలో ఢీ కొట్టాయి. వరస ఫ్లాపులతో సతమతమవుతూ ఒక సంవత్సరం మొత్తం ఖాళీగా ఉన్న చిరు చాలా ఆలోచించి మలయాళం హిట్లర్ రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ఎడిటర్ మోహన్(గాడ్ ఫాదర్ దర్శకుడు మోహన్ రాజా తండ్రి)నిర్మాతగా మంచి బడ్జెట్ లో నిర్మించారు. చెల్లి సెంటిమెంట్ ఎక్కువగా ఉన్నా ఊహించిన దానికన్నా హిట్లర్ గొప్ప విజయం సాధించింది

ఇక పెద్దన్నయ్య బాలయ్య స్వంత బ్యానర్ రామకృష్ణ స్టూడియోస్ పతాకంపై శరత్ దర్శకత్వంలో రూపొందింది. బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో రోజా, ఇంద్రజ హీరోయిన్లుగా కోటి సూపర్ హిట్ సాంగ్స్ తో మంచి విజయం సొంతం చేసుకుంది. అదే టైంలో వచ్చిన చిన్నబ్బాయి, అడవిలో అన్న పోటీని తట్టుకుని ఈ రెండు విజేతలుగా నిలబడ్డాయి. వసూళ్ల లెక్కలో చిరుదే పై చేయి కానీ పెద్దన్నయ్య స్వల్ప తేడాతో రెండో స్థానాన్ని తీసుకుంది. ప్రత్యేకంగా ఈ ఉదాహరణ చెప్పడానికి కారణం ఆ రెండు కమర్షియల్ చిత్రాలు కావడం. మరి పాతికేళ్ల తర్వాత అదే ఫలితాన్ని రిపీట్ చేస్తామని చెబుతున్న చిరు బాలయ్యలు నిజంగా అన్నంత పని చేస్తే అంతకంటే కావాల్సింది ఏముంటుంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి