iDreamPost

వాస్తవాధీన రేఖ వెంబడి భారత దళాల పెట్రోలింగ్‌ను అడ్డుకుంటున్న చైనా

వాస్తవాధీన రేఖ వెంబడి భారత దళాల పెట్రోలింగ్‌ను అడ్డుకుంటున్న చైనా

భారత్-చైనా మధ్య గల వాస్తవాధీన రేఖ వద్ద భారత్ సైనికుల సాధారణ పెట్రోలింగ్‌కు చైనా ఆటంకాలు కలిగిస్తుందని భారత విదేశాంగ శాఖ గురువారం ప్రకటించింది. సరిహద్దు నిర్వహణ విషయంలో భారత్‌కు బాధ్యతాయుతమైన విధానం ఉందని కేంద్రం నొక్కి చెప్పింది.అలాగే వెస్ట్రన్ సెక్టార్ లేదా సిక్కిం సరిహద్దులలో చైనా వైపుకు భారత దళాలు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC) దాటినట్లు చైనా చేసిన ఆరోపణలను భారత్ ఖండించింది. భారత-చైనా సరిహద్దు ప్రాంతాలలో వాస్తవ నియంత్రణ రేఖ యొక్క అమరిక గురించి భారత దళాలకు పూర్తిగా తెలుసు, దానిని కాపాడటానికి అప్రమత్తంగా ఉన్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ స్పష్టం చేశారు.

భారతీయ సైనిక కార్యకలాపాలు పూర్తిగా LAC యొక్క భారత ప్రాంతాల వైపే ఉన్నాయని శ్రీవాస్తవ తెలిపారు.అదే సమయంలో భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని మరియు భద్రతను కాపాడటానికి కట్టుబడి ఉన్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇంకా లడఖ్‌లో సరిహద్దులు లేని ప్రాంతాల స్థితిని మార్చడానికి భారత్ ఏకపక్షంగా ప్రయత్నిస్తోందని తాజాగా చైనా చేసిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది.

ఇటీవల కాలంలో లడఖ్‌ సరిహద్దు ప్రాంతాలలో భారత భూభాగంలోకి చైనా దళాలు చొరబడిన సందర్భంగా భారత్,చైనా దళాలు ముఖాముఖి తలపడ్డాయి.అలాగే గత నెలలో ఉత్తర సిక్కింలో మరియు లడఖ్‌లోని ఎత్తైన పాంగోంగ్ సరస్సు ఒడ్డున భారత్, చైనీస్ సైనికులు ఒకరిపై ఒకరు ముష్టి యుద్ధం చేయగా ఇరువైపులా సైనికులకు గాయాలైనట్లు వార్తలు వచ్చాయి.

1962 భారత్-చైనా యుద్ధ సమయం నుంచి వివాదాస్పద ప్రాంతాలలో ఒకటైన గాల్వన్ నది ఏరియా,టిబెటన్ పీఠభూమిలో 14 వేల అడుగుల ఎత్తులో ప్యాంగాంగ్ త్సో హిమానీ సరస్సు ప్రదేశాలు తమవేనని ఇరు దేశాలు వాదిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల 1962 ఫ్లాష్ పాయింట్ వద్ద చైనా దూకుడును ప్రదర్శిస్తుంది. అక్కడ నిర్మాణ కార్యకలాపాలను పెంచుతూ గాల్వన్ నదికి సమీపంలో చైనా గుడారాలు వేసింది.ఈ నేపథ్యంలో వచ్చిన నివేదికల ఆధారంగా భారతదేశం ఈ ప్రాంతంలో సరిహద్దు భద్రతా దళాల పెట్రోలింగ్‌ను పెంచింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి