iDreamPost

విశాఖ బాధితులకు ముఖ్యమంత్రి పరామర్శ

విశాఖ బాధితులకు ముఖ్యమంత్రి పరామర్శ

విశాఖ ఎల్జీ పాలీమర్స్ కంపెనీలో స్టెర్లిన్ గ్యాస్ లీకేజీ ప్రమాదంలో అస్వస్థతకు గురై విశాఖ కింగ్ జార్జి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. తాడేపల్లి నుంచి విశాఖకు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమానాశ్రయం నుంచి నేరుగా కేజీహెచ్ కు చేరుకున్నారు.

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, విశాఖ జిల్లా ఇన్చార్జి మంత్రి కురసాల కన్నబాబు, పట్టణ, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తదితరులతో కలిసి ఆస్పత్రికి వెళ్లిన సీఎం జగన్ బాధితుల దగ్గరికి వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అస్వస్థతకు గురైన వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ల దగ్గర ఆరా తీశారు. ప్రమాదం జరిగిన తీరును, ఆ సమయంలో ఏర్పడిన ఇబ్బందుల గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఎల్జీ పాలిమర్ కంపెనీ నుంచి వేకువజామున లీకైన స్టెర్లిన్ గ్యాస్ చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది. ఫలితంగా స్థానికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తెల్లవారుజామున ఈ ఘటన జరగడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు ఆసుపత్రి పాలయ్యారు. పశువులు, పక్షులు కూడా మృత్యువాత పడ్డాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి