iDreamPost

Chennai Floods 2023: చెన్నై వరదలు.. అధికారుల తీరుపై విశాల్‌ ఆగ్రహం!

మిచౌంగ్‌ తుఫాను కారణంగా చెన్నైలోని పలు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. జనజీవనం అస్తవ్యస్తం అయింది. వరద పరిస్థితులపై హీరో విశాల్‌ తాజాగా స్పందించారు.

మిచౌంగ్‌ తుఫాను కారణంగా చెన్నైలోని పలు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. జనజీవనం అస్తవ్యస్తం అయింది. వరద పరిస్థితులపై హీరో విశాల్‌ తాజాగా స్పందించారు.

Chennai Floods 2023: చెన్నై వరదలు.. అధికారుల తీరుపై విశాల్‌ ఆగ్రహం!

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మిచౌంగ్‌ తుఫాను ప్రభావం భారీగా కనిపిస్తోంది. భారీ నుంచి అతి భారీగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా పలు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ముఖ్యంగా భీకర వర్షాల కారణంగా తమిళనాడు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పటికే చెన్నైలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయన్న సంగతి తెల్సిందే. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో నటుడు విశాల్ చెన్నై వాసులను ఉద్ధేశించి మాట్లాడుతూ తమిళనాడు ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించాడు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

సాధారణంగా సినీ నటీ నటులు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించడానికి ఆలోచిస్తూ ఉంటారు. కానీ, హీరో విశాల్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటారు. తాజాగా చెన్నై వరదలకు సంబంధించి హీరో విశాల్ అధికారులను నిలదీశాడు. ఈ మేరకు చెన్నైలోని పరిస్థితులను ఉద్దేశించి తన ట్విటర్‌ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. “చెన్నై మేయర్ ప్రియా రాజన్ గారు, గ్రేటర్ చెన్నై కార్పోరేషన్ కమిషనర్, ఇతర అధికారులు.. మీరంతా క్షేమంగా మీ కుటుంబంతో కలిసి హాయిగా ఉన్నారా? మీ ఇంట్లోకి డ్రైనేజీ నీళ్లు రాలేదు కదా? నిత్యావసర సరుకులు మీ ఇంటికే వస్తున్నాయ్ కదా?.

కానీ మీరు ఓ సాధారణ ఓటరు, సాధారణ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నారా? మీ చుట్టుపక్కన పరిసరాలలో ఉన్న ప్రజలు ఎలా కష్టాలు పడుతున్నారో చూస్తున్నారా? మీరున్న ఈ సిటీలోనే మేము ఉన్నాం. కానీ మీలాంటి స్థితిలో మేం లేము. తుఫాను నీళ్ల డ్రైన్ ప్రాజెక్ట్ చేసింది చెన్నై కోసమా? సింగపూర్ కోసమా?. 2015లో మేం అంతా ముందుకు వచ్చి సహాయం చేశాం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మేము సహాయం చేసేందుకు ఎప్పుడూ సిద్దంగానే ఉంటాం. ఎనిమిదేళ్ల తరువాత కూడా అలాంటి పరిస్థితే. అంతకు మించి దారుణ పరిస్థితులు ఎదురయ్యాయి. ఆహారం, మంచినీరు, కనీస సదుపాయాలు అందించేందుకు మేం సిద్దంగానే ఉన్నాం.

కానీ, ఈ సారి మీ అధికార ప్రతినిధులు, నియోజకవర్గ ప్రతినిధులు అందరూ ముందుకు రావాలి. ఈ ఆపద సమయంలో వారు అందరినీ ఆదుకోవాలి. ఇలా రాయాల్సి వస్తున్నందుకు నాకే సిగ్గుగా ఉంది. మీరేమీ అద్భుతాలు సృష్టిస్తారని ఆశపడటం లేదు. కనీసం మీ బాధ్యతను నిర్వర్తిస్తే చాలు” అంటూ విశాల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరి చెన్నైలోని పరిస్థితులను ఉద్దేశించి హీరో విశాల్ ప్రభుత్వ అధికారులు, నాయకులను ప్రశ్నించిన తీరుపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి