iDreamPost

మళ్లీ గ్లాసు మీద మనసుపడ్డావా బాబు!

మళ్లీ గ్లాసు మీద మనసుపడ్డావా బాబు!

భవిష్యత్తు బొమ్మ ఏమంత ఆశాజనకంగా కనిపించడం లేదు. మరొకరితో జతకడితే తప్ప బొమ్మ ఆడేటట్లు లేదు. మరి తరుణోపాయం ఏమిటి? అని మథన పడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఒక్కరే కనిపిస్తున్నారు. అతనే జనసేనాని పవన్ కల్యాణ్. తన రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతో ముందు చూపుతో వ్యవహరించే ఆయన మూడేళ్ళ తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటినుంచే ప్రణాళికలు వేస్తూ పవన్ కళ్యాణ్ ను దువ్వే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. తిరుపతి ఉప ఎన్నికల్లో తన పార్టీతో పోటీ పడుతున్న బీజేపీకి జనసేన మద్దుతుగా నిలిచినా సరే.. వకీల్ సాబ్ సినిమా విషయంలో పవన్ పై చంద్రబాబు
బోల్డంత సానుభూతి కురిపించడం వెనుక పరమార్థం అదేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

రాజకీయాలకు పవన్ బలయ్యారట!

తిరుపతిలో టీడీపీ అభ్యర్థి కోసం వీధి వీధి తిరుగుతున్న చంద్రబాబు పలు ప్రచార సభల్లో వకీల్ సాబ్ పవన్ కళ్యాణ్ ను గత రెండు రోజుల నుంచి అదేపనిగా తలచుకుంటున్నారు. వకీల్ సాబ్ సినిమా అదనపు షోలకు, టికెట్ ధరలు పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వని విషయాన్ని ప్రస్తావిస్తూ.. పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఇలా అనుమతివ్వడం ఆనవాయితీగా వస్తోందని, తమ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరూ హీరోల సినిమాలకు అనుమతిచ్చామన్నారు. వకీల్ సాబ్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా.. ఏపీ సర్కారు ఇవ్వకపోవడమేమిటని ప్రశ్నించారు. తనను ప్రశ్నిస్తున్నారన్న కక్షతో సీఎం జగన్ పవన్ సినిమాను బలి చేస్తున్నారని ఆరోపించారు.

ఎన్నిక జరుగుతున్న వేళ.. ప్రత్యర్థిపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టాల్సిన ఒక పార్టీ అధినేత.. మరో పార్టీ అధినేతపై సానుభూతి కురిపించడం చర్చకు తావిస్తోంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు ఇలా వ్యవహరిస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వరుస ఓటములతో పూర్తిగా కుంగిపోయిన టీడీపీ.. ఇకముందు ఒంటరిగా జగన్ పార్టీని ఢీకొట్టే స్థితిలో లేదని చంద్రబాబు నిశ్చితాభిప్రాయానికి వచ్చేశారు. అందుకే మొన్నటి పరిషత్ ఎన్నికల నుంచి కుంటిసాకులతో అర్థాంతరంగా వైదొలిగారు. మూడేళ్ళ తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా నిలబడితే తాను, తన రాజకీయ వారసుడు లోకేష్ మట్టికొట్టుకుపోవడం ఖాయమని భయపడుతున్న బాబు.. ఇప్పటి నుంచే జనసేనానిని మచ్చిక చేసుకుంటే.. ఎన్నికల సమయానికి జోడీ కట్టడం సులువవుతుందని భావిస్తున్నట్లుంది.

నిజానికి చంద్రబాబు, పవన్ పార్టీలు గత సార్వత్రిక ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేసినా.. అధినేతలిద్దరి మధ్య అంతర్గత స్నేహం, ఒప్పందాలు అలాగే ఉన్నాయి. గత ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రచారం చేయకపోవడం దీనికి నిదర్శనం. మరోవైపు పవన్ కూడా అనేక అంశాల్లో టీడీపీని విమర్శించడానికి ఇష్టపడటంలేదు. అందువల్ల వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు మళ్లీ కలిసినా ఆశ్చర్యపోనవసరంలేదు. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా తిరుపతిలో మాట్లాడుతూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

బీజేపీపై పవన్ కినుక

సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్.. ఆ పార్టీ తీరుపై ఏమంత సంతృప్తిగా లేరు. హైదరాబాద్, దుబ్బాక ఎన్నికల్లో ఆయన్ను బీజేపీ చిన్నబుచ్చడాన్ని పక్కన పెడితే.. తిరుపతిలో పోటీ కి సంబంధించి ఆ పార్టీ రాష్ట్ర నేతల తీరుపై జనసేనాని గుర్రుగానే ఉన్నారు. తమ పార్టీ పోటీ చేయాల్సిన స్థానాన్ని బలవంతంగా లాక్కున్నారన్న బాధ పవన్ తో పాటు అతని పార్టీ శ్రేణుల్లోనూ బాగా ఉంది. దాన్ని మనసులో దాచుకొని ఇటీవల ఒకరోజు తిరుపతిలో ప్రచారం చేసి వెళ్లారు. ప్రచార సభలో పవన్ చేసిన ప్రసంగం కూడా కమలానికి ముల్లులా గుచ్చుకుంది.

`స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు విషయంలో కేంద్రం అన్యాయం చేస్తున్నా వైఎస్సార్సీపీ ఎంపీలు పార్లమెంటులో నిలదీయడంలేదని పవన్ చేసిన వ్యాఖ్యలు ఆయనతోపాటు సభలో పాల్గొన్న బీజేపీ నేతలను ఇరకాటంలోకి నెట్టాయి. మొక్కుబడి ప్రచారం చేసి వెళ్లిన పవన్ మరోసారి ప్రచారానికి వస్తారా అన్నది అనుమానమే. బీజేపీతో పొత్తు కొనసాగించడంపై పవన్ వేరే ఆలోచనలు చేస్తున్న సంకేతాలు వెలువడుతున్న తరుణంలోనే చంద్రబాబు పవన్ పై సానుభూతి కురిపిస్తూ పరిస్థితిని సానుకులం చేసుకుంటున్నారు.

Also Read : రాజమహేంద్రవరం : టీడీపీ నిలబెట్టుకుంటుందా..? వైసీపీ జెండా ఎగురవేస్తుందా..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి