iDreamPost

చంద్రబాబు.. ఓ సగటు రాజకీయ నాయకుడు..!

చంద్రబాబు.. ఓ సగటు రాజకీయ నాయకుడు..!

నాలుగు దశాబ్ధాలకుపైబడిన రాజకీయ అనుభవం, 14 ఏళ్లు ముఖ్యమంత్రి, దాదాపు 12 ఏళ్ల ప్రతిపక్ష నేతగా ఘనత.. దేశంలో సీనియర్‌ రాజకీయ నాయకుడుని అని స్వయం ప్రకటిత ర్యాంకు.. ఇవీ క్లుప్తంగా ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గురించి అందరికీ తెలిసినవి. ఇన్నేళ్ల రాజకీయ, పరిపాలన అనుభవం ఉన్న వ్యక్తి వాస్తవంగా పెద్ద ఆస్తిలాంటి వారు. అనుభవంతో చెప్పే సలహాకు మించిన ఆయుధం విపత్కర పరిస్థితుల్లో మరొకటి ఉండదు. అభివృద్ధి అంశాల్లోనూ, విపత్తు సమయాల్లోనూ ఇంత అనుభవం ఉన్న వ్యక్తి నుంచి ఎవరైనా సలహాలు, సూచనలు ఆశిస్తారు. సదరు వ్యక్తి కూడా సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుకు ఇంత అనుభవం ఉన్నా.. ఆయన ఓ సగటు రాజకీయ నాయకుడు మాదిరిగానే ప్రవర్తిస్తున్నారని ఆయన వ్యవహరిస్తున్న తీరుతో స్పష్టంగా తెలుస్తోంది.

ఏలూరులో అంతుచిక్కని వ్యాధి ప్రభలుతోంది. ప్రజలు ఆస్వస్థతతో ఆస్పత్రిపాలవుతున్నారు. ఆ వ్యాధి ఏమిటి..? ఎందుకు వస్తుంది..? అనే దానిపై అధికారులు మల్లగుళ్లాలుపడుతున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోది. వైద్య శాఖ మంత్రి నిరంతరం అక్కడే ఉంటున్నారు. ఈ రోజు సీఎం వైఎస్‌ జగన్‌ బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు. నీటి శాంపిల్స్‌లోనూ, బాధితుల రక్త నమూనాల్లోనూ ఎలాంటి మార్పు లేదు. కల్చర్‌ రిపోర్ట్‌ రావాల్సి ఉంది. నీటి, రక్త నమూనాలను సెంటర్‌ ఫర్‌ సెల్యూలర్‌ అండ్‌ మాలిక్యూలర్‌ బయాలజీ (సీసీఎంబీ)కి ప్రభుత్వం పంపింది. వాటిని విశ్లేషించిన తర్వాత సీసీఎంబీ ఏం చెబుతుందో తెలియాల్సి ఉంది.

ఇలా పాలకులు, ప్రభుత్వ యంత్రాంగం క్షణం తీరకలేకుండా.. అంతుచిక్కని వ్యాధిపై పోరాటం చేస్తుంటే.. చంద్రబాబు నాయుడు సగటు రాజకీయ నాయకుడు మాదిరిగా.. చౌకబారు విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ చేతగాని తనం వల్లే ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయనట. చేతగాని ప్రభుత్వం కారణంగానే ప్రజల ప్రాణాలు పోతున్నాయట. నిత్యం పారిశుధ్యం నిర్వహిస్తే ఇలాంటి సమస్యలు రావట. అవగామన లేకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోందట.. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలట. ఏలూరులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలట.. ఇలా సాగింది ఏలూరు ఘటనపై చంద్రబాబు గారి స్పందన.

ప్రభుత్వం ఏమి చేస్తుందో ప్రజలు అందరూ చూస్తున్నారు. బాధితులకు పరీక్షలు చేస్తున్నారు. కలెక్టర్‌ నివేదిక కూడా ఇచ్చారు. ఇంకా అంతుచిక్కలేదని చెప్పారు. కానీ అంటు వ్యాధి కాదని చెప్పి ప్రజల్లో ఆందోళనలను తగ్గించారు. బాధితుల్లో కొంత మంది కోలుకుని ఇళ్లకు కూడా వెళ్లారు. మరికొంత మంది చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి ఇలా ఉంటే.. చంద్రబాబు మాత్రం జూమ్‌లోకి వచ్చి తనదైన శైలిలో విమర్శలు చేసి వెళ్లిపోయారు. బాధితులకు ధైర్యం చెప్పడం, ఏమీ కాదని భరోసా ఇవ్వడం లాంటి మాత్రం చేయలేదు. ప్రజల్లో ఇప్పటికే ఉన్న ఆందోళనలను ఇంకా పెంచేలా.. ప్రభుత్వం ఏమీ చేయడంలేదంటూ దుమ్మెత్తిపోస్తుండడం చంద్రబాబు రాజకీయ శైలిని తేటతెల్లం చేస్తోంది. గోదావరి పుష్కరాలలో తొక్కిసలాట జరిగి 29 మంది చనిపోతే.. ఏం కుంభమేళాలో చనిపోలేదా..? అంటూ సీఎం హోదాలో మాట్లాడిన చంద్రబాబు నుంచి ఇంత కన్నా ఏమీ ఆశించలేమనేది ఆయననెరిగిన వారు చెప్పే మాట.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి