iDreamPost

రోజురోజుకు పడిపోతున్న చంద్రబాబు గ్రాఫ్

రోజురోజుకు పడిపోతున్న చంద్రబాబు గ్రాఫ్

ప్రజల మనస్సు గెలుచుకున్న నాడే రాజకీయ పార్టీ మనుగడ సాధ్యం అవుతుంది అనేది కాదనలేని సత్యం. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టుకొచ్చి కొంతమేర ప్రభావం చూపకలిగినా చివరికి ప్రజాభిమానం చూరగొనలేక కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ రాష్ట్రంలో అన్ని ఒడిదుడుకులు ఎదుర్కుని స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి చేతిలో పురుడుపోసుకున్న తెలుగుదేశం పార్టీ మాత్రం దశాబ్దాల పాటు రాజకీయాలను శాసించింది . ఎన్.టీ.ఆర్ హయాంలో ఒకానొక దశలో జాతీయ స్థాయిలో కీలక శక్తిగా ఎదిగింది.

1995 వరకు నందమూరి తారక రామారావు చేతిలో ఒక వెలుగు వెలిగిన పార్టీ పగ్గాలు హోటల్ వైస్రాయి ఉదంతంతో నారా చంద్రబాబు నాయుడు చేతికి వచ్చాయి. రామారావు మరణం తరువాత సిద్ధాంతాలను మార్చుకున్న తెలుగుదేశం పేద ప్రజలకు దూరంగా జరుగుతూ , కార్పొరేట్ సంస్థలకి దగ్గరగా చేరింది. అన్ని ఇజాలు పోయి టూరిజం ఒక్కటే మిగిలింది అని చెప్పే స్థాయిలో కార్పొరేట్ దిగ్గజాల దగ్గర శిష్యరికం చేసింది. ఏ పార్టీనీ వదలకుండా అన్నీ పార్టీలతో పొత్తులు అంటూ అంటకాగింది. అయితే 2004లో వై.యస్ చేతిలో తగిలిన దెబ్బతో 2014 వరకు ప్రతిపక్ష పాత్రకే పరిమితం అయింది.

2014లో రాష్ట్ర విభజన నేపధ్యంలో అనుభవం అనే ప్రాతిపదికన , బీజేపీ ఇంకా అనేక పార్టీల మద్దతు వలన తెలుగుదేశానికి ప్రజలు మరో అవకాశం ఇవ్వడంతో అధికారంలోకి వచ్చినా, తన పాత పద్దతిని విడకుండా ప్రజలకి ఆకాశ హార్మ్యాలు అద్భుత కట్టడాలు అంటు ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు, నేను మారాను అని చెప్పి మ్యానిఫెస్టోలో ఇచ్చిన 650 హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చకుండా కాలం వెల్లబుచ్చారు. ఒకానొక దశలో తూర్పు గోదావరిలో జరిగిన జన్మభూమి సభలో నేను హామీలు నెరవేర్చలేను అని చెప్పేసారు. ప్రజలకు నేను తప్ప వేరే దిక్కేదీ అనే బ్రమలోకి వెళ్ళీ హామీలు నెరవేర్చమని అడిగిన ప్రజలపై చిందులు తొక్కారు. నన్నే అడుగుతావా అని వారిని గద్దించారు. ఇంచుమించు నియంతలకు ఏమాత్రం తాను తీసిపోను అన్నట్టు ప్రవర్తించారు.

దీనికి తోడుగా ప్రజల్లో అసంతృప్తి ఇసుమంతైనా లేదు, చంద్రబాబు పాలనలో ప్రజలందరు సంతృప్తిగా ఉన్నారు అనే విధంగా అనుకూలా మీడియా చానల్లు, పత్రికల ద్వారా ఓట్లు వేసిన ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడంతో విసిగిపోయిన ఓటర్లు తెలుగుదేశంపార్టీకి దూరంగా జరగడం ప్రారంభించారు. ఈ నేపధ్యంలో జరిగిన ఎన్నికల్లో 5ఏళ్ళు ప్రజా పక్షాన నిలిచి తెలుగుదేశం విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చెసి తన నాయకత్వ పటిమను, సమర్ధతను నిరూపించుకున్న వై.యస్ జగన్ వైపు ప్రజలు మోగ్గు చూపడంతో ఆయన ఈ రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు కనివిని ఎరగని మెజారిటి సీట్లు సాధించి ముఖ్యమంత్రి అవ్వగా , ప్రజలను తన అహంకారంతో మభ్యపెట్ట ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీకి గతంలో ఎన్నడు చవిచూడని ఓటమిని ప్రజలు అందించి కేవలం 23 స్థానాలకు పరిమితం చేశారు.

ఓటమి సహజం కానీ ఓటమినుండి గుణపాఠం నేర్చుకుని తప్పులని సరిద్దికున్న నాడే గెలుపు తలుపు తట్టే అవకాశం కలుగుతుంది . కానీ తెలుగుదేశం మాత్రం ఓటమి తదనంతరం కూడా తాను చేసిన తప్పుల నుండి గుణపాఠం నేర్చుకోకపోగా మరింత అహంకార భావం ప్రదర్శించి ప్రజల నాడిని తెలుసుకోలేక పోతుంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి వై.యస్ జగన్ ప్రవేశపెట్టి ప్రజాభిమానం చూరగొన్న గ్రామవాలంటీర్ లాంటి అనేక విప్లవాత్మకమైన సంస్కరణలను ప్రజల నాడి తెలుసుకోకుండా నేరుగా విమర్శలకు దిగి ప్రజల్లో మరింత చులకనయ్యారు.

తన హయంలో 5ఏళ్ళ సమయంలో మ్యానిఫెస్టోని అమలు చేయకపోగా, నేటి ప్రభుత్వం ఏడాదిలోనే తాను ఇచ్చిన హామీల్లో 90% హామీలు నెరవేర్చిన,, వాటి పై నిందలు మోపే ప్రయత్నం చేసి రాజకీయంగా తమలో ఉన్న డొల్లతనాన్ని బయటపెట్టుకున్నారు. ఏడాదిలో ప్రభుత్వపరంగా జగన్ సక్సెస్ అయితే తెలుగుదేశం మాత్రం అసత్యాలు , అర్ధసత్యాల ప్రచారంతో ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత సంపాదించుకుంది. సాదారణంగా ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలబడటం జరగని పని కానీ రాష్ట్రంలో మాత్రం ఇంగ్లీషు మీడియం వ్యవహారంలో ప్రభుత్వానికి ప్రజలనుండి 90% మద్దతు వచ్చిందంటే ప్రతిపక్షంగా తెలుగుదేశం ఎంత దారుణంగా విఫలమైందో అర్ధం చేసుకోవచ్చు.

ఇప్పటివరకు ఆ పార్టీకి తరాలుగా అండగా ఉన్న వర్గాలు ఒక్కొక్కరు ఆ పార్టి వైఖరిపై పూర్తిగ నమ్మకం కోల్పోయి దూరంగా జరుగుతూ వచ్చారు. ఈ పరిణామం తో ఖంగుతిన్న ఆ పార్టీ నాయకులు కూడా ఇప్పుడు ఒక్కొక్కరిగా తమ దారి చూసుకోవడం ప్రారంభించారు. ఇప్పటికే పలువురు నేతలు ఆ పార్టీని వీడి నేరుగా ఆ పార్టీ విదివిధానాలపై తమ అసంతృప్తి గళం వినిపించగా , రాబోయే కాలంలో మరో 10 మంది వరకు ఆ పార్టీకి నీళ్ళు వదిలే రోజులు రాబోతున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. ఒకప్పుడు ప్రజలు, కార్యకర్తలు, నాయకులతో కళ కళ లాడిన ఆ పార్టీ కార్యాలయాలు కార్యకర్తలు , నాయకులు లేక బోసిపోతున్నాయి. చూడబోతే ప్రజల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయిన తెలుగుదేశం పార్టీ పతనానికి అంచున ఉన్నట్టు కనిపిస్తుంది. చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశానికి ఇవి అంతిమ ఘడియలుగా ప్రజలు చర్చించు కోవడం విశేషం..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి