iDreamPost

బాబు సినిమా చరిత్ర చిన్నదేం కాదు..గతం మరచిపోయి మాట్లాడడమే విడ్డూరం

బాబు సినిమా చరిత్ర చిన్నదేం కాదు..గతం మరచిపోయి మాట్లాడడమే విడ్డూరం

విపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇటీవల గతాన్ని పూర్తిగా మరచిపోయినట్టు కనిపిస్తోంది. తన హయంలో సాగించిన వ్యవహారాలను ఆయన పూర్తిగా విస్మరించి మాట్లాడుతున్నారు. తనలానే అందరూ గతాన్ని మరచిపోవాలని ఆశిస్తున్నారు. చివరకు సినిమాల విషయంలో సైతం చంద్రబాబు తీరు దానికి అద్దంపడుతోంది. పవన్ కళ్యాణ్ పట్ల అవిభాజ్యప్రేమను చాటుతున్నట్టు భావించాల్సి వస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు సైతం ఆటంకాలు పెట్టిన చంద్రబాబు ఇప్పుడు పవన్ విషయంలో వత్తాసు పలకడాన్ని మంత్రి పేర్ని నాని కూడా ఎద్దేవా చేయాల్సి వచ్చింది.

చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఏపీ పాలనా వ్యవహారాల్లో ప్రదర్శించి అశ్రితపక్షపాతం జనం ఇంకా మరచిపోలేదు. చంద్రబాబు మరచిపోతుంటే గుర్తు చేస్తున్నారు కూడా. తాజాగా భీమ్లా నాయక్ విషయంలో టీడీపీ తీరు చూసి మరోసారి గతంలోకి వెళ్లాల్సిన పరిస్థితి అందరికీ ఏర్పడింది. ఒక్కో సినిమాకు ఒక్కో ‘లా’ చంద్ర‌బాబు వ్యవహరించిన విషయాన్ని తెలియాల్సి వచ్చింది. తన వియ్యంకుడు సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు పలు రాయితీలు ప్రకటించిన చంద్రబాబు, అదే సమయంలో విడుదలయిన రుద్రమదేవికి మాత్రం దానిని వర్తింపజేసేందుకు నిరాకరించడం జనం మరచిపోలేదు. అల్లు అర్జున్ హీరోగా, గుణశేఖర్ తీసిన సినిమాకు రాయితీలు ఇవ్వకుండా తమ మనుషులకు అవకాశాలు కల్పించడం చంద్రబాబు పాలనలోనే జరిగింది.

జగన్ ప్రభుత్వం మాత్రం విధానపరమైన నిర్ణయం తీసుకుని అన్ని సినిమాలకు అదే వర్తింపజేస్తోంది. ఇప్పటికే అఖండ, పుష్ప సినిమాలకు వర్తించిన నిబంధనలనే భీమ్లానాయక్ కి కూడా అమలుచేసింది. అంతకుముందు బంగర్రాజు కూడా అదే పద్ధతి వర్తింపజేశారు. చంద్రబాబు మాదిరి ఒక్కో సినిమా, ఒక్కో హీరో పట్ల ఒక్కో విధంగా వ్యవహరించకుండా అన్ని సినిమాలకు, అందరి హీరోలకు అవే నిబంధనలంటూ ప్రభుత్వం తేల్చిచెప్పింది. కానీ నిబద్ధతగా వ్యవహరించడాన్ని చంద్రబాబు తప్పు బట్టడం, తన హయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైనం విస్మరించడం విడ్డూరంగా మారింది.

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన జనతా గ్యారేజ్ సినిమా విడుదలకు 2016లో పలు థియేటర్లలో అడ్డంకులు పెట్టిన అనుభవం బాబు ప్రభుత్వంలోనే జరిగింది. ఇతరులకు అవకాశం ఇచ్చి ఎన్టీఆర్ సినిమాలకు అడ్డంకులు పెట్టిన చరిత్ర ఉంది. అంతేగాకుండా చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మక చిత్రం ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సైతం అనుమతులు నిరాకరించిన సంగతి బాబు మరచిపోయినా ప్రేక్షకులు మరచిపోలేదు. అప్పట్లో ఆ సినిమా వేడుకని హాయ్ ల్యాండ్ కి పరిమితం చేసుకోవాల్సి వచ్చింది. ఇలా అడ్డందిడ్డంగా వ్యవహరించిన చంద్రబాబు జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ సినిమా రంగం గురించి మొసలికన్నీరు పెట్టడం ఆయన నైజాన్ని చాటుతోంది. సొంత కుటుంబాన్ని, తన వెంట నడిచిన నాయకులను సైతం వదిలిపెట్టకుండా వంచించిన చంద్రబాబు ఇప్పుడు సినీ రంగానికి ఏదో జరిగిపోయిందంటూ మాట్లాడడం విచిత్రంగా కనిపిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి