iDreamPost

బాబు నమ్మకం అదే..!

బాబు నమ్మకం అదే..!

అబద్ధాన్ని పదేపదే చెప్పడం ద్వారా దాన్ని నిజం అని నమ్మించవచ్చంటారు. ఇదే బాటలో పయనిస్తున్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఒక అసత్యాన్ని పదే పదే చెప్పడం ద్వారా ప్రజలను నమ్మించాలని బాబు నిత్యం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. తాజాగా మహిళా దినోత్సవం రోజున కూడా అవే అబద్ధాలు చెబుతూ మహిళలను నమ్మించాలని చూశారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేశామని చెప్పుకొచ్చారు చంద్రబాబు.

మహిళా దినోత్సవం వేడుకల్లో మహిళల అభ్యున్నతికి చేసిన పనులను, తీసుకున్న నిర్ణయాలను సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి వివరించారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యతను సీఎం జగన్‌ గణాంక సహితంగా వివరించడంతో వైసీపీ సర్కార్‌ మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యత అందరికీ అర్థం అయింది. దీంతో అప్రమత్తమైన చంద్రబాబు.. తాను కూడా ఏదో ఒకటి చెప్పాలని మైక్‌ అందుకున్నారు. ఆ క్రమంలోనే డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేశామని చెప్పుకొచ్చారు. పనిలోపనిగా జగన్‌పై విమర్శలు చేశారు. టీడీపీ హయాంలో మహిళలకు ఇళ్లు ఇస్తే.. జగన్‌ ప్రభుత్వం ఓటీఎస్‌ పేరుతో ఎదురు డబ్బులు వసూళ్లు చేస్తోందని విమర్శలు గుప్పించారు.

చంద్రబాబు చెప్పిన రెండు అంశాలలో పూర్వాపరాలను పరిశీలిస్తే.. ఆయన చెప్పినవి పచ్చి అబద్ధాలని ఇట్టే తెలిసిపోతుంది. డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేస్తామని, చేయకపోవడంతో ఆయా సంఘాలు రుణాల ఎగవేతదారులుగా మారిపోయాయి. 2014 ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే టీడీపీ అధికారంలోకి వస్తే.. రుణాలు మాఫీ చేస్తామని, ఎవరూ వాయిదాలు కట్టవద్దంటూ స్వయంగా చంద్రబాబే చెప్పారు. ఆయా రుణాలు మొత్తం 14,200 కోట్ల రూపాయలు కాగా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీని బాబు అటకెక్కించారు. బాబు మాటను నమ్మిన కొన్ని డ్వాక్రా సంఘాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. పాత రుణాలు అలాగే ఉండడం, కొత్త రుణాలు లేకపోవడంతోపాటు.. పాత రుణాలు వడ్డీ, అపరాద రుసుముతో కలిపి చెల్లించాలంటూ బ్యాంకులు నోటీసులు జారీ చేశాయి. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే.. చంద్రబాబు మాత్రం.. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేశామని చెబుతున్నారు.

ఉచితంగా ఇళ్లు ఇచ్చామని చంద్రబాబు చెబుతున్న విషయం కూడా అబద్ధమే. టీడీపీ ప్రభుత్వ హయాంలో అపార్ట్‌మెంట్‌ తరహాలో ఇళ్లు నిర్మించి ఇస్తామని లబ్ధిదారుల వాటాగా లక్ష, 50 వేలు, 500 రూపాయల చొప్పన కట్టించుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాగా మూడు లక్షల రూపాయలతోపాటు బ్యాంకుల నుంచి మూడు లక్షల రూపాయల రుణాలు ఇప్పిస్తామని, ఆ రుణాలు నెల వారీ వాయిదాల రూపంలో 20 ఏళ్లపాటు చెల్లించేలా ‘అందరికీ ఇళ్లు’ అనే పథకం ప్రవేశపెట్టారు. లబ్ధిదారుల నుంచి డబ్బులు కట్టించుకున్న టీడీపీ సర్కార్‌.. ఇళ్లు అరకొరగా నిర్మించినా.. ఐదేళ్లలో ఒక్క ఇళ్లు కూడా ఇవ్వలేదు. జగన్‌ సర్కార్‌ వచ్చిన తర్వాత ఆయా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి, మౌలిక వసతులు కల్పించి ఇస్తోంది. ఓటీఎస్‌ పేరుతో ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల రుణాలను మాఫీ చేసి, లబ్ధిదారులకు ఇంటిపై శాశ్వతహక్కులు కల్పిస్తోంది. తద్వారా అది వారికి స్థిరాస్తిగా ఉపయోగపడుతోంది. అవసరానికి తాకట్టు పెట్టడం, లేదా అమ్ముకునే అవకాశం ఓటీఎస్‌ ద్వారా లభిస్తోంది.

అంతేగాక.. 30 లక్షలమంది మహిళలకు ఉచితంగా ఇళ్ల పట్టాలను జగన్‌ సర్కార్‌ గత ఏడాది పంపిణీ చేసింది. గ్రామాల్లో సెంటున్నర, పట్టణాలు, నగరాల్లో సెంటు చొప్పన లక్షల రూపాయల విలువైన స్థలాలు మహిళల పేరుపై పట్టాలు ఇచ్చింది. స్థలాలు ఇవ్వడమే గాక అక్కడ ఇళ్లు కూడా నిర్మించి ఇస్తూ.. పేదల సొంత ఇంటి కలను సాకారం చేస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి