iDreamPost

చెప్పింది బాగుంది బాబు.. అదే అసెంబ్లీ లో చెప్పలేకపోయారా..?

చెప్పింది బాగుంది బాబు.. అదే అసెంబ్లీ లో చెప్పలేకపోయారా..?

గతంలో మండలి పునరుద్ధరణ సమయంలో దానిని తమ పార్టీ వ్యతిరేకించన మాట వాస్తవం. అప్పడు అది మా పార్టీ విధానం. తర్వాత పార్టీలో దీనిపై చర్చ జరిగినప్పుడు అసెంబ్లీకి రాలేని బడుగు వర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పించడం కోసం మండలి ఉండాలన్న అభిప్రాయం వచ్చింది. దానితో మా పార్టీ విధానం మార్చుకున్నాం… ఇదీ మండలి రద్దుకు శాసన సభ ఆమోదించిన తర్వాత నిన్న రాత్రి విలేకర్ల సమావేశంలో చంద్రబాబు చెప్పిన మాటలు.

మండలి రద్దును వ్యతిరేకిస్తున్న చంద్రబాబు తన వాదనను పై విధంగా వినిపించారు. చంద్రబాబు వాదన బాగుందని రాజకీయ విశ్లేషకలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజలను మెప్పించేలాగా చంద్రబాబు మాట్లాడారని పేర్కొంటున్నారు. అయితే ఇదే విషయం శాసన సభలో చెప్పి ఉంటే ఇంకా బాగుండేదని చెబుతున్నారు.

మండలి రద్దుపై నిన్న సోమవారం శాసన సభలో జరిగిన ఒక్క రోజు స్వల్ప కాలిక చర్చకు టీడీపీ హాజరు కాకపోవడంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. 40 ఏళ్ల సీనియారిటీ, మూడు సార్లు ముఖ్యమంత్రి, మూడు సార్లు ప్రతిపక్ష నేతగా పని చేసిన చంద్రబాబు అసెంబ్లీకి కావాలనే గౌర్హాజరవ్వడం సరైన విధానం కాదంటున్నారు. గతంలో ప్రతిపక్ష నేత సభను బహిష్కరించిన సమయంలో చంద్రబాబు చేసిన విమర్శలును ఇప్పుడు గుర్తుచేస్తూ చంద్రబాబు తీరును తప్పుబడుతున్నారు. అప్పుడు వైఎస్సార్‌సీపీ పారిపోయిందని టీడీపీ ఆరోపించగా.. ఇప్పుడు టీడీపీ చేసిందేమిటని..? ప్రశ్నిస్తున్నారు.

ఒక సభ గురించి మరొక సభలో చర్చించడం రాజ్యాంగ విర్ధుమని, అందుకే తాము హాజరుకావడంలేదని చంద్రబాబు చెప్పిన కారణం సహేతుకంగా లేదన్నది వాస్తవం. శాసన మండలి పునరుద్ధరణను అప్పట్లో వ్యతిరేకించిన చంద్రబాబు క్లిప్పింగులు నిన్న సభలో ప్రదర్శించారు. చంద్రబాబు తీరును ప్రజలందరూ గమనించారు. చంద్రబాబును యూటర్న్‌ నేతగా వైఎస్సార్‌సీపీ చూపిస్తోంది. ప్రజలు కూడా దాన్ని నమ్మేలా ఉన్నారు. చంద్రబాబు నిన్న సభకు హాజరై.. విలేకర్ల సమావేశంలో చెప్పిన విషయాన్నే.. చెప్పి ఉంటే నష్టం తక్కువ జరిగేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరి బాబు ఇదే విషయం సభలో ఎందుకు చెప్పలేకపోయారోనని టీడీపీ ఎమ్మెల్యేలైనా అడుగుతారా..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి