iDreamPost

మా బాబే.. ఏం చెప్పారు..!

మా బాబే.. ఏం చెప్పారు..!

గొప్పలు చెప్పుకోవడంలో చంద్రబాబుకు సాటి మరొకరు లేరంటారు. అంతేకాదు అధికారంలో ఉన్నప్పడు అది చేస్తా.. ఇది చేస్తానని చెప్పి.. తీరా అ పనులు చేయకపోవడంతోనే 2019 ఎన్నికల్లో ప్రజలకు బాబుకు గట్టి గుణపాఠం చెప్పారు. అయినా బాబు తీరు మాత్రం మారలేదు. అధికారంలో ఉండి చేయగలిగి ఉన్నా చేయకుండా.. తీరా ప్రజలు కుర్చి నుంచి దింపేసిన తర్వాత.. నేను గాని ఉంటే.. లాంటి మాటలను చంద్రబాబు మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా.. తన వ్యవహార శైలి మాత్రం మారదని నిరూపించుకుంటూనే ఉన్నారు.

ఇటీవల కొద్ది రోజులుగా చంద్రబాబు.. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలు, ముఖ్య కార్యకర్తలతో జూమ్‌ యాప్‌ ద్వారా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారు. బుధవారం ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ నేతలతో జూమ్‌ మీటింగ్‌ పెట్టారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. టీడీపీ గానీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే.. ఈ పాటికి వెలిగొండ ప్రాజెక్టు పూర్తయ్యేదని చెప్పుకొచ్చారు.

చంద్రబాబు మాటలు విన్న, ఉదయం పత్రికల్లో ఆయన మాటలు చదవిన ప్రకాశం జిల్లా ప్రజలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జిల్లాకు వచ్చిన ప్రతి సందర్భంలో వెలిగొండ ప్రాజెక్టు పూర్తిపై చెప్పిన మాటలు గుర్తుచేసుకుని నోటితో నవ్వడంలేదు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో వెలిగొండ ప్రాజెక్టు పూర్తిపై హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఆ తర్వాత ఐదేళ్లలో మాటలు తప్పా ప్రాజెక్టు పూర్తిపై శ్రద్ధపెట్టలేదని బాబు వివిధ సందర్భాల్లో ప్రజల సాక్షిగా మాట్లాడిన మాటల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది.

2015 మార్చి 14వ తేదీన ప్రకాశం జిల్లా మార్కాపురం పర్యటనకు వచ్చిన చంద్రబాబు… వెలిగొండ ప్రాజెక్టును 2016 సెప్టెంబర్‌ నాటికి పూర్తి చేస్తామన్నారు. మళ్లీ మరుసటి ఏడాది అంటే.. 2016 ఏప్రిల్‌ 16వ తేదీన మార్కాపురం పర్యటనకు వచ్చిన బాబు ఈ సారి అదే మాట చెప్పారు. కానీ తేదీ మార్చారు. 2017 చివరి నాటికి వెలిగొండ పూర్తి చేస్తామన్నారు. 2018 జనవరి 2వ తేదీన దర్శి పర్యటనకు వచ్చిన చంద్రబాబు.. వెలిగొండ ప్రాజెక్టును 2018 జూన్‌ నాటికి పూర్తి చేస్తామన్నారు. 2018 ఏప్రిల్‌లో కందుకూరు వచ్చిన సందర్భంగా వెలిగొండ ప్రాజెక్టును 2018 డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తానన్నారు. ఇక చివరగా.. 2018 జూలై 28న ఒంగోలు పర్యటనకు వచ్చినప్పుడు కూడా వెలిగొండ ప్రాజెక్టుపై మాట్లాడారు. ఈ సారి వెలిగొండ ప్రాజెక్టును 2019 సంక్రాంతి నాటికి పూర్తి చేస్తానన్నారు.

మొత్తంగా నాలుగుసార్లు వెలిగొండ ప్రాజెక్టును చంద్రబాబు పూర్తి చేశారు. అలాంటిది మళ్లీ.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగా.. నేను మళ్లీ వచ్చుంటే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసేవాడినంటున్నారు. ఇలాంటి విశ్వసనీయతలేని మాటలు చెప్పడం వల్లే గత ఎన్నికల్లో ప్రజలు బాబును శంకరగిరి మాన్యాలు పట్టించారని అర్థం అవుతోంది. అయినా కూడా బాబు తన తీరు మాత్రం మార్చుకోకపోవడమే ఆశ్చర్యంగా ఉంది.

కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలోని కరువు ప్రాంతాలకు వరప్రదాయని అయిన పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులను దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా ప్రారంభించారు. కొండల మధ్య గ్యాప్‌లను కాంక్రీట్‌తో పూర్తి చేశారు. 18 కిలోమీటర్ల మేర రెండు సొరంగాలు కొండల నుంచి శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ వరకూ తొలచాలి. ఇందు కోసం ప్రత్యేకంగా జపాన్‌ నుంచి యంత్రాలను తెప్పించి సొరంగాలు తవ్వించే పనులు ప్రారంభించారు. అయితే వైఎస్సార్‌ మరణం తర్వాత వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రులు వెలిగొండ ప్రాజెక్టుపై సీతకన్ను వేశారు. దీనికి చంద్రబాబు కూడా అతీతుడుకాదని పైన పేర్కొన్న ఆయన హామీలను బట్టి స్పష్టంగా తెలుస్తుంది. అధికారంలోకి రావాలన్నా.. వచ్చిన తర్వాత ఆ అధికారం నిలబడాలన్నా.. నెరవేర్చగలిగిన మాటే చెప్పాలి. చెప్పిన మాటను తు.చ. తప్పకుండా అమలు చేయాలన్న విషయం బాబుకు ఇంకెప్పుడు అర్థం అవుతుందో..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి