iDreamPost

సీఎం జగన్ కు అమిత్ షా ఫోన్

సీఎం జగన్ కు అమిత్ షా ఫోన్

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఫోన్‌ చేశారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ మరో రెండు రోజుల్లో ముగియనుండటంతో దీన్ని కొనసాగించాలా..? వద్దా..? అనేదానిపై కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలో రెండు రోజుల నుంచి అన్ని రాష్ట్రాల సీఎంలకు అమిత్‌ షా ఫోన్ చేసి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌కు కాల్ చేసి రాష్ట్రాల్లో పరిస్థితులు, కరోనా కట్టడికి అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు. అదే విధంగా లాక్ డౌన్ సడలింపుల తర్వాత కేసులు ఉధృతం కావడంపైనా అమిత్‌ షా ఆరా తీశారు. ఈ సందర్భంగా లాక్ డౌన్ మినహాయింపులతో పాటు పలు విషయాలను సీఎం జగన్.. అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

నెలాఖరుతో లాక్‌డౌన్‌ ముగిశాక ఎలాంటి విధానాలు ఉంటే బాగుంటుందన్న అంశాలపైనా ముఖ్యమంత్రులతో అమిత్‌ షా సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రధాన నగరాల్లో అనుసరించాల్సిన విధానాలు.. రాష్ట్రాల వారీగా ప్రత్యేక మినహాయింపులు ఏమైనా కావాలా అనే అంశాలపై కేంద్ర మంత్రి దృష్టి సారించారు. లాక్‌డౌన్‌ ఉపసంహరణ విధివిధానాలపై ప్రధాని మోదీతో సమావేశం తర్వాత సీఎంలకు అమిత్‌ షా ఫోన్‌ చేయడం ప్రారంభించారు.

అంతకు ముందు లాక్‌డౌన్‌ ముగిసే ప్రతి సమయంలోనూ ప్రధాని మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యేవారు. సీఎంల సూచనలు, సలహాలు తీసుకుని లాక్‌డౌన్‌ పొడిగింపు. మినహాయింపులపై నిర్ణయాలు ప్రకటించేవారు. అయితే ఈ సారి అమిత్‌ షా ఫోన్‌ కాల్‌ ద్వారా ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు.

మార్చి 24వ తేదీ అర్థరాత్రి నుంచి దేశంలో లాక్‌డౌన్‌ అమలులో ఉంది. నాలుగు దఫాలుగా లాక్‌డౌన్‌ను పొడిగించారు. మూడో దఫా లాక్‌డౌన్‌ నుంచి పలు మినహాయిపులు ఇచ్చారు. ప్రస్తుతం నాలుగో దఫా లాక్‌డౌన్‌ ఈ నెల 31వ తేదీతో ముగుస్తోంది. లాక్‌డౌన్‌ ప్రారంభంలో దేశంలో 618 కరోనా కేసులు ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 1.58 లక్షలు దాటింది. రోజు రోజుకు కేసులు రెట్టింపు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తారా..? లేదా..? అనేది రేపు లేదా ఎల్లుండితో తేలనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి