iDreamPost

సినిమాలకు స్వేచ్ఛ తగ్గితే

సినిమాలకు స్వేచ్ఛ తగ్గితే

కేంద్ర ప్రభుత్వం సినిమాల మీద కొత్తగా తీసుకురాబోయే ఆంక్షలకు సంబందించిన చట్టాల మీద దేశవ్యాప్తంగా వ్యతిరేకత ఎదురవుతోంది. ఇప్పటికే తమిళ హిందీ నటులు దీని మీద తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేయగా పూర్తిగా అవగాహన లేని కారణంగా మనవాళ్ళూ ఇంకా స్పందించలేకపోతున్నారు. సెన్సార్ జరిగిన సినిమాని లేదా జరగబోయే చిత్రాన్ని ఏ దశలో అయినా ఆపగలిగే లేదా పూర్తిగా నిషేధించే లేదా పలురకాల ఆంక్షలను విధించేలా రూపొందిన చట్టం గురించి ఇప్పటికే తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. అసలు ఏ ఉద్దేశంతో దీన్ని తీసుకొస్తున్నారో బయట పెట్టాలని ఇండస్ట్రీ ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు

అసలే మనోభావాలు మరీ మరీ సున్నితంగా మారిన జెనరేషన్ లో దర్శకులు రచయితలు తమ క్రియేటివిటీకి చాలా కోతలు పెట్టుకోవాల్సి వస్తోంది. ఏ వర్గాన్ని ఉద్దేశించి జోకులు పెట్టినా లేదా సంఘటన ఉదహరించిన వ్యవహారం కోర్టుల దాకా వెళ్తోంది. ఒకప్పుడు ఎన్టీఆర్ అధికారంలో ఉండగానే సూపర్ స్టార్ కృష్ణ దర్శకురాలు విజయ నిర్మల ఆయనకు వ్యతిరేకంగా సినిమాలు చేశారు. ఒకటి ఆడింది మిగిలినవి పోయాయి అది వేరే సంగతి. మాలపిల్లతో మొదలుపెడితే నిన్నా మొన్నటి దేనికైనా రెడీ దాకా ఎన్నో వివాదాల్లో చిక్కుకుని కోర్టులకు వెళ్లి పోరాడి ఎట్టకేలకు విడుదల చేసుకున్నావే

కానీ ఇప్పుడీ చట్టం తీసుకొస్తే తమ ప్రభుత్వ విధానాలను విమర్శించినా లేక ప్రస్తావించినా వాటిని విడుదల కాకుండా ఆపే అధికారం గవర్నమెంట్ కు వచ్చేస్తుంది. ఇది సృజనాత్మకతను దెబ్బ తీస్తుంది. ఒకప్పుడు కోడి రామకృష్ణ లాంటి దర్శకులు వర్తమాన సంఘటనలు ఆధారంగా చేసుకుని భారత్ బంద్ లాంటి గొప్ప పొలిటికల్ థ్రిల్లర్లు తీశారు. ఇప్పుడు మనోభావాలు కోర్టు కేసుల భయంతోనే కొత్త తరం డైరెక్టర్లు వీటిని తీయడమే మానుకున్నారు. ఇప్పుడీ రంగంలో మరిన్ని ఆంక్షలు వస్తే అసలు స్క్రిప్ట్ ని ,ముందు సెంట్రల్ గవర్నమెంట్ కు పంపించి అప్రూవ్ అయ్యాక సినిమా తీసే పరిస్థితి వస్తుందేమోనని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి