iDreamPost

ఇది తప్ప.. ఇంకేం చేయలేం

ఇది తప్ప.. ఇంకేం చేయలేం

రుణాలపై మారటోరియం సమయంలో చక్రవడ్డీ మాఫీ తప్పితే ఇంకేమీ చేయలేమని కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐలు సుప్రీంకోర్టులో తమతమ అఫిడవిట్లలో తేల్చేసాయి. రెండుకోట్ల లోపు రుణాలపై చక్రవడ్డీ మాఫీ చేస్తున్నట్టు ఇది వరకే సమర్పించిన అఫిడవిట్‌కే పరిమితమవుతున్నట్లు చెప్పాయి. ఇంతకు మించి చేస్తే రుణ గ్రహీతలపై భారం పడడంతోపాటు, రుణ చెల్లింపు విధానం దెబ్బతింటుందని చెప్పుకొచ్చాయి.

లాక్డౌన్‌ నేపథ్యంలో మార్చి 1 నుంచి మే 31 కాలానికి రుణాలు, ఈయంఐలు చెలింపు విషయంలో మారటోరియం విధించింది. అయితే ఆ తరువాత పరిణామాల నేపథ్యంలో చక్రవడ్డీ చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సుప్రీం కోర్టులో పలు వాజ్యాలు దాఖలయ్యాయి. వీటికి వివరణగా అఫిడవిట్లు కేంద్ర ప్రభుత్వం, ఆర్బీలు సమర్పించాయి. ఆ తరువాత పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు మరోసారి అందించిన అఫిడవిట్‌లో చక్రవడ్డీ మాఫీ తప్ప ఇంకేమీ చేయలేమంటూ వివరణ ఇచ్చుకున్నాయి.

దేశ ఆర్ధిక వ్యవస్థ, బ్యాంకింగ్‌ విధానాలు, రుణ విధానాలను దెబ్బతినకుండా కాపాడుకోవడం తదితర కారణాల కారణంగా ఇంత వరకు మాత్రమే వెసులుబాటు కల్పిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం, ఆర్బీఐ చెప్పుకొచ్చాయి. దాదాపు ఎనిమిది కేటగిరీల్లో మారటోరియం విధించినట్టు కూడా పేర్కొన్నాయి. వివిధ ప్యాకేజీల్లో భాగంగా 21.70 లక్షల కోట్ల ఉపసమనాలను అందిస్తున్నట్లు కోర్టుకు తెలిపాయి. ప్రస్తుతం సమర్పించిన అఫిడవిట్‌లపై మరో సారి సుప్రీంకోర్టు విచారణ చేయనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి