iDreamPost

అసోం బీజేపీ సీఎం అభ్యర్థి మీద ఎన్నికల సంఘం దెబ్బ

అసోం బీజేపీ సీఎం అభ్యర్థి మీద ఎన్నికల సంఘం దెబ్బ

అసోంలో రెండోసారి అధికార పీఠం అధిష్టించాలనుకుంటున్న భారతీయ జనతాపార్టీ కూటమికి ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. జాతీయ పౌరసత్వ చట్టం, తేయాకు కూలీల సమస్యల విషయంలో ఇప్పటికే వ్యతిరేకత ఎదుర్కొంటున్న అక్కడి బీజేపీ ప్రభుత్వాన్ని గట్టున పడేసి ఎన్నికల్లో ఆ వ్యతిరేకత ప్రభావం చూపకుండా ఉండేందుకు బీజీపీ నాయకత్వం నానా పాట్లు పడుతోంది. వీటికి తోడు ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. బీజేపీ కూటమి సీఎం అభ్యర్థిపైనే ఎన్నికల కమిషన్ వేటు వేసింది.

తుది అంకానికి ముందు గట్టి దెబ్బ

అసోంలో కాంగ్రెస్ కూటమితో హోరాహోరీగా తలపడుతున్న కమలదళానికి జాతీయ పౌరసత్వ సవరణ చట్టం(సీఏ ఏ) పెద్ద ప్రతిబంధకంగా మారింది. గత ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన శర్బానందు సోనేవాల్ నేతృత్వంలోని ప్రభుత్వం కేంద్రం రూపొందించిన సీఏ ఏ చట్టాన్ని రాష్ట్రంలో వెల్లువెత్తిన వ్యతిరేకతలను ఖాతరు చేయకుండా అమలు చేసి అపఖ్యాతిపాలయ్యింది. దీన్ని ఆలస్యంగా గుర్తించిన పార్టీ నాయకత్వం ఎన్నికల్లో ఆ ప్రభావం పడకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఎన్నికల అజెండాలో సీఏఏ ఊసు లేకుండా జాగ్రత్త పడింది. ఏకంగా సీఎం అభ్యర్థినే మార్చేసింది. ప్రస్తుత ముఖ్యమంత్రి సోనేవాల్ స్థానంలో పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి హిమంత్ విశ్వ శర్మను సీఎం అభ్యర్థిగా తెరపైకి తెచ్చింది.

Also Read : దీదీ పిలుపు.. పలికేదెవరు?

అయితే ఇప్పుడు ఆయనపైనే ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. రాష్ట్రంలో బీజేపీ ముఖ్య ప్రచారకర్తగా ఉన్న హిమంత్.. ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ బోడోలాండ్ నేత హాంగ్రామ మోహిలరికి జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. కోక్రాజార్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాల కేసును ఎన్ఐఏకి అప్పగించామని బెదిరింపు ధోరణిలో మాట్లాడటంపై కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయడంతో ఈసీ వివరణ కోరింది. ఆయన ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా రెండు రోజుల నిషేధం విధించింది. శుక్రవారం రాత్రి నుంచే ఇది అమల్లోకి వచ్చింది.

అసోంలో ఈ నెల ఆరో తేదీన తుది విడత పోలింగ్ జరుగనుంది. నాలుగో తేదీ సాయంత్రానికే ప్రచారం ముగుస్తుంది. అంటే మిగిలిన కీలకమైన ఈ రెండు రోజులు హిమంత్ ప్రచారంలో పాల్గొనే అవకాశం కోల్పోవడం బీజేపీ కూటమికి దెబ్బే.

మరికొన్ని అంశాలూ ఇబ్బందికరమే

అధికార బీజేపీ కూటమిని మరికొన్ని అంశాలు కూడా ఇబ్బంది పెడుతున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్, అసోం గణపరిషత్ కలిసి పోటీ చేసి కాంగ్రెస్ నుంచి అధికారం చేజిక్కించుకున్నాయి. ఈసారి సీట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వలేదంటూ బోడోలాండ్ బీజేపీ కూటమిని వీడి కాంగ్రెస్ కూటమిలో చేరింది. మరోవైపు రాష్ట్రంలో అధిక సంఖ్యాకులైన తేయాకు కూలీలు బీజేపీ సర్కారుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారికి ఇప్పటికీ రోజు కూలీ రూ.167 మాత్రమే అందుతోంది. వారికి మౌలిక వసతులు కల్పించడంలోను రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న ఆరోపణలు ఉన్నాయి. తీరా ఎన్నికల సమయం సమీపించిన తరుణంలో కేంద్ర బడ్జెట్లో రూ. 1000 కోట్లు తేయాకు కూలీల సంక్షేమానికి కేటాయించారు. మరోవైపు తాము అధికారంలోకి వస్తే తేయాకు కూలీల రోజు కూలిని రూ. 365కు పెంచుతామని కాంగ్రెస్ కూటమి హామీ ఇచ్చింది. ఈ ప్రతిబంధకాలన్నింటినీ అధిగమించి బీజేపీ కూటమి విజయతీరాలు చేరుకోగలదా.. అధికారాన్ని కాపాడుకోగలుగుతుందా అన్నది మే 2వ తేదీన తేలుతుంది.

Also Read : రంగస్వామే మా నాయకుడు ,సీఎంని మాత్రం అమిత్ షా నిర్ణయిస్తాడు అంటున్న బీజేపీ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి