iDreamPost

ఖజానాలో ఏమి మిగిల్చిపోయావు చంద్రబాబు? ఇప్పుడు ఖర్చుపెట్టటానికి?

ఖజానాలో ఏమి మిగిల్చిపోయావు చంద్రబాబు? ఇప్పుడు ఖర్చుపెట్టటానికి?

నిజాలను దాచి నిందలు మోపడంలో చంద్రబాబుని మించిన ఘనుడు మరొకరు ఉండరు, అధికారంలో ఉన్నప్పుడు ఒక విదంగా అధికారంలో లేని సమయంలో మరో విధంగా ఉండే చంద్రబాబు వ్యవహారశైలి చూపరులకి ఆశ్చర్యం కలిగించక మానదు.

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపధ్యంలో దేశంలోని మిగులు బడ్జెట్ రాష్ట్రాలుగా ఉన్న మహారాష్ట్ర , తెలంగాణలే తమ ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి అని చెబుతుంటే లోటు బడ్జెట్ తో చంద్రబాబు మిగిల్చిన అప్పులతో నెట్టుకొస్తున్న ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఉద్యోగులకు జీతాలు కోత పెట్టకుండా రెండు విడతల్లో ఇస్తాం అని ప్రకటించారు. తెలుగుదేశానికి సి.యం జగన్ పై వేలేత్తి చూపే కారణాలు ఏమి లేక గురివింద సామెతను సైతం మరిచి ఉద్యోగుల జీతాలు కోతలు పెడుతున్నారు అని గగ్గోలు మొదలు పెట్టంది. నేడు దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వలన జరిగిన నష్టం ఆర్ధికవేత్తలకి సైతం అంతుబట్టకుండా ఉంటే చంద్రబాబు మాత్రం మరోసారి ఆర్ధిక వేత్త అవతారం ఎత్తి రాజకీయ విమర్శలకు దిగారు.

జీతాలు చెల్లించని చంద్రబాబు ప్రభుత్వం

నేడు సి.యం జగన్ దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల మాదిరే విడతలవారిగా జీతాలు ఇవ్వటానికి ముందుకు వచ్చినా రాజకీయ విమర్శలు చేస్తున్న తెలుగుదేశం గత ఎన్నికల ముందు రాష్ట్రంలో పని చేస్తున్న అందరు ఉద్యోగులకి జీతాలు చెల్లించిందా?సమాదానం చెల్లించలేదు.

చంద్ర బాబు పాలనలో రాష్ట్రంలో వేల సంఖ్యలో పనిచేస్తున్న పోలీసులకు టీఏ, డీఏలను విడుదల చేసినట్లే చేసి తిరిగి ఐదు నెలల డీఏ, టీఏ సొమ్ము రూ.70 కోట్లు ఖాజానా నుంచి వెనక్కు తీసుకున్నారు. హోంగార్డులకి ఆఖరి మూడు నెలల వేతనాలు కూడా చెల్లించలేదు.

దేవాదాయ శాఖలో పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఆఖరి నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వలేదు.రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 1.25 లక్షల మంది రెగ్యులర్‌ ఉద్యోగుల ఫిబ్రవరి వేతనాలను సకాలంలో వేతన బిల్లులను సమర్పించలేదనే సాంకేతిక కారణం చూపుతూ ఆలస్యంగా చెల్లించారు. ఆ నిధులను ఇతర అవసరాలకు వినియోగించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయటం వలెనే జీతాలు ఆలస్యమయ్యాయని ఉద్యోగులు ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎయిడెడ్‌ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యాసంస్థలు, గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు, సర్వశిక్ష అభియాన్, మోడల్‌ స్కూళ్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ఆఖరి నాలుగు నెలలు చంద్రబాబు ప్రభుత్వం వేతనాలు నిలిపేసింది.

వాస్తవాలు ఇలా ఉంటే జగన్ ముఖ్యమంత్రి అయ్యేనాటికి 100 కోట్లు మాత్రమే ఖజానలో మిగిలాయి. అధికారం చేపట్టినప్పటి నుంచి జగన్ ప్రభుత్వం ఈ తొమ్మిది నెలలో ఒక్కరూపాయి జీతం బకాయి పెట్టకుండా చెల్లించింది,అయినా కానీ ఎదో విధంగా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చెయ్యాలని తెలుగుదేశం ప్రయతనం చేస్తుంది.

నిజానికి జగన్ ముఖ్యమంత్రి అయ్యేనాటికి రాష్ట్ర ఆర్ధిక స్థితి గురించి మాట్లాడుకోవాలి అంటే ,గడచిన ఎన్నికల అనంతరం నాటి ప్రభుత్వానికి గెజెట్ గా పేరొందిన ఈనాడు పత్రికలోనే రాష్ట్ర ఖజానాలో 100 కోట్లు మాత్రమే మిగిలాయని ,జీతాలకు పెన్షన్లకు 5వేల కోట్లు, వృద్ధాప్య పించన్లకు 1200 కోట్లు అవసరం అవుతాయని ఈ పూట గడవాలంటేనే మొత్తం 6,200 కోట్లు అవసరం అని రాసింది. అలాగే గతంలో ఆర్ధిక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు జగన్ ముఖ్యమంత్రి అవ్వగానే అన్నిచోట్ల నుండి మేము అప్పులు తెచ్చేశామని, ఇక జగన్ కి అప్పులు పుట్టే అవకాశమే లేదని బహిరంగంగానే చెప్పారంటే గత పాలనలో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఆర్ధికంగా ఎంత దివాళా తీయించారో అర్ధం చేసుకోవచ్చు. రాష్ట్రం ఇంతలా దివాల తీయటానికి చంద్రబాబు ఐదేళ్ల పాటించిన విధానాలే కారణం.

చంద్రబాబు గత 5 ఏళ్ళ పాలనలో కట్టలు తెగిన ఆర్ధిక క్రమశిక్షణ

2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగే నాటికి ఉమ్మడి రాష్ట్ర అప్పు – లక్షా 66 వేల కోట్లుగా తేల్చారు. రాష్ట్ర జనాభా ప్రకారం 58% ఆంధ్ర ప్రదేశ్, 42% తెలంగాణకు అప్పుని విభజించగా, ఆంధ్ర ప్రదేశ్ 13 జిల్లాల భాగానికి 96 వేల కోట్ల అప్పుని పంచారు. 96 వేల కోట్లతో ప్రారంభమైన నూతన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి కాగా, 2019 ఎన్నికల్లో ఆయన దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పు 96వేల కోట్ల నుండి 3.45 లక్షల కోట్లు కు చేర్చారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ముప్పులో ఉందని 2016 లోనే కాగ్ ( కంట్రొలర్ అండ్ ఆడిట్ జనరల్) తన నివేదికలో హెచ్చరించింది. రాష్ట్రంలో అప్పులు ఆదాయం మధ్య సమతుల్యం తప్పుతుందని హెచ్చరించింది కూడా. 58 ఏళ్ళ ఉమ్మడి రాష్ట్రంలో మన వాటాకి వచ్చిన అప్పు 96వేల కోట్లు అయితే, 2014 నుండి 2019 వరకు 5 ఏళలో చంద్రబాబు 3.45 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళారు. అంటే రాష్ట్రంలో సగటు మనిషి నెత్తి మీద 42,500 భారం మోపి వెళ్ళారు. 2019 ఎన్నికల నాటికి నూతన ఆంద్రప్రదేశ్ అప్పులు రూ.2,49,435 కోట్లు గా ఉందని, దీనిపై కట్టవలసిన వడ్డీ రూ.15,011 కోట్లకు పెరిగిందని దేశ ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ గారే ప్రకటించారు.

అప్పుల్లోనూ దుబారా మానని చంద్రబాబు పాలన

ఒక పక్క చంద్రబాబు చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలుతుంటే, ఇవేవి పట్టనట్టు ఆర్ధిక క్రమశిక్షణ పాటించకుండా, నాటి తన పాలనలో చేసిన దుబారా ఖర్చు అంతా ఇంతా కాదు. ఎన్నికలకి ముందు రోజు కూడా ఐదు వేల కోట్లు అప్పు చేసి పసుపు కుంకుమ పేరుతొ మహిళా ఓటర్లకు తాయిలాలు పంచారు. చేసిన దానికి మళ్ళీ శంకుస్థాపనలు, తాత్కాలిక నిర్మాణాలు పేరుతో కోట్లు ఖర్చుపెట్టారు. కృష్ణా , గోదావరి పుష్కరాల పేరిట సుమారు ఆరువేల కోట్లు లెక్కా పత్రం లేకుండా వృధా ఖర్చులు రాసిన బాబు,
ప్రత్యేక విమానాలు, రైన్ గన్లు, రాజధాని డిజైన్లు అని సింగపూరుకి, జపాన్ కి డబ్బు ఇచ్చి, మళ్ళీ వేరే సంస్థకి అప్పచెప్పి, అదీ నచ్చక రాజమౌళి లాంటి సినిమా డైరెక్టర్ ని డిజైన్ల విషయంలో కలవమని ఆ సదరు సంస్థకి సలహా ఇచ్చారు . ఇలాంటి అస్తవ్యస్త విధానాలతో అనాలోచిత నిర్ణయాలతో విసిగిపోయిన జపాన్ కి చెందిన “మాకి ఆర్కిటెక్ సంస్థ” తన మేగజైన్ లో ఇక్కడ జరుగుతున్న విషయాలు చెప్పి పరువు తీసింది. ఒక పక్క ఆర్ధిక లోటు ఉంటే ఇలా విచ్చలవిడిగా అనవసర ఖర్చులు చేయటం సీనియర్ ఎకనామిస్ట్ ని అని చెప్పుకునే చంద్రబాబు గారికే చెల్లింది.

సంక్షేమ సారధిగా ముఖ్యమంత్రి జగన్ పాలన

అధికారంలోకి వొచ్చిన తరువాత రివర్స్ టెండరింగ్ విధానంతో గత ప్రభుత్వంలో జరిగిన దుబారా ఖర్చును అదుపుచేయటంతో పాటు నిధులను కాపాడారు. పాలనకు, ప్రజలకు ఉపయోగ పడేలా గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థలను ప్రవేశపెట్టారు. అందుబాటులో ఉన్న పరిమిత వనరులను ఆర్ధిక క్రమశిక్షణ పాటిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు.

నిధుల కొరత చూపి ప్రభుత్వ ఆస్తులని అమ్మిన చరిత్ర ఉన్న చంద్రబాబు, ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలకు ఎగనామం పెట్టి ఆ నిధులని ఓట్ల కోసం పసుపు కుంకుమ పేరిట ఓటుకి నోట్లకి తరలించిన చంద్రబాబుకి నేడు అర్ధాంతరంగా అదే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు గుర్తు రావడం అవకాశ వాద రాజకీయాలకు పరాకాష్టగా చెప్పవచ్చు. అధికారం లేకపొయే సరికి మీడియా అండతోప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నాలు ఆపి నిర్మాణాత్మక విమర్శలతో ముందుకు వస్తే ప్రజలు హర్షిస్తారు అంతే కానీ అర్ధంలేని విమర్శలు చేస్తూ లేఖలు రాస్తే ప్రజల్లో మరింత చులకనవ్వటం ఖాయం.

.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి