iDreamPost

బాబు గారి లిక్కర్ నీతులు , నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్టు..

బాబు గారి లిక్కర్ నీతులు , నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్టు..

ఆయన సీఎంగా ఉన్నప్పుడు చేసిన పనులు, పదవి పోగానే మరచిపోతారు. పోనీ ప్రతిపక్షంలో చెప్పిన మటలు అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్తు పెట్టుకుంటారా అంటే అదీ ఉండదు. అదే మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకతకు దారితీసింది. అయినప్పటికీ ఆయన ధోరణి మారడం లేదు. విపక్ష నేతగా విపరీత స్థాయిలో నీతిసూత్రాలు వల్లించడం ఆపడం లేదు. తాను అధికారంలో ఉండగా వేటిని కాదన్నారో వాటినే ఇప్పుడు అమలు చేయాలని చెప్పడం కూడా ఆయన ధోరణిని చాటుతోంది.

ప్రస్తుతం దేశమంతా మద్యం దుకాణాలు తెరిచారు. దానికి మోడీ ప్రభుత్వం మూల కారణంగా ఉంది. అయినా చంద్రబాబు, ఆయన బాటలో నడిచే పవన్ కళ్యాణ్‌ వంటి వారు మాత్రం మోడీని వదిలేసి ఏపీ ప్రభుత్వం మీద విమర్శలకు దిగడం హాస్యాస్పదంగా మారుతోంది. ఏపీలో మద్యం నియంత్రణలో భాగంగా ధరలు భారీగా పెంచడం ద్వారా, ప్రజల్లో ఆసక్తిని తగ్గించే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంటే దానిని కూడా తప్పుబట్టేందుకు సిద్ధపడుతున్నారు. ఒకనాడు చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అయ్యప్ప మాల వేసిన వారి కారణంగా మద్యం అమ్మకాలు తగ్గిపోతున్నాయని బహిరంగంగానే వ్యాఖ్యానించిన ఘనత ఆయనది. అలాంటి వ్యక్తే ఏడాది తిరగకుండానే మద్యం అమ్మకాలు, మహిళలు, ప్రజలు అంటూ నీతులు వల్లించే స్థాయికి వచ్చేశారు.

బీరు ని హెల్త్ డ్రింక్ అంటూ జనాలకు చెప్పిన టీడీపీ నేతలే ఇప్పుడు మద్యం విక్రయాల మీద విపరీత వ్యాఖ్యలకు దిగుతున్నారు. అందులో భాగంగా అన్ని బ్రాండ్లు దొరకడం లేదంటూ ఏకంగా మహిళా ఎమ్మెల్యేతో అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నలు సంధింపజేసిన చంద్రబాబు ఇప్పుడు తాను కూడా అదే ప్రశ్నలు వేస్తున్నారు. మరో సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అయితే వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పంపించాలని సూచిస్తున్నారు. చంద్రబాబు పాలనా కాలంలో కొనసాగిన బ్రాందీ షాపులను కుదించి, ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం అమ్మకాలు నియమిత సమయంలో జరుపుతూ, ధరలు పెంచడంతో పాటుగా బెల్ట్ షాపులు మొత్తాన్ని తొలగించిన ప్రభుత్వం మీద ఎందుకు విమర్శిస్తున్నారో అర్థంకాని రీతిలో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు.

కొందరేమో అన్ని బ్రాండ్లూ దొరకడం లేదంటారు. ఇంకొందరేమో డోర్ డెలివరీ చేయాలి కదా అంటారు. ఇంకొందరేమో మద్యం అమ్మకాలు పెరిగిపోతున్నాయని అంటున్నారు. అంటే బహుశా టీడీపీ నేతలకు ఈ విషయంలో ఓ స్పష్టత లేకపోవడంతోనే తలో మాట మాట్లాడుతూ మందుబాబులను తలపించేలా సాగుతున్నారని సోషల్ మీడియాలో సెటైర్లు వినిపించడం విశేషం. మద్యం అమ్మకాలకు తాము వ్యతిరేకమా అంటే మొన్నటి వరకూ తమ పాలనలో ఏరులై పారించిన విషయం ప్రజలు మరచిపోలేదు. పోనీ ఇప్పుడు షాపులు తెరవడానికి వ్యతిరేకమా అంటే అనుమతి ఇచ్చింది మోడీ అనే విషయం మదిలోకి రావడంతో మాట మార్చేస్తుంటారు. పోనీ ధరలు పెంచడానికి వ్యతిరేకమా అంటే మళ్లీ మద్యం అమ్మకాలను తగ్గించే ప్రయత్నాలను అడ్డుకుంటున్నారనే అభిప్రాయం కలుగుతుందనే భయం. ఇలా టీడీపీ తాము గందరగోళంలో ఉండి ప్రజలను గందరగోల పరిచాలనే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో స్పష్టంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. మద్యం విషయంలో నియంత్రణ వైపు అడుగులు వేస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి