iDreamPost

కలిసిరాని చంద్రబాబు వ్యూహాం

కలిసిరాని చంద్రబాబు వ్యూహాం

రాజకీయాలను చదరంగంతో పోలుస్తారు. చదరంగంలో ఆటగాడు ఒక ఎత్తు వేసే ముందు ఆ ఎత్తుకి సమాధానంగా ప్రత్యర్థి ఎయే ఎత్తులు వేయవచ్చో, వాటికి సమాధానంగా తను ఏ ఎత్తులు వేయవచ్చో ముందుగానే ఆలోచించి ఎత్తు వేసినట్టే రాజకీయ నాయకుడు కూడా ఒక నిర్ణయం తీసుకునే ముందు తన ప్రత్యర్థులు దానికి ఎలా స్పందిస్తారో, దానికి తన ప్రతిస్పందన ఎలా ఉండాలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు.

రాజకీయాన్ని చదరంగంలా ఆచితూచి ఆడే నాయకులలో దేశంలోనే ముందు వరుసలో ఉంటాడు చంద్రబాబు. ఆయన తీసుకునే నిర్ణయాలలో ఆవేశ కావేషాలకూ, భావోద్వేగాలకూ చోటు ఉండదు. తనకు, తన పార్టీకీ ఏది మంచిదో అన్న విషయం మీదే ఆయన దృష్టి మొత్తం ఉంటుంది. అందుకోసం అవసరమైతే రెండు అడుగులు వెనక్కి వేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. అంతిమంగా నెగ్గడానికి అక్కడక్కడా తగ్గడానికి కూడా వెనుకాడరు!

చదరంగంలో కొన్ని సార్లు ఆటగాడు తిరుగులేని ఎత్తులు వేస్తాడు. ఇలాంటి ఎత్తు తర్వాత ప్రత్యర్థి ఆటగాడు తనకి కలుగబోయే నష్టం చూసి మరో ఎత్తు వేయకుండా రిజైన్ చేసి, ఓటమి అంగీకరించడమో, కొంతసేపు పోరాడి ఓటమి అంగీకరించడమో చేస్తారు. కిల్లర్ మూవ్ అంటారు ఇలాంటి ఎత్తుని చదరంగంలో!

మొన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఏ కోశానా లేకపోయినా చంద్రబాబు తన అభ్యర్థిని పోటీలో దించడం ఇలాంటి కిల్లర్ మూవ్ ఏమో అని ఆయన అభిమానులు, కొందరు విశ్లేషకులు భావించారు. అందులోనూ ఏకగ్రీవంగా ముగియాల్సిన ఎన్నికలను కరోనా విజృంభిస్తున్న సమయంలో పోలింగ్ వరకూ తీసుకురావడం వెనుక ఏదో తిరుగులేని వ్యూహం ఉందని చాలా మంది భావించారు.

బెడిసికొట్టిన వ్యూహం
తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన వర్ల రామయ్య విజయం సాధించకపోయినా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరు ముగ్గురుతో క్రాస్ ఓటింగ్ చేయించి, అధికార పార్టీని ఇరుకున పడేసేలా చంద్రబాబు పక్కా స్కెచ్ రచించారేమో అని ఓటింగ్ జరిగే నాటి వరకూ అందరూ అనుకున్నారు. దానికి తగినట్లు గానే ఈ మధ్య అనేక సందర్భాల్లో కులం కార్డును వాడుకున్న చంద్రబాబు ఈ ఎన్నికల్లో కూడా వర్ల రామయ్య చేత కులరాగం ఆలపించారు.

అధికార పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యేలు ఆత్మప్రభోధానుసారం దళితుడైన తనకు ఓటేయాలని పిలుపు ఇచ్చాడు వర్ల. అయితే దళితుల కోసం తను కానీ, తన పార్టీ కానీ, దాని నాయకుడు కానీ చేసిన మహత్కార్యాలు ఏవైనా ఉంటే వాటి గురించి చెప్పి, ఓట్లు అడిగితే అర్థం ఉండేది కానీ, కేవలం కులం కోసం క్రాస్ ఓటింగ్ చేయమనడం ఎవరినీ కదిలించలేకపోయింది.

తీరా కౌంటింగ్ తర్వాత 23 ఓట్లు రావలసిన తమ అభ్యర్థికి 17 ఓట్లు రావడం పార్టీ ప్రతిష్టను, నాయకుడిగా చంద్రబాబు సమర్ధతనూ బాగా దెబ్బ తీసింది. హోమ్ క్వారంటైన్ సాకు చూపి ఒక ఎమ్మెల్యే ఓటింగుకు గైరు హాజరవడం, అసమ్మతి ఎమ్మెల్యేలు చెల్లకుండా ఓట్లు వేయడం ఒక ఎత్తు అయితే, ఆదిరెడ్డి భవానీ అవగాహన లేకుండా ఓటు చెల్లకుండా చేసుకోవడం మరొక ఎత్తు అయింది.

మొదటిసారి కాబట్టి రాజ్యసభ ఎన్నికల్లో ఎలా ఓటు వేయాలో తనకు అవగాహన లేదని ఆమె చెప్పడం చంద్రబాబు ప్రతిష్టను మరింత దిగజార్చింది. టెక్నాలజీకి ఆద్యుడిని, పితామహుడిని అని చెప్పుకుంటూ, అధికారంలో ఉండగా తన ఆఫీసులో కూర్చుని రాష్ట్రంలో ఎక్కడ వీధి లైట్లు వెలగక పోయినా, ఎక్కడ మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోయినా కనిపెట్టగల నాయకుడు తన ఎమ్మెల్యేకి ఎలా ఓటేయాలో నేర్పించకపోవడం ఆయన ఇమేజ్ డామేజ్ చేసే అంశం.

ఒకవేళ నేర్పించి ఉంటే, చెల్లని ఓటు వేయడం వెనక ఆదిరెడ్డి భవానీలో ఏదైనా అసంతృప్తి ఉందేమో అనుకోవాలి. తికమకపడి చెల్లని ఓటు వేయడానికి ఆమె నిరక్షరాస్యురాలు కాదు. అయినా అక్షరం ముక్క రానివారు కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల మీద చక్కగా ఓట్లు వేస్తున్నారు కదా! రామ్మోహన్ నాయుడుకి పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వకపోవడం కానీ, పెదబాబు చినబాబు ప్రధాన పాత్రధారులుగా జరిగిన ఈఎస్ఐ స్కాములో అచ్చెన్నాయుడు జైలుకు పోవడం కానీ ఆమె అసంతృప్తికి కారణం అయ్యుండవచ్చని అప్పుడే విశ్లేషణ మొదలు పెట్టారు కొందరు.

మొత్తానికి ఏ ఉద్దేశంతో గెలిచే అవకాశం లేని ఎన్నికల్లో పోటీ చేయాలని చంద్రబాబు భావించారో కానీ ఆ నిర్ణయం ఆయన ప్రతిష్ఠ మసకబారేలా చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి