iDreamPost

ఉద్యోగుల పట్ల బాబుకి ఇంత ప్రేమ ఎప్పుడు పుట్టింది?

ఉద్యోగుల పట్ల బాబుకి ఇంత ప్రేమ ఎప్పుడు పుట్టింది?

మనది కాకపోతే కాశీదాకా దేకేద్దాం అన్న సామెత చెప్పినట్టుగా ఉంది చంద్రబాబునాయుడు తీరు. దేశమంతా కరోన విలయతాండవం చేస్తు ప్రజల ప్రాణాలని హరిస్తుంది. మరో పక్క లాక్ డౌన్ తో దేశాలకు దేశాలే ఆర్ధికంగా చితికిపోతు ప్రభుత్వాలు పైసా పైసా లెక్క పెట్టుకుంటునాయి. ఇంత దారుణమైన పరిస్థితిలో ప్రపంచం మొత్తం పోరాడుతుంటే ఇవేమి పట్టనట్టు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మాత్రం తనకు రాజకీయమే ముఖ్యం అన్న చందంగా ప్రభుత్వం పై ఏదో ఒక సాకు తో విమర్శలు గుప్పించి లబ్ది పొందుదాం అని చూస్తున్నారు. ఈ ఒరవడిలో తాజాగా చంద్రబాబు ఎత్తుకున్న అంశం విశ్రాంత ఉద్యోగుల పెన్షన్లు.

కరోనా వలన ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోయిన ఈ తరుణంలో పెద్ద పెద్ద సాఫ్ట్ వేర్ సంస్థలు కూడా తమ ఉద్యోగుల జీతాల్లో కోతలు పెడుతున్న ఈ సమయంలో, అనేక రాష్ట్రాల మాదిరే ఆంద్రప్రదేశ్ రాష్ట్రం కూడా నిధులను పొదుపు చేయడంలో భాగంగా విశ్రాంత ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్ ఈ కష్ట కాలం గట్టెక్కే వరకు 50% ఇస్తాం అని మార్చ్ 31న G.O విడుదల చేసింది . అయితే ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా జంధ్యాల రవిశంకర్‌ హైకోర్టులో వ్యాజ్యం వేయగా అది ఈ నెల 27కి వాయిదా పడింది 23 లోగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం సూచించింది. కోర్టు నిర్ణయాల మేరకు ప్రభుత్వం ఏం చేయాలో చేస్తుంది.

ఉద్యోగులపై చంద్రబాబుకి ఇంత ప్రేమా?

ఇక చంద్రబాబు ఈ అవకాశాన్ని కూడా రాజకీయం చేయకుండా ఎందుకు వదలడం అనుకున్నారో ఏమో రిటైర్డ్ ఉద్యోగుల మీద ఎక్కడలేని అక్కర చూపిస్తున్నారు. నిజానికి ఇదే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల పట్ల తాను ఎలా వ్యవహరించాడో ఇంకా ఎవరూ మర్చిపోయి ఉండరు. ప్రపంచ బ్యాంకు విధానాలకు తలొగ్గి ఉద్యోగుల జీతాల్లో 10% కోత పెట్టి షేర్ల వ్యాపారం చేసే సి.పి.యస్ విధానం తెచ్చిన ఘనత చంద్రబాబుది. దీనిపై ఉద్యోగులు అనేక పోరాటాలు చేసినా చంద్రబాబు ఉద్యోగుల పట్ల కనికరం చూపించలేదు. అలాగే 2004లో తాను ఓడిపోగానే ఆ నిందని ప్రభుత్వ ఉద్యోగుల మీద నెట్టి ఉద్యోగులే నన్ను ఓడించారు అని వారి మీద అక్కస్సు తీర్చుకున్నారు. మనసులో మాట పుస్తకంలో ఉద్యోగులకు భద్రత కలిగిస్తే సోమరులవుతారు అన్నారు, ఉద్యోగుల్లో 60% మంది అవినీతి పరులే అని వారిని కించపరిచారు, శాశ్వత ఉద్యోగాలు వద్దు కాంట్రాక్టు ఉద్యోగాలే ముద్దు అని రాసి ఉద్యోగుల పట్ల తన విధానం ఏంటో చెప్పకనే చెప్పారు. ఉద్యోగులపై ఇంత అవమానకరంగా ప్రవర్తించిన చంద్రబాబుకి అర్ధాంతరంగా విశ్రాంత ఉద్యోగులపై ఇంత అక్కర ఏర్పడటానికి కారణం రాజకీయ లబ్ది పొందడానికి మాత్రమే అనే మాట వినిపిస్తుంది.

రాష్టాన్ని అప్పుల్లో ముంచింది చంద్రబాబు కాదా ?

రాష్ట్ర ఆర్ధిక విషయాలపై ఎవరు అడగకపోయినా చొరవ తీసుకుని మరీ అధికార పక్షానికి సలహాలు ఇస్తున్న చంద్రబాబుకి నిజంగా ఆర్దిక క్రమశిక్షణ పై అంత అనుభవం ఉందా అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న గత 5 ఏళ్ళు అంతక ముందు 9 ఏళ్ల పాలన పరిశీలిస్తే లేదనే చెప్పాలి. 1995 లో బాబు గారు ముఖ్యమంత్రి పీఠం ఎక్కే నాటికి ఉమ్మడి రాష్ట్రం లోటు బడ్జెటు 1700 కోట్లు గా ఉండగా బాబు గారు 2004లో దిగిపొయే సమయానికి దానినికి 8706 కోట్లు చెసి వెళ్ళారు, చంద్రబాబు మిగిల్చిన ఖాళీ బొక్కసం తో ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన వై.యస్ 5 ఏళ్లు మాత్రమే పాలన చేసి 8706 కోట్లు లోటు బడ్జెట్ ని 1004 కోట్ల మిగులు బడ్జెట్ గా చేసి వెళ్లారు.

ఇక 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిగే నాటికి ఉమ్మడి రాష్ట్ర అప్పు – లక్షా 66 వేల కోట్లుగా తేల్చారు. రాష్ట్ర జనాభా ప్రకారం 58% ఆంధ్ర ప్రదేశ్, 42% తెలంగాణకు అప్పుని విభజించగా, ఆంధ్ర ప్రదేశ్ 13 జిల్లాల భాగానికి 96 వేల కోట్ల అప్పుని పంచారు. 96 వేల కోట్లతో ప్రారంభమైన నూతన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి కాగా, 2019 ఎన్నికల్లో ఆయన దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పు 96వేల కోట్ల నుండి 3.65 లక్షల కోట్లకు చేర్చారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ముప్పులో ఉందని 2016 లోనే కాగ్ ( కంట్రొలర్ అండ్ ఆడిట్ జనరల్) తన నివేదికలో హెచ్చరించింది. రాష్ట్రంలో అప్పులు ఆదాయం మధ్య సమతుల్యం తప్పుతుందని హెచ్చరించింది కూడా. 58 ఏళ్ళ ఉమ్మడి రాష్ట్రంలో మన వాటాకి వచ్చిన అప్పు 96వేల కోట్లు అయితే, 2014 నుండి 2019 వరకు 5 ఏళ్లలో చంద్రబాబు 3.65 లక్షలకోట్లు అప్పు చేసి వెళ్ళారు. అంటే రాష్ట్రంలో సగటు మనిషి నెత్తి మీద 42,500 భారం మోపి వెళ్ళారు.

ఎన్నికల అనంతరం తెలుగుదేశం గెజెట్ గా పేరొందిన ఈనాడు పత్రికలోనే రాష్ట్ర ఖజానాలో 100 కోట్లు మాత్రమే మిగిలాయి అని జీతాలకు పెన్షన్లకు 5వేల కోట్లు, వృద్ధాప్య పించన్లకు 1200 కోట్లు అవసరం అవుతాయని ఈ పూట గడవాలంటేనే మొత్తం 6,200 కోట్లు అవసరం అని రాసింది. అలాగే గతంలో ఆర్ధిక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు జగన్ ముఖ్యమంత్రి అవ్వగానే అన్నిచోట్ల నుండి మేము అప్పులు తెచ్చేశామని, ఇక జగన్ కి అప్పులు పుట్టే అవకాశమే లేదని బహిరంగంగానే చెప్పుకొచ్చారంటే గత పాలనలో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఆర్ధికంగా ఎంత ప్రమాద పరిస్థితుల్లోకి నెట్టారో అర్ధం చేసుకోవచ్చు. ఇలా ఏ మూలానా ఆర్ధిక క్రమశిక్షణ పాటించని చంద్రబాబు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో సలహాలు ఇవ్వడం హాస్యాస్పదం.

చంద్రబాబు తన పాలనలో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థపై దెబ్బకొట్టి, ఉద్యోగుల ఆత్మాభిమానాన్ని కించపరిచే విధంగా వాఖ్యలు చేసి నేడు ఉన్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఉద్యోగులను అడ్డంపెట్టుకుని రాజకీయాలకు పాల్పడటం హేయమైన చర్య. నేడు మన రాష్ట్రమే కాక దేశంలో అనేక రాష్ట్రాలు ఆర్ధిక భద్రత కోసం అనేక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అనేక రాష్ట్రాల్లో మాదిరి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులకు కోతలు విధంచకుండా వాయిదా పద్దతిలో పూర్తిగా జీతం జమ చేస్తుంది.

జగన్ ముఖ్యమంత్రి అవ్వగానే ఉద్యోగులకు 27 శాతానికి పైగా మధ్యంతర భృతి ప్రకటించారు. సీపీఎస్ రద్దుపై జగన్ వర్కింగ్‌ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేపు రాబోయే జూన్ 30 న ఆ నివేదిక ఆదారంగా సి.పి.యస్ రద్దు చెయబోతున్నారు. ఇలా ఉద్యోగులకి ఎల్లప్పుడు అండగా ఉంటున్న ముఖ్యమంత్రి పై ఏదో ఒకరకంగా రాజకీయం చేసి బురద జల్లాలనే ప్రయత్నం చంద్రబాబు చేయడం శోచనీయం. అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగులను తన విధానాలతో కించపరిచి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారి పై ప్రేమలు ఒలకపోయడం చంద్రబాబు ఆలోచనాతీరును చెప్పకనే చెబుతుంది. విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి అండగా లేకపొయినా పరవాలేదు కానీ ఇదే అదనుగా చంద్రబాబు రాజకీయాలు చేయడం దిగజారుడు చర్యగా పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి