iDreamPost

ఇలాంటి రాజకీయం చంద్రబాబు మాత్రమే చేయగలరు 

ఇలాంటి రాజకీయం చంద్రబాబు మాత్రమే చేయగలరు 

రాజకీయాల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుది ఒక ప్రత్యేకశైలి. విజయంకోసం లేదా అధికారంకోసం ఆయన ఎవరినయినా కలుపుకోగలరు,ఎవరినయినా వదులుకోగలరు.అంతే కాదు తనకు ప్రయోజనం ఉందంటే ఎవరితో అయినా మాట కలుపుతారు. ప్రయోజనంలేదు అంటే కనీసం పలకరించేందుకు కూడా ఇష్టపడరు. 

సందర్భం ఏదయినా, స్థలం ఏదయినా ఆయన లెక్కలు స్పష్టంగానే ఉంటాయి. ఎన్నికల్లో విజయం, అంతిమంగా అధికారం అనేవి మాత్రమే నిరంతరం ఆయన బుర్రలో తిరుగుతూ ఉంటాయి. 1983లో టీడీపీలోకి వెళ్ళకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా, తన మామ ఎన్టీఆర్ పై పోటీకి సిద్ధం అని ప్రకటించినా అది అప్పటికి తన అధికారం నిలుపుకోవడం కోసమే. ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత తిరిగి అనేక ప్రయత్నాలు చేసి ఎన్టీఆర్ పక్కన చేరినా అది కూడా అధికారంకోసమే. ఆ తర్వాత 1995లో ఎన్టీఆర్ ను పదవీచ్యుతుణ్ణి చేసినా, అందుకోసం నందమూరి కుటుంబాలను వాడుకున్నా అది అధికారం కోసమే. దగ్గుబాటిని, హరికృష్ణను వాడుకున్నా అదికూడా అధికారం కోసమే. చివరికి ఇప్పటికీ బాలకృష్ణను వాడుకుంటున్నా అది కూడా అధికారంకోసమే. 

అలాగే 2018లో తెలంగాణ ఎన్నికల్లో హరికృష్ణ కూతుర్ని పోటీకి దించినా, ఆ తర్వాత ఆమెకు మొహం చాటేసినా కేవలం అధికారం అనే లెక్కల్లో భాగంగానే.చివరికి తాజాగా మీడియా సమక్షంలో కంటతడిపెట్టి బోరుబోరున ఏడ్చినా, అందుకు తన భార్య శీలంపై మచ్చపడింది అని ఆరోపించినా అందులో కూడా అధికారం అనే లెక్కే పైచేయిగా ఉంది. ఆ తర్వాత ఇదే అంశం మీద మొత్తం నందమూరి కుటుంబాలను ఏకం చేయడం వెనుక కారణం కూడా ప్రజల్లో సానుభూతి వస్తుందని, అది తనకు అధికారం కట్టబెట్టేందుకు ఉపయోగ పడుతుందని ఆయన లెక్క. 

ఈ ప్రస్తావనంతా ఇప్పుడు ఎందుకు అంటే ఈ రోజు చంద్రబాబునాయుడు కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు కే.వీ.పీ రామచంద్రారావు తో గుంటూరులో రహస్య మంతనాలు జరిపారు. రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఇద్దరూ మాట్లాడుకోవడంలో తప్పులేదు. కానీ ఈ రహస్య మంతనాలకు ఎంచుకున్న వేదిక ఘోరమైన తప్పిదం. ఈరోజు ఉదయం గుంటూరులో మృతిచెందిన టీడీపీ నేత మాజీ మంత్రి, మాజీ ఎంపీ యడ్లపాటి వెంకట్రావు ఇంట్లో చంద్రబాబునాయుడు కాంగ్రెస్ నేత కేవీపీ తో మంతనాలు జరిపారు. యడ్లపాటి వెంకట్రావు కుటంబసభ్యులు, టీడీపీ నేతలు అంత విషాదంలో ఉండగా వారిని పలకరించేందుకు వచ్చిన కేవీపీ ని పక్కకు తీసుకెళ్ళి చంద్రబాబునాయుడు మంతనాలు జరపడం అందరిని ఆశ్చర్యం కలిగించింది. 

ఒక చావు ఇంట్లో రాజకీయాలు మాట్లాడడం చంద్రబాబుకు కొత్తేమీకాదు.నిజానికి అలాంటి సందర్భం చంద్రబాబుకు ఒక అవకాశం.గతంలో బావమరిది హరికృష్ణచనిపోయినప్పుడు కూడా చంద్రబాబునాయుడు ఇలాంటి రాజకీయమే చేశారు. నందమూరి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన తెరాస నేత కేటీఆర్ తో చంద్రబాబు నాయుడు రాజకీయాలు చర్చించారు. తెరాస, టీడీపీ మధ్య పొత్తుకోసం ప్రయత్నాలు చేశారు. ఈ విషయాన్ని ఆ తర్వాత కేటీఆర్ బహిర్గతం చేశారు. అంతకుముందు ఎన్టీఆర్ చనిపోయినప్పుడు కూడా చంద్రబాబు పూర్తిస్థాయి రాజకీయమే చేశారు. ఎన్టీఆర్ శవాన్ని అడ్డంపెట్టుకుని లక్ష్మీపార్వతిని దూరం చేయించారు. దూకుడు స్వభావం ఉన్న హరికృష్ణను రెచ్చగొట్టి ఎన్టీఆర్ శవం దరిదాపుల్లో కూడా లక్ష్మీపార్వతి లేకుండా రాజకీయం చేశారు. ఎన్టీఆర్ మరణంతో ఇంచుమించు లక్ష్మీపార్వతిని రోడ్డుమీద పడేసేలా రాజకీయ వ్యూహరచన చేశారు. అయితే అప్పట్లో లక్ష్మీపార్వతి నిలదొక్కుకుంది. ఎన్టీఆర్ ఆస్తిలో ఎంతోకొంత దక్కించుకోగలిగింది. 

ఇలాంటి రాజకీయాలు చంద్రబాబు నాయుడుకు మాత్రమే సాధ్యం. ఇంకో మాటలో చెప్పాలంటే ఇలాంటి రాజకీయాలు చంద్రబాబునాయుడు మాత్రమే చేయగలరు. ఆయన ప్రయత్నాలు సఫలం అయినా, విఫలం అయినా ఆయన మాత్రం తన ప్రయత్నాలను మానుకోరు. ఈరోజు యడ్లపాటి వెంకట్రావు ఇంట్లో కేవీపీతో చేసిన మంతనాలు కూడా ఈ కోవలోనివే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి