iDreamPost

వ్యూహాత్మకంగానే విషప్రచారం, ఒరిగేదేముంది బాబూ..?

వ్యూహాత్మకంగానే  విషప్రచారం, ఒరిగేదేముంది బాబూ..?

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలకు అంతూపొంతూ లేదన్నది సుస్పష్టం. అత్యవసర పరిస్థితులు ఉన్నప్పటికీ అధికార పక్షం మీద దుమ్మెత్తిపోయడం మాత్రం ఆగదు. ప్రజలను ఆదుకోవాల్సిన సమయంలో కూడా రాజకీయ దుష్ప్రచారానికి తలుపులు తెరుస్తూనే ఉన్నారు. అది కూడా అంతా వ్యూహాత్మకంగా సాగుతున్నట్టు కనిపిస్తోంది. తొలుత సోషల్ మీడియాలో , ఆతర్వాత టీడీపీ నేతల మాటల్లో, ఆవెంటనే సొంత మీడియా స్వరంలో, దానికి అనుగుణంగా వివిధ పార్టీల్లో ఉన్న సానుకూల నేతల ద్వారా..ఇలా ఓ పథకం ప్రకారం ప్రభుత్వం మీద నిందలు వేసే ప్రయత్నం సాగుతోంది. అన్నింటినీ అధిగమించినా ఆఖరికి న్యాయవ్యవస్థల ద్వారా అడ్డంకులు కల్పించే ప్రయత్నం కూడా ఆగడం లేదు. కోర్టుల తీర్పులు ఎలా ఉన్నప్పటికీ ప్రభుత్వ నిర్ణయాలు అమలుకాకుండా చూడాలనే తపనతో కొందరు ఉన్నట్టు కనిపిస్తోంది.

ఆంద్రప్రదేశ్ లో కరోనా వైరస్ అనుమానితులకు పరీక్షలు నిర్వహించడం లేదని తొలుత టీడీపీ నానా రాద్ధాంతం చేసింది. అనుకూల మీడియాలో అందుకు అనుగుణంగా కథనాలు వండి వార్చింది. చివరకు విశాఖ మెడ్ టెక్ జోన్ లో టెస్టింగ్ కిట్ల తయారీకి తొలి అడుగుపడగానే అది మాత్రం చంద్రబాబు ఘనతగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. అంటే ఫలితం వస్తే క్రెడిట్ బాబుది, జాప్యం జరిగితే జగన్ ది అనే సూత్రం పాటిస్తున్నట్టు కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం మరింత చొరవ ప్రదర్శించి దక్షిణ కొరియా నుంచి ర్యాపిడ్ టెస్ట్ కిట్లు తీసుకురాగానే వాటిపై దుమ్మెత్తిపోసే కార్యక్రమం సాగింది. చత్తీస్ ఘడ్ లో ఎవరో అధికారి చేసిన ట్వీట్ పట్టకుని ..ఏపీలో కిట్లు కొనుగోలు విషయంలో పెద్ద దోపిడీ జరిగిందనే రీతిలో విమర్శల పర్వం సాగించింది. ఇందులో టీడీపీకి తోడుగా బీజేపీ, జనసేన, సీపీఐ నేతలు కూడా గొంతు కలిపారు. ఉమ్మడిగా ఒకే అంశంతో విడివిడిగా లేఖలు కూడా రాసిన దాఖలాలు కూడా ఉన్నాయి.

తీరా చూస్తే చత్తీస్ ఘడ్ కొనుగోలు చేసిన కిట్లు బండారం బయటపడడం, కర్ణాటకతో పాటు కేంద్రం కూడా ఏపీ కన్నాకొంత ఎక్కువ ధరకే కొనుగోలు చేసిన నేపథ్యంలో ఆ కథను ఆపేశారు. ఆ వెంటనే ఏపీలో కేసుల సంఖ్య పెరుగుతోంది..దానికి కారణం వైఎస్సార్సీపీ నేతలే అంటూ కొందరి మీద గురిపెట్టి నిందలు వేయడం ప్రారంభించారు. ప్రజలకు సేవ చేసేందుకు కరోనా భయాన్ని పక్కన పెట్టి కదులుతున్న వారిని కూడా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. చంద్రబాబు కూడా సోషల్ మీడియా స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. కానీ తీరా చూస్తే టెస్టులు పెరగడం వల్ల కొన్ని కేసులు పెరుగుతుండడం, అవి కూడా కొన్ని జోన్లకే పరిమితం కూడా ఊరటనిచ్చే అంశంగా అంతా భావిస్తున్నారు. చివరకు కేంద్రం తొలుత 11 జిల్లాలను రెడ్ జోన్లుగా ప్రకటించి, ఇప్పుడు వాటిని 5 జిల్లాలకే పరిమితం చేసిన తరుణంలో ఈ తరహా నిందలు వేసిన బ్యాచ్ కి నోటమాట రాని పరిస్థితి ఏర్పడింది.

వాస్తవానికి ప్రభుత్వ సహాయం అందకపోతే నిలదీయాలి. కానీ రేషన్ మూడోవిడత పంపిణీ కూడా జరుగుతోంది. ఎవరికైనా కరోనా సహాయక నిధి అందకపోతే ప్రతిపక్షం ప్రశ్నించాలి. కానీ ప్రతీ ఒక్కరికీ దానిని పంపిణీ చేశారు. చివరకు కరోనా సమయంలో కూడా పెన్షన్ల పంపిణీ సకాలంలో సజావుగా సాగిపోయింది. అదే సమయంలో పరీక్షా కేంద్రాలు పెంచడం, కిట్లు కొనుగోలు చేయడం , పీపీఈలు, మాస్కులు సిద్దం చేయడం, చివరకు ప్రజల్లో ఆందోళనను చల్లబర్చి, అందరూ నిదానంగా ఉండేలా ముఖ్యమంత్రి చొరవ ప్రదర్శించడంతో ఇప్పుడు విపరీత అర్థాలు తీస్తూ, దుష్ప్రచారం చేయడం ద్వారా జనంలో ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే నిర్ణయానికి టీడీపీ వచ్చినట్టు కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగా చేస్తున్న ప్రయత్నాల ద్వారా ఫలితాలు వస్తాయా రాదా అన్నది పక్కన పెడితే తాత్కాలికంగా తమ శ్రేణులను సంతృప్తి పరిస్తే చాలు అనే లక్ష్యంతో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇలాంటి ఎత్తుగడలు టీడీపీకి ఉపయోగపడే అవకాశం లేకపోగా, భవిష్యత్ లో తీరని నష్టాన్ని తెస్తాయనడంలో సందేహం లేదు. అయినా బీజేపీ, జనసేన సహా ఇతరులను కలుపుకుని తన బ్యాక్ డోర్ పాలిటిక్స్ మాత్రం బాబు ఆపేలా కనిపించడం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి