iDreamPost

అప్పుడు తెలంగాణాలో..ఇప్పుడు అమ‌రావ‌తిలో!: మూడు కళ్ళ సిద్ధాంతం..

అప్పుడు తెలంగాణాలో..ఇప్పుడు అమ‌రావ‌తిలో!: మూడు కళ్ళ సిద్ధాంతం..

రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. తెలంగాణాలో టీడీపీ నేత‌లు ప్ర‌త్యేక తెలంగాణా డిమాండ్ చేస్తుంటే, ఏపీలో అదే పార్టీకి చెందిన నేత‌లు స‌మైక్యాంద్ర స్వ‌రం వినిపించారు. కాంగ్రెస్ కూడా ఇలాంటి తీరునే సాగిన‌ప్ప‌టికీ చివ‌ర‌కు తెలంగాణా విభ‌జ‌న చేసిన పార్టీకి ఇంకా కొంత గుర్తింపు మిగిలింది. కానీ తెలుగుదేశం మాత్రం తెలంగాణా గ‌డ్డ మీద నామ‌రూపాల్లేకుండా పోయింది.

పార్ల‌మెంట్ లో చ‌ట్టం ఆమోదం పొంద‌గానే 4ల‌క్ష‌ల కోట్లు కేటాయించాల‌ని డిమాండ్ చేసిన చంద్ర‌బాబు కూడా మాట మార్చి, స‌మైక్యాంద్ర, హైద‌రాబాద్ అంటూ మాట్లాడాల్సి వ‌చ్చింది. అయినా గానీ బ‌ల‌మైన సామాజిక‌, ఆర్థిక నేప‌థ్యం ఉన్న‌ హైద‌రాబాద్ లో కూడా పార్టీ ని నిలుపుకోలేక‌పోయింది. పేరుకి జాతీయ పార్టీగా చెప్పుకుంటున్నా ఏపీలో మిన‌హా మ‌రెక్క‌డా దిక్కులేని స్థితికి చేరింది. రెండు ప‌డ‌వ‌ల‌పై కాలేసిన త‌ర్వాత చంద్ర‌బాబుకి ఇలాంటి చేదు అనుభ‌వం మిగిలింది.

స‌మైక్యాంధ్ర ఉద్య‌మం నాటి అనుభ‌వాల నుంచి పాఠాలు నేర్చుకోవ‌డానికి చంద్ర‌బాబు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. మ‌ళ్లీ అదే తీరున సాగేందుకు స‌మాయ‌త్త‌మ‌వుతున్నారు. ఏపీ రాజ‌ధాని అంశంలో తెలుగుదేశం పాత ప‌ద్ధ‌తిలో సాగుతోంది. రాజ‌ధాని ప్రాంతానికి చెందిన ముఖ్యంగా కృష్ణా, గుంటూరు నేత‌లు అమ‌రావ‌తి కోసం గ‌ట్టిగా స్వ‌రం వినిపిస్తున్నారు. రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర నేత‌లు జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తుంటే ఆ రెండు జిల్లాల నేత‌లు మాత్రం దానికి భిన్నంగా సాగుతున్నారు. ప్ర‌త్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా, కొల్లు ర‌వీంద్ర స‌హా ప‌లువురు మాజీ మంత్రులు ఈ విష‌యంలో ఓ అడుగు ముందుకేసి ఆందోళ‌న‌ల్లో భాగ‌స్వాముల‌వుతున్నారు. అమ‌రావ‌తితో ముడిప‌డి ఉన్న ఆర్థిక ప్ర‌యోజ‌నాలే అందుకు కార‌ణంగా భావించిన‌ప్ప‌టికీ, పార్టీ రాజ‌కీయ భ‌విష్య‌త్తుకి ఈ వ్య‌వ‌హారం ముడిప‌డి ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు.

అమ‌రావ‌తి రాజ‌దాని కోసం రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌లు, న్యాయ‌వాదులు స‌హా వివిధ విభాగాలు స్వ‌రం వినిపించ‌డం వెనుక చంద్ర‌బాబు హ‌స్తం ఉంద‌ని అంతా భావిస్తున్నారు. ప్ర‌జ‌లు ఏది కోరుకుంటే తాను దానికే మ‌ద్ధ‌తు ఇస్తాన‌ని రెండు రోజుల క్రిత‌మే అనంత‌పురంలో చెప్పిన చంద్ర‌బాబు ఇప్పుడు తెర‌వెనుక ఇలాంటి వ్యూహాలు ర‌చించ‌డం వెనుక అన్ని ప్రాంతాల్లోనూ పార్టీని కాపాడుకోవాల‌నే వ్యూహం ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. మూడు రాజ‌ధానుల‌ను కాదంటే సీమ‌, ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల్లోనూ, అమ‌రావ‌తిని వ‌దులుకుంటే త‌మ‌కు మూల‌మైన ప్రాంతాల్లోనూ న‌ష్ట‌పోతామ‌నే ఆందోళ‌న‌లో టీడీపీ ఉంది. అందుకు తగ్గ‌ట్టుగానే విశాఖ‌, క‌ర్నూలుని ఆహ్వానిస్తూనే అమ‌రావ‌తిని కొన‌సాగించాల‌ని డిమాండ్ చేస్తూ ఏ ప్రాంతం నేత‌లు అక్క‌డి ప్ర‌జ‌ల గొంతు వినిపించాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది.

స‌రిగ్గా ఆరేళ్ల క్రితం స‌మైక్యాంధ్ర‌, తెలంగాణా ఉద్య‌మాల నాడు కూడా టీడీపీ ఈ రీతిని వ్య‌వ‌హ‌రించి దెబ్బ‌తిన్న‌ది. ఇప్పుడు కూడా మ‌ళ్లీ అలాంటి ప‌రిస్థితి దాపురిస్తుందా అనే సందేహాలు పెరుగుతున్నాయి. పార్టీకి ఓ విధానం అంటూ లేకుండా నాయ‌కులు త‌లా ఓ రీతిన మాట్లాడితే ప్ర‌జ‌ల్లో మ‌రింత ప‌లుచ‌న‌య్యే ప్ర‌మాదం ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. అయినా చంద్ర‌బాబుకి మ‌రో మార్గం లేని స్థితిని జ‌గ‌న్ ఏర్ప‌రిచిన‌ట్టు అంతా భావిస్తున్నారు. స్వ‌యంగా చంద్ర‌బాబు మాత్రం ఈ విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తూ ఇత‌ర నేత‌లు, అనుబంధ విభాగాలు దూకుడు ప్ర‌ద‌ర్శించేలా టీడీపీ అధిష్టానం వ్యూహ ర‌చ‌న చేసిన‌ట్టు చెబుతున్నారు. ఆపార్టీకి చెందిన సోష‌ల్ మీడియా విభాగం మ‌రో అడుగు ముందుకేసి ప్ర‌త్య‌క కోస్తా అంటూ మ్యాపులు కూడా సిద్ధం చేసి పోరాటం చేస్తామ‌న‌డం మ‌రో విశేషంగా క‌నిపిస్తోంది. ఇదంతా ప్ర‌జ‌ల్లో అమ‌రావ‌తి సెంటిమెంట్ రాజేసే య‌త్న‌మే త‌ప్ప మ‌రోటి కాద‌ని భావిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ మ‌ళ్లీ పాత అస్త్రాన్నే ప్ర‌యోగిస్తున్న వేళ ఫ‌లితాలు ఆశించ‌లేమ‌ని ప‌రిశీల‌కులు సైతం అంచ‌నా వేస్తున్నారు. కానీ పూర్తిగా న‌ష్ట‌పోతున్న స‌మ‌యంలో న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగానే ఇలాంటి ఎత్తులు వేస్తున్న‌ట్టు భావిస్తున్నారు. మ‌రి బాబు ప్ర‌య‌త్నాలు ఏమేర‌క‌యినా ఫ‌లిస్తాయా లేక అస‌లుకే ఎస‌రు తెస్తాయా అన్న‌ది వేచి చూడాల్సిన అంశం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి