iDreamPost

అది కూడా ఆయనగారి నిర్మితమేనంట …

అది  కూడా ఆయనగారి నిర్మితమేనంట …

ప్రపంచంలో ఏ మూల ఎవరు ఏమి కట్టినా , ఎవరేమి సాధించినా నేనే కట్టాను అనే “నేనే”వాదం బాబు గారు ఇప్పుడల్లా వదిలేట్టు లేరు . ఈ ధోరణికి టీడీపీ నేతలు సైతం బెంబేలెత్తిపోతుండగా బాబు మాత్రం రోజు రోజుకీ నేనే స్తోత్రాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు .

తాజాగా తెలంగాణ ప్రభుత్వం గచ్చిబౌలి లోని స్పోర్ట్స్ విలేజ్ భవనాన్ని కరోనా ట్రీట్మెంట్ సెంటర్ గా మారుస్తున్న విషయం తెలిసిన బాబు వెంటనే నేనే కట్టాను . నేను కట్టిన దాన్నే వాడుకున్నారు అని నిన్న జూమ్ యాప్ లైవ్లో చెప్పుకొన్నారు . అయితే అది బాబు గారు నిర్మించారా ? . ఎంత నిధులు వెచ్చించారు అన్నది పరిశీలిస్తే వైఎస్ రాజశేఖరరెడ్డి గారి పేరు బయటికి రావడంతో పాటు ఆసక్తికర విశేషాలు తెలిశాయి .

2001 లో నేషనల్ గేమ్స్ నిర్వహణకు , వచ్చే క్రీడాకారుల వసతి కొరకు క్రీడా స్టేడియం నిర్మించటానికి బాబు గారు టెండర్లు పిలిచారు . అయితే ప్రభుత్వ ఖర్చుతో నిర్మించడం కాకుండా కాంట్రాక్టర్ కి భూమి అమ్ముతామని స్టేడియంతో పాటు , క్రీడాకారుల వసతి కోసం అపార్ట్మెంట్స్ నిర్మించి గేమ్స్ అయిపోయాక సదరు అపార్టుమెంట్స్ కాంట్రాక్టర్స్ అమ్ముకొనే ఒప్పందం పై భూమి అమ్మి నిర్మింపచేశారు .

ఈ స్టేడియం లో 2002 లో అన్ని రాష్ట్రాల నుండి వొచ్చిన 6500 మంది క్రీడాకారులతో నేషనల్ గేమ్స్ నిర్వహించారు . గచ్చిబౌలి ప్రాంతం నగరానికి దూరంగా ఉండటం,అప్పట్లో ఆ చుట్టుపక్కల 10 కి.మీ మేర ఎక్కడా రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందకపోవటంతో ప్రజలు ఆ అపార్ట్మెంట్స్ కొనటానికి ఆసక్తి చూపలేదు. అపార్టుమెంట్స్ అమ్మకాలు జరక్కపోవటంతో వాటిని ప్రభుత్వామే స్వాధీనం చేసుకోమని
కాంట్రాక్టర్ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబును సంప్రదించగా ఆయన పట్టించుకోలేదు.

ఆ తర్వాత 2003 అక్టోబర్ లో ఆప్రో నేషనల్ గేమ్స్ హైదరాబాద్ లో నిర్వహించాల్సివచ్చినప్పుడు 96 దేశాల నుండి 2000 మంది పైగా క్రీడాకారులకు వసతి సదుపాయాల ఏర్పాట్లు చేయాల్సిరాగా మళ్లీ సదరు కాంట్రాక్టర్స్ ని ఒప్పించి అదే అపార్టుమెంట్స్ ని క్రీడాకారుల వసతి కోసం వినియోగించుకున్నారు .

ఆ తర్వాత చంద్రబాబు 2004లో అధికారం కోల్పోవడం , వైయెస్ ముఖ్యమంత్రి కావడం జరిగాయి .2007 లో నిర్వహించాల్సిన మిలట్రీ గేమ్స్ కోసం హైదరాబాద్ ఎంపికయ్యింది. క్రీడాకారుల , వారి సహాయకులు వసతి గురించి శోధించిన వైఎస్ సదరు కాంట్రాక్టర్స్ ని సంప్రదించగా , గతంలో ప్రభుత్వాన్ని హ్యాండోవర్ చేసుకోమని కోరామని దాన్ని చంద్రబాబు పట్టించుకుపోలేదని,2004 రియల్ ఎస్టేట్ బూమ్ లో చాలా వరకూ అపార్టుమెంట్స్ అమ్మేసామని తెలిపారు .

దీనితో  వైఎస్ఆర్ అదే స్టేడియంలో క్రీడాకారుల వసతి కోసం 40 కోట్ల వ్యయంతో యుద్ధప్రాతిపదికన 13 అంతస్థుల “స్పోర్ట్స్ విలేజ్” భవనాన్ని నిర్మించి 101 దేశాల నుండి వచ్చిన 5000 మంది క్రీడాకారులకు ఆతిద్యమిచ్చి మిలట్రీ గేమ్స్ నిర్వహించారు .ఈ స్పోర్ట్స్ స్పోర్ట్స్ విలేజ్ శంకుస్థాపన శిలాఫలకం ఇప్పటికి అక్కడ ఉంది.

అలా 2005 లో మొదలు పెట్టిన స్పోర్ట్స్ విలేజ్ నిర్మాణం 2007 నాటికి మొదటి ఎనిమిది అంతస్తులు ఇంటీరియర్ సహా అమర్చి క్రీడా కారుల వసతి కోసం వాదారు. ఐదు అంతస్తులు దాదాపు నిరుపయోగంగా ఉన్నాయి . ప్రస్తుతం అదే భవనం అత్యవసర స్థితిలో తెలంగాణా ప్రభుత్వానికి అక్కరకు వచ్చింది . కరోనా ఐసోలేషన్ సెంటర్ కోసం అన్నివిధాల సౌకర్యంగా ఉండే సెంటర్ కోసం శోధించిన తెలంగాణా ప్రభుత్వానికి అవసరానికి ఆపద్బాంధవిలా మారింది ,13 ఏళ్ల నుండి పెద్దగా వినియోగంలో లేని ఈ భవంతి .

ఈ విధంగా 2007 లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చేత నిర్మితమయ్యి ఆయన చేతుల మీదుగా ప్రారంభించిన భవనాన్ని కూడా నేనే నిర్మించాను అని చెప్పుకోవడం చూస్తే ఆయనకి మెగలోమేనియా అనే మానసిక వ్యాధి ఉందని సైకాలజిస్ట్ ల విశ్లేషణ కరెక్ట్ అని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తుండటం విశేషం .

సృష్టిలో ప్రతి అద్భుతం నా సొంతం నేనే క్రియేట్ చేశా అని చెప్పుకునే బాబు తాను నిర్మించానని చెప్పుకునే అమరావతి మహా నగరంలో ఇల్లు కట్టుకోకుండా కుతుబ్ షా నిర్మించిన నగరంలో ఇల్లు ఎందుకు కట్టుకొన్నాడో , కరోనా వైరస్ వ్యాపిస్తున్న క్లిష్ట పరిస్థితుల్లో తనకు ఇరవై మూడు స్థానాలు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ని గాలికొదిలేసి కట్టుబట్టలతో తరిమేశారు అని ఆయన చెప్పుకొన్న హైదరాబాద్లో మకాం ఎందుకు పెట్టారో అన్న ప్రశ్నలు ఎదురవుతాయి.., చంద్రబాబు ఇప్పటికైనా వాస్తవంలోకి వచ్చి వ్యవహరించాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి