iDreamPost

ఉక్కు ప్రైవేటీకరణపై హైకోర్టులో పిల్

ఉక్కు ప్రైవేటీకరణపై హైకోర్టులో పిల్

విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రభుత్వ పెట్టుబడులను వంద శాతం ఉపసంహరించుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో కేసు దాఖలైంది. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ మంగళవారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

2015 నుంచి నష్టాలు వస్తున్నాయన్న సాకుతో స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయాలనుకోవడం తగదని పిటిషన్ లో పేర్కొన్నారు. ప్లాంట్ ను లాభాల బాటలోకి మళ్లించేందుకు పలు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నా కేంద్రం ప్రైవేతీకరణకే మొగ్గు చూపుతోందని.. ఆ దిశగా చర్యలు తీసుకుంటోందని పిటిషనర్ ఫిర్యాదు చేశారు. వేలాది ఉద్యోగుల భవిష్యత్తును, తెలుగు ప్రజల భావోద్వేగాలను కాపాడేలా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకోవాలని పిటిషనర్ కోర్టును కోరారు.

ఉద్యమానికి తోడుగా న్యాయపోరాటం..

విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలని కేంద్ర ఆర్థిక వ్యవహారాలు కేబినేట్ కమిటీ నిర్ణయించడంతో జనవరి చివరి వారం నుంచి ఉక్కుపరిరక్షణ ఉద్యమం జోరుగా సాగుతోంది. ఉక్కు ఉద్యోగులతో పాటు అన్ని కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు నిర్బహిస్తున్న ఈ ఉద్యమానికి జేడీ లక్ష్మీ నారాయణ గతంలోనే మద్దతు ప్రకటించారు. ఉద్యమ కార్యాచరణపై కార్మిక సంఘాల ప్రీతినిధులతో చర్చించారు. కాగా ఇటీవల అనకాపల్లిలో మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు క్యాంప్ కార్యాలయంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, లక్ష్మీ నారాయణ, గంటా భేటీ అయ్యారు. కార్మిక ఉద్యమానికి తోడు రాజకీయ, న్యాయ పోరాటం నిర్వహించడం పై వారు చర్చించారు. ఆ మేరకు లక్ష్మీ నారాయణ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

ప్రైవేట్ వైపు కేంద్రం అడుగులు..

ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ ఉద్యమాలు జరుగుతున్నా కేంద్రం ఏమాత్రం పట్టించుకోకుండా తన మానాన తాను పెట్టుబడుల ఉపసంహరణకు చర్యలు తీసుకుంటోంది. ఈ ప్రక్రియను నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్(ఎన్పీమ్)కు అప్పగించాలని నీతి ఆయోగ్ తాజాగా కేంద్రానికి సిఫార్స్ చేసింది. పెట్టుబడుల ఉపసంహరణకు ఈ సంస్థ రూట్ మాప్ రూపొందిస్తుందని పేర్కొంది.

Also Read : ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్వరం.. బీజేపీ భిన్నరాగం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి