iDreamPost

క‌రోనాపై క‌హానీలు చెబితే అంతే, ఏపీలో 60మందిపై కేసులు

క‌రోనాపై క‌హానీలు చెబితే అంతే, ఏపీలో 60మందిపై కేసులు

క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌రిస్తున్న త‌రుణంలో ఫేక్ వార్త‌ల ప్ర‌చారం ప‌లువురి ప్రాణాల మీద‌కు వ‌స్తోంది. ఇరాన్ లో అలాంటి త‌ప్పుడు వార్త‌ల కార‌ణంగా 300 మంది ప్రాణాలు కోల్పోయిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. క‌రోనా నివార‌ణ కోసం అంటూ మిథ‌యిన్ సేవించి వారు మ‌ర‌ణించారు. చివ‌ర‌కు ఏపీలో కూడా ఉమ్మెత్తిపువ్వు తింటే క‌రోనా రాద‌నే యూ ట్యూబ్ వీడియో చూసి ఓ కుటుంబం చేసిన ప్ర‌య‌త్నం వారి ప్రాణాల మీద‌కు వ‌చ్చింది. చిత్తూరు జిల్లా లో ముగ్గురు మృతి చెందిన విష‌యం క‌ల‌క‌లం రేపింది.

వాటికి తోడుగా కొన్ని మ‌తాలు, సామాజిక వ‌ర్గాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని త‌ప్పుడు వార్త‌లు విస్తృతంగా వైర‌ల్ చేయ‌డం కూడా తీవ్ర ఆందోళ‌న‌క‌రంగా మారుతోంది. పాత వీడియోల‌ను, మార్ఫింగ్ వీడియోల‌ను కూడా ప్ర‌స్తుత ఘ‌ట‌న‌ల‌తో ముడిపెట్టి ప్ర‌చారం చేస్తున్న విష‌యం క‌ల‌వ‌రం క‌లిగిస్తోంది. చివ‌ర‌కు దేవ‌స్థానాల‌ను కూడా క్వారంటైన్ సెంట‌ర్లుగా మార్చేశార‌ని కొంద‌రు సోష‌ల్ మీడియాలో చేసిన ప్ర‌చారం దుమారం రేపింది.

ఇలాంటి ప‌రిస్థితుల్లో సోష‌ల్ మీడియాలో త‌ప్పుడు పోస్టింగ్స్ చేస్తున్న వారిపై ఏపీ పోలీసులు క‌ఠిన చ‌ర్య‌ల‌కు పూనుకుంటున్నారు. అందులో భాగంగా ప‌లు కేసులు న‌మోదు చేస్తున్నారు. ఇప్ప‌టికే 60 మందిని గుర్తించి వారిపై కేసులు పెట్టారు. వాటిలో ఎక్కువ‌గా చిత్తూరు,క‌ర్నూలు , నెల్లూరు జిల్లాలోనే ఉండ‌డం విశేషం. క‌రోనాకి సంబంధించి నిర్దార‌ణ లేని వార్త‌లు ప్ర‌చురించినా, షేర్లు చేసినా చ‌ట్ట‌రీత్యా శిక్షార్హం. ఈ విష‌యంపై సుప్రీంకోర్ట్ కూడా కూడా సీరియ‌స్ అయ్యింది. దాంతో తెలంగాణా వంటి ప్ర‌భుత్వాలు ఫ్యాక్ట్ చెక్ కోసం ప్ర‌త్యేకంగా వెబ్ సైట్లు కూడా రూపొందించాయి. ఏపీలో మాత్రం వాట్సాప్, ఎఫ్ బీ సహా అన్ని సోష‌ల్ మీడియా ఫ్లాట్ పామ్ పై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టాయి. యూట్యూబ్ వీడియోలను కూడా స‌మ‌గ్రంగా ప‌రిశీలిస్తున్నారు.

ఇప్ప‌టికే 60 మందిపై కేసులు పెట్టిన నేప‌థ్యంలో క‌రోనా మీద క‌హానీలు ప్ర‌సారం చేసే వారందరిపై మ‌రిన్ని క‌ఠిన చ‌ర్య‌ల‌కు ఏపీ పోలీసులు స‌న్న‌ద్ద‌మ‌వుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి