iDreamPost

కెప్టెనే ఇంటి పేరుగా మార్చిన సినిమా – Nostalgia

కెప్టెనే ఇంటి పేరుగా మార్చిన సినిమా – Nostalgia

నిజ జీవితంలో పాత్రలను తీసుకుని వాటిని బయోపిక్స్ పేరుతో సినిమాలుగా తీయడం గత కొన్నేళ్లలో విపరీతంగా పెరిగిపోయింది. అలా కాకుండా కేవలం వాటి నుంచి స్ఫూర్తి పొంది ఊహాజనితమైన కథను రాసుకుని ఓ హీరో స్థాయిని పెంచడం చాలా అరుదుగా జరుగుతుంది. దానికో మంచి ఉదాహరణ కెప్టెన్ ప్రభాకర్. ఆ విశేషాలు చూద్దాం. 1990లో పూలన్ విసరనై(తెలుగులో పోలీస్ అధికారి)తో తన డెబ్యూ చేసిన దర్శకుడు సెల్వమణికి మొదటి ప్రయత్నమే గొప్ప విజయాన్ని అందించింది. విజయ్ కాంత్ హీరోగా రూపొందిన ఈ మూవీ అప్పట్లో సూపర్ హిట్ కలెక్షన్ల తో రికార్డులు కొట్టింది.వెంటనే ఈ కాంబినేషన్ లో మరో సినిమాకు శ్రీకారం చుట్టారు ఇబ్రహీం రౌతర్. ఈయనే మొదటిదానికి కూడా నిర్మాత.

ఆ సమయంలో అడవిదొంగ వీరప్పన్ హవా ఓ రేంజ్ లో సాగుతోంది. నాలుగు రాష్ట్రాల పోలీసులను మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు కానీ ఎన్ని ప్లాన్లు వేసినా అంతులేని తెలివితేటలతో తప్పించుకుంటున్నాడు. మరోవైపు శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం పోరాడుతున్న ఎల్టిటిఈ చీఫ్ ప్రభాకరన్ తీవ్రవాది అయినప్పటికీ జనంలో ఒకరకమైన ఆరాధ్య భావంతో హీరోగా వెలుగొందుతున్నాడు. ఈ రెండు పాత్రలను కలిపి ఓ కథగా మలిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనే సెల్వమణిని కెప్టెన్ ప్రభాకరన్ కథ రాసుకునేలా చేసింది. భారీ బడ్జెట్ తో సినిమా స్కోప్ లో చాలాకూడి అనే అడవి ప్రాంతంలో కఠినమైన పరిస్థితుల మధ్య రెండు నెలలు షూటింగ్ చేశారు. క్లైమాక్స్ లో వీరప్పన్ లాంటి వాళ్ళు ఎందుకలా అవుతారనే దాని మీద సంధించిన ప్రశ్నలు ఆలోచింపజేసేలా ఉంటాయి.ఈ పాత్ర చేసిన మన్సూర్ అలీఖాన్ కు తర్వాతి కాలంలో అవకాశాలు క్యూ కట్టాయి.

ఇందులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. సినిమా మొదలైన అరగంట తర్వాతే విజయ్ కాంత్ ఎంట్రీ ఉంటుంది. శరత్ కుమార్ ఇరవై నిమిషాల లోపే చనిపోయే చిన్న పాత్ర చేశారు. రమ్యకృష్ణ అతని ద్వారా గర్భవతి అయ్యే క్యారెక్టర్ లో చివరి దాకా కనిపిస్తుంది. ఇళయరాజా అంతటి దిగ్గజంతో సెల్వమణి కథకు అనుగుణంగా కేవలం 2 పాటలు మాత్రమే కంపోజ్ చేయించుకున్నారు. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గొప్పగా చేయడం అప్పట్లో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఇది విజయ్ కాంత్ 100వ సినిమా. దీని దెబ్బకే ఇది కాస్తా ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. తమిళంలో 1991 ఏప్రిల్ లో విడుదలై విజయం సాధించాక తెలుగులో అదే సంవత్సరం ఆగస్ట్ 23న సిఎల్ నరసారెడ్డి డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తే ఇక్కడా సూపర్ హిట్ అందుకుంది. విజయ్ కాంత్ కు సాయికుమార్ చెప్పిన డబ్బింగ్ మెయిన్ హై లైట్ గా నిలిచింది. మాజీ నటి ఇప్పటి ఎమ్మెల్యే రోజా భర్తే ఈ దర్శకుడు సెల్వమణి అన్న సంగతి తెలిసిందే.

Also Read : స్టయిలిష్ లెక్చరర్ గా మెగాస్టార్ రచ్చ – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి