iDreamPost

అప్పుల లెక్కల్లో తిప్పలు పడుతున్న యనమల..!

అప్పుల లెక్కల్లో తిప్పలు పడుతున్న యనమల..!

స్వయం ప్రకటిత మేధావిగా పేరుగాంచిన ఆర్థిక శాఖ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు తన తెలివితేటలను ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు యనమల రామకృష్ణుడు తన మేధావితనాన్ని ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం అప్పులు చేస్తోందని చెప్పేందుకు యనమల ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తమ హాయంలో చేసిన అప్పుల మాటేమిటన్న ప్రశ్న వస్తుందని ముందే ఊహించిన యనమల రామకృష్ణుడు తాము చేసిన అప్పులను గత ప్రభుత్వాలతో కలిపి చెబుతూ నవ్వులపాలవుతున్నారు.

అప్పుల కుప్పలు, ప్రజలకు తిప్పలు తప్పా బడ్జెట్‌లో ఏమీ లేదంటూ యనమల తాజాగా ఈ రోజు విమర్శించారు. బంగారం లాంటి రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్‌గా మార్చేశారని బాధపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 3.50 లక్షల అప్పులు చేసేందుకు సిద్ధమైందని అంచనా వేశారు. ఏడాదిలోనే 60 వేల కోట్ల రూపాయల అప్పులు చేశారని చెప్పుకొచ్చారు.

యనమల ప్రకటన సారాంశం చూస్తే.. వైసీపీ ప్రభుత్వం అప్పులు చేస్తోందని చెప్పేందుకు ప్రయత్నించినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలో యనమల తమ టీడీపీ ప్రభుత్వ హాయంలో చేసిన అప్పులను దాచిపెట్టేందుకు చేసిన ప్రయత్నం హాస్యాస్పదంగా ఉంది. 60 ఏళ్లలో 3 లక్షల కోట్ల అప్పులు చేస్తే.. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 3.50 లక్షల కోట్ల అప్పులు చేసేందుకు సిద్ధమైందన్నారు. ఈ ఏడాది 60 వేల కోట్ల అప్పులు అయ్యాయి కాబట్టి రాబోయే నాలుగేళ్లలో కూడా ఇదే స్థాయిలో అప్పులు చేస్తారు, ఫలితంగా మొత్తం ఐదేళ్లలో మూడున్నర లక్షల కోట్ల అప్పులు అవుతాయని లెక్కలు వేశారు. కానీ ఇక్కడ యనమల ప్రజలకు చెప్పాల్సిన నిజాలు కొన్ని ఉన్నాయి. వాటిని చెప్పి విమర్శలు చేస్తే అర్థవంతంగా ఉండడంతోపాటు, వాస్తవానికి దగ్గరగా కూడా ఉంటాయి.

టీడీపీ ప్రభుత్వ హాయంలో ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు రాష్ట్ర అప్పులపై ప్రజలకు చెప్పాల్సిన విషయాలు ముఖ్యంగా నాలుగు ఉన్నాయి. ఒకటి.. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏపీ అప్పు ఎంత..? రెండో విషయం..ఐదేళ్ల చంద్రబాబు ప్రభుత్వ పాలన తర్వాత ఏపీ అప్పు ఎంత..? ఇక మూడోది.. టీడీపీ ప్రభుత్వం దిగిపోయే ముందు కాంట్రాక్టర్లకు, ఇతర పథకాలకు పెండింగ్‌లో పెట్టిన బిల్లుల మోత్తం విలువ ఎంత..? నాలుగో విషయం.. దిగిపోయే సమయానికి రాష్ట్ర ఖజానాలో ఎంత మొత్తం నిధులున్నాయి..? ఈ నాలుగు విషయాలకు జవాబులు యనమల రామకృష్ణుడు వద్ద తప్పకుండా ఉంటాయి. దీనికి పెద్దగా తలబాదుకోవాల్సిన అవసరం కూడా లేదు.

రాష్ట్ర విభజన తర్వాత 58:42 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తులు, అప్పుల పంపకం జరిగింది. ఈ క్రమంలో ఏపీకి తన వాటాగా దాదాపు 90 వేల కోట్ల రూపాయల అప్పు వచ్చింది. 2014 నాటికి ఆంధ్రరాష్ట్రం ఏర్పడి 64 ఏళ్లు కాగా, తెలంగాణాతో కూడిన ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడి 61 ఏళ్లు అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన కాలాన్ని పరిగణలోకి తీసుకుంటే.. 2014 నాటికి 61 ఏళ్లలో ఏపీ అప్పు దాదాపు 90 వేల కోట్ల రూపాయలు. ఇది నిజం కాదని యనమల చెప్పగలరా..? తమ ప్రభుత్వ హాయంలో 2014 నుంచి 2019 మధ్య 2.50 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేయలేదని చెప్పగలరా..? 60 ఏళ్లలో 3 లక్షల కోట్ల అప్పులు చేశామని చెబుతున్న యనమల ఆ లెక్కలు ఏ ప్రతిపాదికన చెబుతున్నారో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది.

ఏడాది పాలనలో వైసీపీ ప్రభుత్వం 60 వేల కోట్లరూపాయల అప్పులు చేసిందని చెబుతున్న యనమల… అందుకు గల కారణాలను వెల్లడించగలరా..? ఆర్థిక మంత్రిగా వ్యవహారం నడిపిన యనమల.. చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే ముందు దాదాపు 60 వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. ఇందులో రెండేళ్లుగా చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్‌మెంట్‌ బకాయిలు 1800 కోట్ల రూపాయలు, ఎంఎస్‌ఎంఈలకు రాయితీల రూపంలో ఇవ్వాల్సిన 900 కోట్లు, కరవు ప్రాంతంలో ట్యాంకుల ద్వారా తాగునీరు తోలిన వారికి బిల్లులు, డిస్కం లకు 20 వేల కోట్లు, వివిధ సివిల్‌ పనులు చేసిన కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బాకాయలు ఉన్నాయి. ఈవన్నీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కటిగా చెల్లించుకుంటూ వస్తోంది. కాదు.. తాము రూపాయి కూడా బకాయిలు పెట్టలేదని యనమల రామకృష్ణుడు చెప్పగలరా..? టీడీపీ ప్రభుత్వం దిగిపోయే సమయంలో రాష్ట్ర ఖజానాలో కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఈ విషయం చంద్రబాబు భగవద్గీతగా భావించే ఈనాడు పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. ఇది నిజం కాదని యనమల అనగలరా..?

తాము చేసిన అప్పులు, తప్పులు ఇతరులపై రుద్దడానికి యనమల తన అనుభవాన్ని ఉపయోగిస్తూ ప్రయత్నాలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. తాము చేసిన అప్పులు గురించి చెప్పి, అందుకు సహేతుకమైన కారణాలు వివరిస్తే ప్రజలు అభినందిస్తారు. ఆ తర్వాత ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు చేస్తే స్వాగతిస్తారు. అంతేకానీ.. అవకాశం ఉంది కాబట్టి అప్పులు చేస్తున్నాం.. అని చెప్పిన యనమల రామకృష్ణుడు ఇప్పుడు ఇలాంటి విమర్శలు చేస్తే అవి బూమరాంగ్‌ అవుతాయి. ఈ విషయం మేధావి అయిన యనమలకు తెలియదనుకోవాల్సిన పని లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి