iDreamPost

మాయావతికి షాక్ ఇచ్చిన ఎమ్మెల్యేలు

మాయావతికి షాక్ ఇచ్చిన ఎమ్మెల్యేలు

ఉత్తరప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. పది రాజ్యసభ స్థానాలకు గాను పదకొండవ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడంతో ఉత్తరప్రదేశ్‌ రాజ్యసభ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.ఇక బహుజన్ సమాజ్‌ పార్టీ (బిఎస్‌పి)కి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు తమ నిర్ణయంతో అధినేత్రి మాయావతిని ఖంగు తినిపించారు.

రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల వేళ బిఎస్‌పి అధినేత్రి మాయావతికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. బిఎస్‌పి అధికార అభ్యర్థి అయిన రాంజీ గౌతమ్‌కు ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు రిటర్నింగ్ అధికారికి తెలియజేశారు. పైగా రాంజీ గౌతమ్‌ అభ్యర్థిత్వానికి మద్దతుగా తమ సంతకాలను కూడా ఫోర్జరీ చేశారంటూ ఫిర్యాదు చేయడం గమనార్హం.కాగా బిఎస్‌పి అభ్యర్థికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన కొద్దిసేపటికే ఎమ్మెల్యేలంతా నేరుగా సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ను లక్నోలోని పార్టీ కొత్త కార్యాలయంలో కలవడం ఆసక్తికర పరిణామం.

సమాజ్‌వాది పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా వారణాసికి చెందిన న్యాయవాది ప్రకాష్ బజాజ్ మంగళవారం రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేశారు. కాగా బుధవారం నామినేషన్ల గడువు ముగిసిన తర్వాత బహుజన్ సమాజ్‌ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు అఖిలేష్ యాదవ్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ‘బిఎస్‌పి’ కి వీడ్కోలు పలికిన ఐదుగురు ఎమ్మెల్యేలలో అస్లాం చౌదరి, అస్లాం రైనీ, ముజ్తాబా సిద్దిఖీ, హకీమ్ లాల్ బింద్, గోవింద్ జాతవ్ ఉన్నారు. ఈ పరిణామాలకు ఒక్కరోజు ముందు అస్లాం చౌదరి భార్య సమాజ్‌వాది పార్టీలో చేరడం విశేషం.

ఇక యూపీ అసెంబ్లీలోని ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా బిజెపి ఎనిమిది స్థానాలను సునాయాసంగా కైవసం చేసుకుంటుంది. సమాజ్‌వాదీ పార్టీ కూడా సులభంగా ఒక స్థానాన్ని గెలుచుకుంటుంది.కాగా పదో స్థానం సీటు కోసం సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రకాష్ బజాజ్,బిఎస్‌పి అభ్యర్థి రాంజీ గౌతమ్ తలపడనున్నారు. అధికార బీజేపీ కూడా తొమ్మిదవ అభ్యర్థిని బరిలోకి దిగుతుందని వార్తలు వచ్చినప్పటికీ అవి వాస్తవ రూపం దాల్చలేదు.కానీ ఇంతలో స్వతంత్ర అభ్యర్థి ఎన్నికల బరిలోకి దిగడం వల్ల తమ అభ్యర్థి విజయానికి సరిపడా సంఖ్యా బలం లేని బిఎస్‌పి ఇతర పార్టీల ఎమ్మెల్యేలపై ఆధారపడాల్సి ఉంటుంది.

కాగా బిఎస్‌పి అభ్యర్థి రాంజీ గౌతమ్‌ నామినేషన్ పత్రాలపై ప్రపోజర్లుగా సంతకాలు చేసిన ఐదుగురు ఎమ్మెల్యేలు తమ మద్దతును వెనక్కి తీసుకోవడంతో ఆయన నామినేషన్ చెల్లుబాటు ప్రమాదంలో పడింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి