iDreamPost

Brahmastra బ్రహ్మాస్త్ర ఈవెంట్ – బోలెడు ట్విస్టులు

Brahmastra బ్రహ్మాస్త్ర ఈవెంట్ – బోలెడు ట్విస్టులు

నిన్న రామోజీ ఫిలిం సిటీలో భారీ ఎత్తున ప్లాన్ చేసుకున్న బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ శివ ప్రీ రిలీజ్ ఈవెంట్ తాలూకు పరిణామాలు ఏ థ్రిల్లర్ సినిమాకు తీసిపోలేదు. అనుకున్నట్టే సవ్యంగా జరుగుతుందని ఊహించిన తారక్ అభిమానులు తీరా అక్కడికి చేరుకునే లోపే క్యాన్సిల్ అయ్యిందనే పిడుగు లాంటి వార్త షాక్ కు గురి వేసింది. అప్పటికే దీని నిర్వహణ కోసం రెండు కోట్ల దాకా ఖర్చు పెట్టారనే టాక్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. దీంతో వేరే మార్గం లేక అప్పటికప్పుడు పార్క్ హయత్ కు షిఫ్ట్ చేసి కేవలం మీడియాను మాత్రమే అనుమతించి జూనియర్ తో పాటు నాగార్జున, రాజమౌళి, కరణ్ జోహార్, రన్బీర్ కపూర్, అలియా భట్ లు మాట్లాడించారు.

నగరంలో వినాయక చవితి ఉత్సవాలు భారీ ఎత్తున జరుగుతున్న సందర్భంగా పోలీస్ శాఖా ఆ బందోబస్తు పనుల్లో బిజీగా ఉంది. తగినంత సిబ్బంది అందుబాటులో లేరు. మరోవైపు గతంలో ఆర్ఎఫ్సిలోనే జరిగిన సాహో, రాధే శ్యామ్ ఈవెంట్ల తాలూకు అనుభవాలను ఉదహరిస్తూ అనుమతిని తిరస్కరించారు. ఈ మధ్యే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ లు కలుసుకోవడం వల్లే ఇలా జరిగిందనే ప్రచారం సోషల్ మీడియాలో కనిపిస్తోంది కానీ ఇదంత నమ్మశక్యంగా అయితే లేదు. పైన చెప్పిన రెండు ప్రభాస్ సినిమాల వేడుకలు జరుగుతున్నప్పుడు ట్రాఫిక్ జామ్ కావడం, వేలు దాటి లక్షల్లో ఫ్యాన్స్ తరలిరావడంతో పోలీసులకు అదుపు చేయడం ఇబ్బందయ్యింది

అందుకే ఇప్పుడీ బ్రహ్మాస్త్ర ఈవెంట్ కి నో చెప్పారు. ఇంకో ఆరు రోజుల్లో విడుదల కాబోతున్న ఈ విజువల్ గ్రాండియర్ అడ్వాన్స్ బుకింగ్ హైదరాబాద్ లో మొదలుపెట్టేశారు. కాకపోతే త్రిడి హిందీ వెర్షన్ కి 325 రూపాయల ధర నిర్ణయించడం మూవీ లవర్స్ ని షాక్ కి గురి చేస్తోంది. ఆర్ఆర్ఆర్, సర్కారు వారి పాట తర్వాత అంత భారీ మొత్తం పెట్టింది దీనికే. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఏదోలా మేనేజ్ అయిపోతుంది కానీ ఏ మాత్రం అటుఇటు అయినా అంతే సంగతులు. అసలే బాలీవుడ్ ఆశలన్నీ దీని మీదే ఉన్నాయి. గత రెండు మూడు నెలలుగా వరస డిజాస్టర్లతో కుదేలైన హిందీ సినిమాకు ఊపిరిలూదాల్సింది ఈ బ్రహ్మాస్త్రనే. మొత్తం మూడు భాగాలుగా ఇది రానుంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి