iDreamPost

కాంగ్రెస్ క్యాడర్ పైనే బీజేపీ కన్ను

కాంగ్రెస్ క్యాడర్ పైనే బీజేపీ కన్ను

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ వార్ లో బోర్లపడింది. క్రమంగా పట్టును కోల్పోతున్న హస్తానికి మరో షాక్ గట్టిషాక్ తగలనుంది. జీహెచ్ఎంసీ ఫలితాల వేళ మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు ఉద్యోగులు అభిప్రాయాన్ని ప్రతిబింభిస్తున్నాయన్న ఆయన సాధారణ ప్రజలు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ను ఎదుర్కొనే సత్తా బీజేపీకే ఉందని ప్రజలు విశ్వసిస్తున్నారంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విశ్వేశ్వర్ రెడ్డి కాషాయ కండువా కప్పుకోనున్నారనే వాదనకు మరింత బలం చేకూర్చుతున్నాయి ఆయన కామెంట్స్.

గ్రేటర్ బరిలో సత్తా చాటలేక చతికిలపడిన కాంగ్రెస్ పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు మారింది. ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోని ప్రభుత్వ వ్యతిరేకతను కూడా క్యాష్ చేసుకోలేకపోతోంది. రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ కి ఓటమి తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కింది స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కాంగ్రెస్ నేతలందరిలో పార్టీ భవితవ్యంపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. దీంతో టీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అని తలపడుతున్న బీజేపీ లో తమ భవితవ్యాన్ని వెతుక్కుంటున్నారు కాంగ్రెస్ నేతలు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా పలు డివిజనల్లో కాంగ్రెస్ పార్టీలు బీజేపీ తీర్థం పుచ్చుకొని ఎన్నికల బరిలోకి దిగారు. చోటా మోటా నాయకులే కాదు… బలమైన నేతలు కూడా బీజేపీనే తమకు రాజకీయ భద్రత ఇవ్వగలదని భావిస్తున్నారు.

అటు జాతీయ స్థాయిలో, ఇటు రాష్ట్ర స్థాయిలో వైఫల్యాలను మూటగట్టుకుంటున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు విశ్వాసాన్ని ఇవ్వలేకపోతోంది. దీంతో కాంగ్రెస్ నేతలంతా బీజేపీవైపు చూస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ లో బలమైన నేతగా చెలామణి అయిన డీకే అరుణ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీలోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తూ అధికార టీఆర్ఎస్ తో తలపడుతున్నారు. ఇప్పుడు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వంతు. కాంగ్రెస్ పార్టీ బలమైన నేతలు విశ్వేశ్వర్ రెడ్డి ఒకరు. చాలాకాలంగా ఆయన బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు చెక్కర్లు కొడుతున్నాయి. ఆ ఊహాగానాలను నిజం చేస్తూ ఇప్పుడు ఆయన బీజేపీ పాట ఎత్తుకున్నారు. రేపో మాపో కాషాయ కండువా కప్పుకోవడమే తరువాయి.

ఒకరి తరువాత ఒకరు కాంగ్రెస్ నుంచి బీజేపీ గూటికి చేరతుండడంతో రాష్ట్రంలో హస్తం పార్టీ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముంది. రాష్ట్ర విభజన తరువాత ఆపరేషన్ ఆకర్ష్ తో టీడీపీ మెజార్టీ నాయకత్వాన్ని టీఆర్ఎస్ తనలో కలుపుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేసేందుకు బీజేపీ అదే వ్యూహాన్ని అనుసరిస్తోంది. మొత్తానికి రాష్ట్రంలో బీజేపీ బలం పుంజుకోవడం కాంగ్రెస్ బలహీన పడడం ఏకకాలంలో జరిగిపోతున్నాయి. ఈ పరిణామాలు రాష్ట్రంలో బీజేపీ రెండో స్థానానికి చేరడానికి దోహదం చేస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి