iDreamPost

స్వామి కోసం స్వామి కోపం!

స్వామి కోసం స్వామి కోపం!

తిరుమల తిరుపతి దేవస్థానం పై టీడీపీ అనుకూల మీడియా విష ప్రచారాలను బీజేపీ సీనియర్ నాయకుడు, న్యాయకోవిదుడు సుబ్రహ్మణ్యస్వామి తిప్పే కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలాంటి కేసు నైనా గెలిచి తీరుతారని ట్రాక్ రికార్డు ఉన్న సుబ్రహ్మణ్యస్వామి తిరుమల తిరుపతి దేవస్థానం మీద టీడీపీ అనుకూల మీడియాలో ప్రచురితమైన కొన్ని కథనాలపై న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు ట్విట్టర్ వేదికగా ఆయన మరోసారి వెల్లడించారు.

జగన్ ప్రభుత్వం వచ్చిన దగ్గరనుంచి!

తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తున్నారంటూ రకరకాల అంశాలతో, కొన్ని అబద్దపు విషయాలతో మీడియాలో జోరుగా కథనాలు వచ్చాయి. తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల టికెట్లు వెనుక జెరూసలేం రాయితీ లు అంటూ జగన్ ప్రభుత్వం ప్రమాణం చేసిన నెలలోనే టీడీపీ అనుకూల పత్రికల్లో కథనాలు వచ్చాయి. దీంతో జగన్ తిరుమలను అపవిత్రం చేస్తున్నారు అంటూ గోల మొదలైంది. అది క్రమక్రమంగా తారాస్థాయికి చేరింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయం వెలుపల పెట్టిన పూర్ణకుంభం తరహా వెలుగుల్లో సైతం పచ్చ మీడియా సిలువ ఉందని ప్రచారం చేయడం, దానిపై టీటీడీ సవివరంగా వివరణ ఇవ్వడంతో పాటు అసలు ఫోటోలను బయట పెట్టింది. పూర్ణకుంభం ఆకారంలో ఉన్న లైటింగ్ ను కావాలనే సిలువగా ప్రచారం చేస్తున్నారంటూ సాక్షాత్తూ ఆలయ ఈవో జవహర్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలా ప్రతి విషయాన్ని వెతికి వెతికి దానిని అన్యమత ప్రచారం గా వైరల్ చేసేందుకు టీడీపీ అనుకూల మీడియా తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

గతంలోనే హెచ్చరించిన సుబ్రహ్మణ్యస్వామి

టీటీడీ మీద రాజకీయాలు చేస్తున్న అంశాన్ని గతంలోనే బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి పరిశీలించారు. ఆయన పూర్తి నివేదిక తెప్పించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను మంటగలిపెందుకు, జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా చేస్తున్న ప్రయత్నంగా సుబ్రహ్మణ్యస్వామి తెలుసుకున్నారు. దీనిపై అప్పట్లోనే ఆయన టీడీపీ ను ఇంప్లిడ్ చేస్తూ ఒక కేసు వేయాలని నిర్ణయించుకున్నారు. అయితే రకరకాల కారణాల వల్ల, ఆయనకు సమయం సరిపోక పోవటంతో ఆ కేసును న్యాయస్థానాల్లో దాఖలు చేయలేదు. టీటీడీలో అన్యమత ప్రచారం అంటూ, టీటీడీ చైర్మన్ గా వై వి సుబ్బారెడ్డి ఎంపిక మీద సైతం ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చిన సమయంలోనే సుబ్రహ్మణ్యస్వామి అసత్య ప్రచారం చేస్తున్న కొన్ని మీడియా సంస్థలు మీద కేసు వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే దానిలో ఏ పత్రిక, ఈ ఛానల్ అనేది చెప్పకుండానే ఆయన కొన్ని మీడియా సంస్థలు అనడం, అదే రోజు ఆంధ్ర జ్యోతిలో కథనం రావడంతో ఆ పత్రిక మీదనే ఆయన గుర్రుగా ఉన్నారు అనేది అర్థం అవుతోంది.

మళ్ళీ ఆగ్రహం

తాజాగా టీటీడీ కమిటీ లో క్రైస్తవులకు పెద్దపీట వేస్తున్నారు అంటూ, రకరకాల మార్గాల్లో తిరుమల కొండపై క్రైస్తవ మత ప్రచారం జరుగుతోంది అంటూ కొన్ని వార్తలు రావడం సుబ్రహ్మణ్యస్వామి ఆగ్రహానికి కారణం అయింది. “తిరుమల దేవాలయాన్ని క్రైస్తవుల అడ్డాగా టీటీడీ మారుస్తుందని తరచూ వస్తున్న అవాస్తవ ప్రచారం తో నాకు విసుగుపుడుతోంది. ఇప్పటికే ఎన్నోసార్లు ఈ తరహా వార్తలు వచ్చాయి. సిబిఎన్ ఇచ్చే ఆర్థిక సహాయాన్ని పొందే మీడియా సంస్థలే ఈ తరహా వార్తలను ప్రచారం చేస్తున్నాయి. దానికి ఆ మీడియా సంస్థలే పూర్తి బాధ్యత వహించాలి. నేను స్వామివారికి ఒక భక్తుడిగా ఆ మీడియా సంస్థల పై పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించుకున్నా” అంటూ సుబ్రహ్మణ్యస్వామి తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. గతంలో వచ్చిన ఆరోపణలు ప్రచారాలను అన్ని ఒక నివేదిక రూపంలో పెట్టి, దానికి టీటీడీ ఉన్నతాధికారులు ఇచ్చిన వివరణలు జతచేసి మీడియా సంస్థలు చేస్తున్న దుష్ప్రచారం పై సవివర నివేదిక నూ ఆయన కోర్టు పిటిషన్ ద్వారా న్యాయస్థానాలకు చూపించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇలా చేయడం ద్వారానే న్యాయస్థానాలకు ఈ అసత్య ప్రచారం మీద ఒక అవగాహన ఏర్పడుతుంది అనేది సుబ్రహ్మణ్యస్వామి భావన. దీంతో ఇప్పుడు టీటీడీ అంశం జాతీయ మీడియాలోనూ చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి