iDreamPost

పరిషత్‌ ఎన్నికలపై కోర్టుకు బీజేపీ

పరిషత్‌ ఎన్నికలపై కోర్టుకు బీజేపీ

ఆగిన చోట నుంచే మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ) నీలం సాహ్ని జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ ఏపీ బీజేపీ హైకోర్టును ఆశ్రయిచింది. ఎస్‌ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని, మళ్లీ కొత్తగా నోటిఫికేషన్‌ ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలంటూ లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ మరో ముగ్గురు కూడా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని విచారణకు స్వీకరించిన ఏపీ హైకోర్టు.. మధ్యాహ్నం విచారణ జరిపే అవకాశం ఉంది.

ప్రచారం కోసమే బీజేపీ సాధ్యం కాని డిమాండ్లు చేస్తూ.. కోర్టులకు వెళ్లిందన్న విమర్శలొస్తున్నాయి. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఎస్‌ఈసీగా ఉన్నప్పుడు కూడా టీడీపీ, బీజేపీ, జనసేన, సీపీఐ పార్టీలు ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికలకు నూతనంగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని, ఇప్పటి వరకు జరిగిన ప్రక్రియను రద్దు చేయాలనే డిమాండ్లను వినిపించాయి. కోర్టులో కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే వీటì ని ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది. ఎన్నికలు ఎక్కడ వాయిదా పడ్డాయో తిరిగి అక్కడ నుంచే ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. ఏకగ్రీవాలపై విచారణను కూడా హైకోర్టు తోసిపుచ్చింది. దాంతో మున్సిపల్‌ ఎన్నికలు జరిగాయి. పరిషత్‌ ఎన్నికల ఏకగ్రీవాలపై కూడా అదే తీర్పును ఏపీ హైకోర్టు ఇచ్చింది.

గత నెలలో హైకోర్టులో ఇలాంటి తీర్పు వస్తే.. అవేమీ పట్టని బీజేపీ తాజాగా పరిషత్‌ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్‌ జారీ చేయాలంటూ లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేయడం విడ్డూరంగా ఉంది. మున్సిపల్‌ ఎన్నికల్లో కొత్తగా నామినేషన్లు దాఖలు చేసేందుకు అప్పటి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఇచ్చిన ఆదేశాలను.. హైకోర్టు కొట్టి వేసింది. బీజేపీ, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్ల మాదిరిగానే.. మున్సిపల్‌ ఎన్నికల సమయంలోనూ దాఖలవగా.. వాటిని హైకోర్టు తోసిపుచ్చింది. ఇప్పుడు పరిషత్‌ ఎన్నికల విషయంలో దాఖలైన పిటిషన్లపైనా.. హైకోర్టులో అదే తరహా తీర్పు వచ్చే అవకాశం ఉంది.

Also Read : టీడీపీ పరిషత్‌ ఎన్నికల బహిష్కరణ ఎందుకు..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి