iDreamPost

మండలి రద్దు బీజేపీకే లాభమా..?

మండలి రద్దు బీజేపీకే లాభమా..?

ఆంధ్రప్రదేశ్‌లో శాసన మండలి రద్దు వల్ల భారతీయ జనతాపార్టీ (బీజేపీ)కే లాభం చేకూరుతుందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. దక్షిణభారత దేశంలో పాగా వేయాని భారతీయ జనతాపార్టీ (బీజేపీ) కొన్నేళ్లుగా ప్రణాళికలు రచిస్తోంది. అయితే కమలనాథుల ప్లాన్లు ఇక్కడ పని చేయడంలేదు. దక్షణ భారతంలో ఒక్క కర్ణాటక మినహా మిగతా రాష్ట్రాలలో కమలం వికచించలేదు. పొత్తులు పెట్టుకుని వెళ్లినా పెద్దగా ఫలితం రాలేదు.

దక్షిణ భారత్‌లో ముఖ్యంగా కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో పాగా వేసేందుకు బీజేపీ చేయని ప్రయత్నం లేదంటే అతిశయోక్తి కాదు. స్థానికంగా ఉండే పార్టీలతో వెళ్లినా.. స్థానిక పార్టీల బలం పెరుగుతుందే తప్పా కమలానికి ప్రయోజనం ఉండడంలేదు. కేంద్రంలో వరుసగా రెండు సార్లు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కూడా దక్షిణాదిలో కాషాయ జెండా రెపరెపలాడలేదు. ఉత్తర భారత దేశంలో నిన్నమొన్నటి వరకు బలంగా ఉన్న బీజేపీ చేతి నుంచి నేడు ఒక్కొక్క రాష్ట్రం చేజారుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణభారతంలో బలపడడం బీజేపీకి తప్పనిసరవుతోంది.

Read Also: అమరావతిపై బీజేపీ అధిష్టానం వైఖరి ఏంటి ?

దక్షిణ భారత్‌లో బీజేపీ ప్రసుతతం ముఖ్యంగా మూడు రాష్ట్రాలపై దృష్టి పెట్టింది. తమిళనాడు, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలో ఉన్న రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు యత్నిస్తోంది. ఇప్పటికే తెలంగాణాలో తన ఉనికిని బలంగా చాటుకుంటోంది. కాంగ్రెస్‌లో నాయకత్వలేమీ బీజేపీకి బాగా ఉపయోగపడుతోంది. దీన్ని ఆసరాగా తీసుకుని అధికార టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అనే సందేశం ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇక తమిళనాడు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ను కొన్నేళ్లుగా దువ్వుతోంది. జయలలిత మరణంతో అన్నాడీఎంకే పార్టీలో ఏర్పడిన నాయకత్వలేమిని ఉపయోగించుకుని 2021లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జెండా ఎగురవేయాలని బీజేపీ ఆశిస్తోంది.

తాజాగా ఆంధ్రప్రదేశ్‌పై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏపీలో తాజాగా నెలకొన్న రాజకీయ పరిస్థితులు, రాజధాని వ్యవహారాలని తనకు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే జనసేనతో వ్యూహాత్మకంగా పొత్తు పెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెంకయ్య నాయుడు కేంద్రంలో మంత్రిపదవులు, పార్టీ పదవులు అలంకరించినా.. ఎన్నడూ కూడా ఏపీలో బీజేపీ బలపడేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ప్రస్తుతం బీజేపీ ఉనికి అంతో ఇంతో ఉభయ గోదావరి జిల్లాలోనే ఉంది.

Read Also: ఎవరీ సునీల్ డియొధర్ ?

2024 నాటికి బలమైన మూడో ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు బీజేపీ చేస్తున్న ప్లాన్‌కు ఆంధ్రప్రదేశ్‌లో మండలి రద్దు రూపంలో మంచి అవకాశం లభించింది. 58 స్థానాలు గల ఏపీ శాసన మండలిలో ప్రస్తుతం టీడీపీకి 26 మంది, వైఎస్సార్‌సీపీకి 9 మంది, బీజేపీకి ముగ్గురు సభ్యులున్నారు. పీడీఎఫ్‌ నుంచి ఐదుగురు, స్వతంత్రులు ముగ్గురు, గవర్నర్‌ కోటాలో టీడీపీ నుంచి ఆరుగురు, కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మొత్తం మీద టీడీపీకి 32 మంది సభ్యులున్నారు. పీడీఎఫ్, స్వతంత్ర సభ్యులు మినహాయిస్తే మిగతా 46 మంది కూడా రాజకీయ పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారే.

మండలి రద్దుపై అధికార వైఎస్సార్‌సీపీ పావులు కదుపుతోంది. మండలి రద్దు జరిగితే రాజకీయ పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలందరూ రాజకీయ నిరుద్యోగులుగా మిగులుతారు. శాసనసభకు పోటీ చేసేందుకు విపరీతమైన పోటీ ఏర్పడుతుంది. ఒకే పార్టీలో ఒకే నియోజకర్గంలో అసెంబ్లీ సీటు కోసం పోటీ పడే ఆశానువాహులు పెరుగుతారు. ఇద్దరు కంటే ఎక్కువ మంది సీటు ఆశిస్తారు. మొన్న జరిగిన ఎన్నికల్లోనూ ఇది కొనసాగింది. అయితే పార్టీలు ఆయా ఆశానువాహులకు ఎమ్మెల్సీ హామీలు ఇచ్చి.. బుజ్జగించింది. అసెంబ్లీ సీటు ఆశించిన నేతలు కూడా ఎమ్మెల్సీ పదవి హామీ రావడంతో పార్టీ గెలుపునకు సహకరించారు.

Read Also: అక్కడ కూడా సుజనా చౌదరికి నిరాశేనా?

అయితే మండలి రద్దు జరిగితే.. రాబోవు శాసన సభ ఎన్నికల్లో అసెంబ్లీ సీటు కోసం నియోజకవర్గాల్లో గ్రూపులు ఏర్పడతాయి. గెలిచినా, ఓడినా.. పోటీ చేయకపోతే నేతలకు రాజకీయ భవిష్యత్‌ ఉండదు. ఈ నేపథ్యంలో బలమైన మూడో ప్రత్యామ్నాయంగా బీజేపీ వారికి కనిపిస్తుంది. ఎన్నికల నాటికి బీజేపీలో జనసేన విలీనం అయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పవన్‌ కల్యాన్‌ కూడా మళ్లీ సినిమాల వైపుకు మళ్లారు. ఈ నేపథ్యంలో బీజేపీలో చేరడం వల్ల తమ రాజకీయ భవిష్యత్‌ బాగుంటుందన్న నమ్మకంతో వైఎస్సార్‌సీపీ, టీడీపీ పార్టీల నుంచి పలువురు నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతారనడంలో సందేహం లేదు.

వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండడంతో ఇప్పటికిప్పుడు టీడీపీ నుంచి బీజేపీలోకి ఎక్కువగా వలసలు కొనసాగుతాయన్న అంచనాలున్నాయి. మండలి రద్దే జరిగితే.. బీజేపీ పార్టీ నేతలతో కళకళలాడుతుంది. ప్రతి నియోజకవర్గంలో బలమైన నేతలు ఉంటారు. పలితంగా క్షేత్రస్థాయిలో బీజేపీకి క్యాడర్, ఓటు బ్యాంకు ఏర్పడతాయి. ఇలాంటి అవకాశాల నేపథ్యంలో మండలి రద్దుకు బీజేపీ సుముఖంగా ఉంటుందని చెప్పవచ్చు. మరి బీజేపీ ఏపీ ఇన్‌చార్జి.. సునీల్‌ ధేవ్‌ధర్‌ ఎలాంటి వ్యూహాలు రచిస్తారో.. వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి