iDreamPost

బ్రిటిష్ పుత్రులు వ్యాఖ్యలు – ‘కన్నా’ కావాలనే టార్గెట్‌ అవుతున్నారా..?

బ్రిటిష్ పుత్రులు వ్యాఖ్యలు  –  ‘కన్నా’ కావాలనే టార్గెట్‌ అవుతున్నారా..?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ వ్యవహారం చూస్తుంటే కావాలనే వైసీపీ నేతలకు, సోషల్‌ మీడియా కార్యకర్తలకు టార్గ్‌ట్‌ అవుతున్నారనే సందేహం వస్తోంది. ఎన్నికలకు ముందు కన్నా లక్ష్మీ నారాయణ సామర్థ్యంపై భారీ అంచనాలు పెట్టుకున్న బీజేపీ అధిష్టానం ఆయన్ను కమలం రాష్ట్ర సారధిగా నియమించింది. అయితే.. కన్నా సామర్థ్యం ఎన్నికల సమయంలోనూ, ఆ తర్వాత ఫలితాల్లోనూ తేలిపోయింది. బీజేపీ అధిష్టానం ఎన్నికల ఖర్చుల కోసం పంపిణ పార్టీ నిధుల గోల్‌మాల్‌తోపాటు ఒక్క సీటు కూడా బీజేపీ గెలుచుకోలేకపోయింది. కనీసం గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయింది.

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కన్నాను అధ్యక్ష పదవి నుంచి సాగనంపుతారన్న చర్చ గత కొంతకాలంగా సాగుతోంది. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లోనూ కమలానికి నూతన సారధులు వస్తారని ప్రచారం జరిగింది. ఈ మేరకు తెలంగాణలో పార్టీ అధ్యక్షుడిని బీజేపీ మార్చింది. అయితే ఏపీలో రేపో మాపో అన్నట్లుగా వ్యవహరిస్తోంది.

తన సీటుకు ఎసరు వచ్చిందని గుర్తించినప్పటి నుంచీ కన్నా లక్ష్మీ నారాయణ ఓకింత అగ్రిసివ్‌గా వెళుతున్నారు. ప్రభుత్వంపై, సీఎం జగన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కావాలనే టార్గెట్‌ అవుతున్నారన్న ప్రచారం సాగుతోంది. మొన్న విజయసాయి రెడ్డితో వివాదంతోపాటు.. అనేక అంశాలలో కన్నా లక్ష్మీ నారాయణ తీరు బీజేపీ విధానాలకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నట్లు ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే కన్నాకు.. సిసలైన బీజేపీ నేతలు ఎవరూ మద్ధతుగా లేరని చెప్పవచ్చు.

వివాదాస్పదం అవుతుందని తెలిసినా.. కూడా కన్నా లక్ష్మీ నారాయణ జాగ్రత్త పడడం లేదు కదా.. ఇంకా దూకుడుగా వెళుతున్నారు. తాజాగా ఆయన సీఎం జగన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జీవో నంబర్‌ 888, టీటీడీ ఆస్తుల విక్రయాలు తదితర నాలుగు అంశాలపై తాను రాసిన లేఖకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇంత వరకూ బాగానే ఉంది. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ నిర్ణయాలపై అనుమానాలుంటే నివృత్తి చేసుకోవడం మంచిదే. కానీ కన్నా.. నోరు జారుతున్నారు. తన డిమాండ్లపై ‘బ్రిటీష్‌ పుత్రులు’ సమాధానం చెప్పాలంటూ నోరు పారేసుకుంటున్నారు. కన్నా ఎందుకు ఇలా చేస్తున్నారంటే.. అధ్యక్ష పదవిని కాపాడుకునేందుకే ఇలా వ్యవహరిస్తున్నారనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి