iDreamPost

సినిమా కెమెరాకు గ్రామర్ నేర్పిన శ్రీరామ్

సినిమా కెమెరాకు గ్రామర్ నేర్పిన శ్రీరామ్

దర్శకుడు ఎవరైనా తన ఆలోచనలను తెరమీద అనుకున్నట్టుగా ఆవిష్కరించాలంటే అందులో ఛాయాగ్రాహకుడి పాత్ర చాలా ఉంటుంది. ఈ ఇద్దరి మధ్య కుదిరే బాండింగ్ ని బట్టే సినిమా అవుట్ ఫుట్ ఆధారపడి ఉంటుంది . అందుకే కెమెరా పట్టుకున్న ప్రతి ఒక్కరు గుర్తింపు తెచ్చుకోలేరు. ప్రేక్షకుల మనసును అందరూ గెలుచుకోలేరు. తన కన్నుతో చూసేవాళ్లకు ఓ అద్భుత ప్రపంచాన్ని చూపించే వాళ్ళు అరుదుగా ఉంటారు.

అలాంటి అరుదైన ప్రతిభావంతులు పిసి శ్రీరామ్. గత 40 ఏళ్లుగా అవిశ్రాంతంగా ఛాయాగ్రహణ బాధ్యతలు నెరవేరుస్తున్న పిసి శ్రీరామ్ గురించి తెలియని ఇండియన్ మూవీ లవర్స్ ఎవరూ ఉండరు. బాషతో సంబంధం లేకుండా ఆయన చేసిన కళా సేవ అలాంటిది. 1981లో వా ఎందపూ ఆకాశంతో తన కెమెరా ప్రయాణాన్ని మొదలుపెట్టిన పిసి శ్రీరామ్ మణిరత్నం మౌనరాగంతో మొదటి బ్రేక్ అందుకున్నారు. ఇక ఆ తర్వాత తిరిగి చూసుకోవాల్సిన అవసరం పడలేదు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన నాయకుడు, ఘర్షణ, గీతాంజలి, రోజా, సఖి చేసిన అద్భుతాలు అన్ని ఇన్ని కావు.

కమల్ హసన్ తో క్షత్రియ పుత్రుడు, అపూర్వ సహోదరులు లాంటి బ్లాక్ బస్టర్స్ కు శ్రీరామ్ పనితనం వాటిని ఇంకో స్థాయికి తీసుకెళ్ళింది. పవన్ కళ్యాణ్ ఖుషి ఒక కలర్ఫుల్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా కనిపించడానికి కారణం శ్రీరామ్ పనితనమే. చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి కాని నిన్న తమిళ్ లో విడుదలైన మిస్కిన్ సైకో దాకా ఆయన కెమెరాకు అలుపు లేదు రాదు. గణతంత్ర దినోత్సవం నాడే తన పుట్టిన రోజు రావడం శ్రీరామ్ కు కాకతాళీయమే అయినా అభిమానులకు మాత్రం ఎంతో ప్రత్యేకం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి