iDreamPost

ICC World Cup: వరల్డ్ కప్ కి ఆతిథ్యం.. BCCIకి రూ.955 కోట్ల నష్టం!

ICC World Cup: వరల్డ్ కప్ కి ఆతిథ్యం.. BCCIకి రూ.955 కోట్ల నష్టం!

మరికొన్ని రోజుల్లో క్రికెట్ పండుగ ప్రారంభం కానుంది. అక్టోబర్ 5 నుంచి జరగనున్న ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ కు ఈసారి భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 10 జట్లు భారత్ చేరుకుని ప్రాక్టీస్, వార్మప్ మ్యాచ్ లు కూడా ప్రారంభించేశాయి. ఈ టోర్నీతో బీసీసీఐకి కోట్లలో లాభాలు వస్తాయని అంతా అనుకుంటున్నారు. కానీ, ఈ టోర్నీ వల్ల బీసీసీఐకి దాదాపు రూ.955 కోట్ల మేర నష్టం జరగనుందంట. సాధారణంగా చిన్న చిన్న ద్వైపాక్షిక సిరీస్ లకు ఆతిథ్యం ఇచ్చినా కూడా బీసీసీఐకి మంచి ఆదాయమే వస్తుంది. అలాంటిది ఇంత పెద్ద టోర్నీని హోస్ట్ చేస్తున్న బీసీసీఐకి కాసుల వర్షం కురవాలి గానీ.. నష్టాలు రావడం ఏంటని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే అందుకు కారణాలు కూడా లేకపోలేదు.

ఈ వరల్డ్ ని బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ టోర్నీని సూపర్ సక్సెస్ చేయాలని బీసీసీఐ పెద్దలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది కప్పు కొట్టిన జట్టుకు ప్రైజ్ మనీగా రూ.33 కోట్లు, రన్నరప్ కు రూ.16 కోట్ల 59 లక్షలు అందించనున్నారు. ఇంక సెమీస్ లో వైదొలిగిన రెండు జట్లు రూ.6 కోట్ల 63 లక్షల చొప్పున అందుకోనున్నాయి. అలాగే ఆతిథ్యం ఇస్తున్నందుకు భారత్ మార్కెట్ కు కూడా దాదాపు రూ.13,500 కోట్ల మేర ప్రయోజనం కలగనుందని చెబుతున్నారు. కానీ, బీసీసీఐకి మాత్రం దాదాపు రూ.955 కోట్ల మేర నష్టం వాటిల్లనుందని అంచనాలు వేస్తున్నారు. పన్ను మినహాయింపు కోసం బీసీసీఐ కేంద్రానికి రిక్వెస్ట్ పెట్టుకుంది. అక్కడి నుంచే ఈ లాభ నష్టాల చర్చ మొదలైంది.

ఇంత పెద్ద టోర్నీ నిర్వహిస్తూ పన్ను మినహాయింపు కోసం రిక్వెస్ట్ పెట్టుకోవాల్సిన అవసరం బీసీసీఐకి ఏముంది అంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ టోర్నీకి సంబంధించి స్పాన్సర్ షిప్స్, ప్రసార హక్కులు, టికెట్ల అమ్మకాల ద్వారా బీసీసీఐకి ఆదాయం సమకూరనుంది. అయితే ఖర్చు పెట్టాల్సింది కూడా బాగానే ఉంది. ఈ వరల్డ్ కప్ టోర్నీని నిర్వహించేందుకు దాదాపు రూ.2 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. అందులో రూ.1500 కోట్లు బీసీసీఐ భరించనుంది. ఐసీసీకి ఆతిథ్యం ఇస్తున్నందుకు రూ.200 కోట్లు ఫీజు రూపంలో చెల్లించాల్సి ఉంది. భారత ప్రభుత్వానికి రూ.936 కోట్లు పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇలా రానుపోను లెక్కలు చూసుకుంటే చివరకు బీసీసీఐకే రూ.955 కోట్ల మేర నష్టం జరిగే అవకాశాలు ఉన్నట్లు తేల్చి చెబుతున్నారు.

భారత ప్రభుత్వం ఎందుకు పన్ను మినహాయింపునకు అంగీకరించాలి అనే అనుమానం రావచ్చు. అయితే బీసీసీఐ ఈ మెగా టోర్నీని నిర్వహించడం వల్ల.. భారత మార్కెట్ కు దాదాపు రూ.13,500 కోట్ల మేర ప్రయోజనం జరిగే అవకాశాలు ఉన్నట్లు బీక్యూ ప్రైమ్ రిపోర్ట్ అంచనా వేసింది. వరల్డ్ కప్ మ్యాచులు చూసేందుకు దేశ, విదేశాల నుంచి అభిమానులు వస్తారు. వాళ్లు ఉండేందుకు హోటల్, తినేందుకు ఆహారం, తిరిగేందుకు రవాణా వ్యవస్థ, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఇలా భారత ఆర్థిక వ్యవస్థకు భారీగా ప్రయోజనం చేకూరుతుంది. అలాగే వరల్డ్ కప్ మ్యాచ్ లు చూడటానికి వచ్చిన వాళ్లు పర్యాటక ప్రాంతాలను కూడా సందర్శిస్తారు. ఈ టోర్నీ ద్వారా మ్యాచులు చూడటానికి వచ్చిన ప్రేక్షుకులు పర్యాటకం మీదే రూ.5,700 కోట్ల వరకు ఖర్చు చేస్తారని అంచనా వేస్తున్నారు. మరి.. మెగా టోర్నీ నిర్వహించినా బీసీసీఐకి మాత్రం నష్టం వాటిల్లడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి