iDreamPost

బౌలర్ల శ్రమను వృధా చేసిన భారత బ్యాట్స్‌మెన్లు

బౌలర్ల శ్రమను వృధా చేసిన భారత బ్యాట్స్‌మెన్లు

క్రైస్ట్‌చర్చ్‌ వేదికపై న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో బౌలర్ల అద్భుత ప్రదర్శనతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో ఏడు పరుగుల ఆధిక్యం లభించింది.ఆతిథ్య కివీస్‌ను 235 పరుగులకే కట్టడి చేసిన ఆనందం రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ల వైఫల్యంతో ఆవిరైంది.ఏడు పరుగుల స్వల్ప ఆధిక్యతతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్‌కు ఓపెనర్లు మరోసారి శుభారంభం అందించకుండానే వెనుతిరగా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ తమ పేలవమైన బ్యాటింగ్ ప్రదర్శన కొనసాగించడంతో భారత రెండో ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది.తొలి ఇన్నింగ్స్‌లో అర్థ సెంచరీ సాధించిన ఓపెనర్ పృథ్వీ షా(14) సౌతీ బౌలింగ్‌లో పృథ్వీ షా లాథమ్‌కు క్యాచ్‌గా చిక్కి ఔట్ కాగా,మయాంక్ అగర్వాల్(3) కూడా బౌల్ట్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయి వెనుదిరిగాడు.

పరుగుల వేటలో మరోసారి విఫలమైన భారత రన్ మిషన్:

పరుగుల యంత్రంగా కీర్తి గడించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ 14 పరుగులు మాత్రమే చేసి గ్రాండ్‌హోమ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగి నిరాశపరిచాడు.దీంతో న్యూజిలాండ్ పర్యటనను తన చెత్త బ్యాటింగ్ ప్రదర్శనతో పూర్తి చేసుకొని విమర్శకులకు మరోసారి పని కల్పించాడు. వాగ్నర్ బౌలింగ్‌లో రహానే క్లీన్ బౌల్డ్ కాగా బౌల్ట్ బౌలింగ్‌లో పుజారా(24), నైట్ వాచ్ మెన్‌గా వచ్చిన ఉమేష్ యాదవ్(1) ఔటయ్యారు. ప్రస్తుతం తెలుగు ఆటగాడు హనుమ విహారి(5), వికెట్ కీపర్ రిషభ్‌ పంత్‌(1) క్రీజులో ఉన్నారు.రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసిన భారత్ 97 పరుగుల ఆధిక్యంలో ఉంది.సోమవారం వీరిద్దరు సాధించే పరుగుల మీదనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది.కివీస్ బౌలర్లలో బౌల్ట్ 3 వికెట్లతో రాణించాడు.

87 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన కివీస్:

అంతకుముందు ఆదివారం వికెట్ నష్టపోకుండా 63 పరుగులతో ఆట ప్రారంభించిన కివీస్‌ను భారత బౌలర్లు తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. రెండో రోజు ప్రారంభంలోనే కివీస్‌ ఓపెనర్ బ్లండెల్‌(30)ను ఉమేశ్‌ యాదవ్‌ ఎల్బీడబ్ల్యూ చెయ్యగా,మరో మూడు పరుగుల తర్వాత కెప్టెన్‌ విలియమ్సన్‌(3) బుమ్రా బౌలింగ్‌లో కీపర్‌ చేతికి చిక్కి వెనుదిరిగారు.ఈ దశలో భారత బౌలర్లు లైన్ అండ్ లెంత్ కు కట్టుబడి సరైన ప్రదేశంలో బంతులు విసరడంతో బ్యాట్స్‌మెన్లపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో రాస్ టేలర్ (15), హెన్రీ నికోల్స్ (14),వాట్లింగ్ (0), కొలిన్ డి గ్రాండ్‌హోమ్ (26)ను లను వెంటవెంటనే ఔట్ చేసి పెవిలియన్ బాట పట్టించారు. భారత బౌలర్లు అద్భుత ప్రదర్శనతో 87 పరుగులకే కివీస్ ఏడు వికెట్లు పడగొట్టి తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాను ఆదిపత్య దిశలో నడిపారు.

లోయర్ ఆర్డర్‌లో చెలరేగి ఆడి భారత ఆధిక్యతను తగ్గించిన జెమీసన్:

లోయర్ ఆర్డర్‌లో మరోసారి బౌలర్లపై ఎదురు దాడి చేసిన జెమీసన్ (49) భారత్ ఆధిక్యాన్ని గణనీయంగా తగ్గించాడు. తొమ్మిదో వికెట్‌కు వాగ్నర్ (21)తో కలసి 51 పరుగులు జోడించాడు. జేమిసన్‌ 63 బంతులలో 7 ఫోర్లు కొట్టి 49 పరుగులు సాధించాడు.ఈ క్రమంలో షమి బౌలింగ్‌లో భారీ షాట్‌ ప్రయత్నించిన వాగ్నర్‌ జడ్డూ బౌండరీ లైన్ వద్ద పట్టిన అత్యద్భుత క్యాచ్‌కు వెనుతిరిగాడు.మరో ఏడు పరుగుల తర్వాత షమి బౌలింగ్‌లోనే జేమిసన్‌ పంత్‌కు చిక్కడంతో కివీస్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది.దీంతో భారత్‌కు కీల‌క‌మైన ఏడు పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. భారత జట్టులో మహమ్మద్ షమీకి అత్య‌ధికంగా నాలుగు వికెట్లు పడగొట్టగా మిగతా బౌలర్లలో బుమ్రాకు మూడు, జడేజాకు రెండు, ఉమేశ్‌కు ఒక వికెట్ దక్కింది. కివీస్‌ ఆటగాళ్లలో ఓపెనర్ టామ్ లాథ‌మ్ (52) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి