iDreamPost

తారకరామా తెరిచారు – గతం చెప్పే కబుర్లు

తారకరామా తెరిచారు – గతం చెప్పే కబుర్లు

చాలా ఏళ్ళుగా మూతబడిన హైదరాబాద్ కాచిగూడ తారకరామా థియేటర్ ని ఇవాళ నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా రీ ఓపెనింగ్ చేశారు. ఏషియన్ భాగస్వామ్యంతో సురేష్ బాబు మరో ఇద్దరు కలిసి దీని నిర్వహణ బాధ్యతలు చూసుకోబోతున్నారు. 1978లో అక్బర్ సలీం అనార్కలితో మొదలైన దీని ప్రస్థానం కొన్నేళ్ల పాటు దిగ్విజయంగా సాగింది. అమితాబ్ బచ్చన్ డాన్ 500 రోజులకు పైగా ఆడటం అప్పట్లోనే కాదు ఇప్పటికీ అతి గొప్ప రికార్డుల్లో ఒకటి. మంగమ్మ గారి మనవడు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, భారతీయుడు లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్స్ సిల్వర్ జూబ్లీ జరుపుకున్నాయి. అమీర్ ఖాన్ రాజా హిందుస్తానీ పాతిక వారాలు ఆడటం విశేషం

ఒక దశ దాటాక ఈ థియేటర్ నిర్వహణ గాడి తప్పి కొన్ని సంవత్సరాలు బి గ్రేడ్ సినిమాలు మలయాళ డబ్బింగులు ప్రదర్శించారు. ఎన్టీఆర్ కుటుంబ ఆధ్వర్యంలో నడిచే హాలులో ఇలాంటి బొమ్మలేంటని అభిమానులు కలత చెందారు. తర్వాత మూతబడి మళ్ళీ తెరుచుకుని ఇలా రకరకాల కుదుపులకు లోనయ్యింది. ఇంత ప్రతిష్టాత్మక థియేటర్ ని ఇలా ఎందుకు వదిలేశారో అంతు చిక్కేది కాదు. మొత్తానికి అదంతా చరిత్రలో కలిసిపోయింది. ఇప్పుడు తారకరామా కొత్త రూపు సంతరించుకుంది. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ దీంతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని తల్లితండ్రుల పేరు కలిసి రావడంతో ఎన్నో ఎమోషన్లున్నాయని చెప్పుకొచ్చారు

అంతా బాగానే ఉంది కానీ ఇన్నేళ్లు వేరొకరు వచ్చి పూనుకునే దాకా తారకరామాని ఎందుకు వదిలేశారనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకదు. ముఖ్యంగా అసభ్య చిత్రాలు ప్రదర్శించే టైంలో వాటిని అడ్డుకట్ట వేయకుండా వదిలేయడం ఏమిటో ఎవరికీ తెలియదు. పునఃప్రారంభం తర్వాత సీట్లను కుదించి చక్కని సౌకర్యాలతో పాటు టికెట్ ధరలు, స్నాక్స్ రేట్లు అన్నీ అందుబాటులో ఉండేలా చేయడం మెచ్చుకోదగ్గ విషయం. మల్టీ ప్లెక్సుల పుణ్యమాని సామాన్యులు సినిమాకు దూరమవుతున్న టైంలో ఇలాంటివి అవసరమే. మౌలాలిలోనూ మూవీ మ్యాక్స్ 7 స్క్రీన్ల కొత్త సముదాయాన్ని ఇవాళ్టి నుంచి అందుబాటులోకి తెచ్చింది. భాగ్యనగర వాసులకు ఆప్షన్లు పెరుగుతున్నాయి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి