iDreamPost

బాలీవుడ్ వైకుంఠపురములోకి రంగం సిద్ధం

బాలీవుడ్ వైకుంఠపురములోకి రంగం సిద్ధం

జనవరిలో సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలై నాన్ బాహుబలి రికార్డులు సొంతం చేసుకున్న అల వైకుంఠపురములో హిందీ రీమేక్ కి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే హక్కుల కొనుగోలు పూర్తయిపోయింది. భారీ పోటీ మధ్య అశ్విన్ వార్డె దీన్ని సొంతం చేసుకున్నట్టు తెలిసింది. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తీసింది ఈయనే. ఏకంగా రెండు వందల కోట్లకు పైగా వసూళ్లతో ఆ సినిమా సాధించిన విజయాన్ని చూసి ఇప్పుడు అల వైకుంఠపురములో రైట్స్ కోసమే ఏకంగా 8 కోట్లు చెల్లించినట్టు ఫిలిం నగర్ టాక్. సాధారణంగా చూసుకుంటే ఇది చాలా పెద్ద మొత్తం.

కానీ సబ్జెక్టు మీద కాన్ఫిడెన్స్ తో ఆయన వెనుకాడలేదని తెలిసింది. నిజానికి గీతా హారికా హాసిని సంస్థలు ముందు దీన్ని డబ్బింగ్ చేద్దామనుకున్నారు. కానీ రీమేక్ కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడటంతో ఫైనల్ గా అమ్మేశారు. ఇప్పుడు ఇందులో హీరోగా బాలీవుడ్ నుంచి ఏ హీరో నటించబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. అక్షయ్ కుమార్, షాహిద్ సింగ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టుగా తెలిసింది. అయితే ఇదంతా ప్రాధమిక దశలో వస్తున్న సమాచారం. కరోనా వల్ల ఎక్కడికక్కడ పరిస్థితి బ్లాక్ అయిపోవడంతో పూర్తిగా సద్దుమణిగాకే దీనికి సంబంధించిన ప్రకటన రాబోతోంది.

షాహిద్ కపూర్ ప్రస్తుతం జెర్సీ రీమేక్ లో బిజీగా ఉన్నాడు. ఇప్పుడీ కరోనా వెకేషన్ తర్వాత షూటింగ్ మళ్ళీ మొదలుపెట్టబోతున్నారు. ఇప్పటికే రెండు రీమేక్స్ చేసుకుని కం బ్యాక్ ఇచ్చుకున్న షాహిద్ కపూర్ అల వైకుంఠపురములోకి మంచి ఛాయస్ గానే నిలుస్తాడు. మరోవైపు అక్షయ్ కుమార్ ఊపిరిసలపనంత బిజీగా కమిట్మెంట్స్ తో ఉన్నాడు. ఈ నేపథ్యంలో డేట్స్ దొరకడం అంత ఈజీ కాదు. మరొక విశేషం ఏంటంటే సుశాంత్ పాత్రకు లెన్త్ పెంచి హిందీ వెర్షన్ లో దీన్ని మల్టీ స్టారర్ తరహాలో ప్లాన్ చేసే ఆలోచన ఉందట. దర్శకుడిగా రోహిత్ శెట్టి కోసం నిర్మాత గట్టిగానే ట్రై చేస్తున్నట్టు వినికిడి. ఇక్కడంటే త్రివిక్రమ్ మాటల దర్శకత్వ మాయాజాలంతో అల వైకుంఠపురములో మేజిక్ చేయగలిగింది కానీ హిందీలో దీన్ని అంత సమర్ధవంతంగా డీల్ చేయగలరా అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి