iDreamPost

ఈ సైకో విలన్ కథ పెద్దదే

ఈ సైకో విలన్ కథ పెద్దదే

నిన్న విడుదలైన అశ్వద్ధామ టాక్ సంగతి పక్కన పెడితే స్టైలిష్ లుక్స్ తో దారుణమైన హత్యలు చేసే విలన్ గా నటించిన జిస్సు సేన్ గుప్తా అందరిని ఆకట్టుకున్నాడు. గత కొంత కాలంగా తెలుగులో రొటీన్ మొహాలను విలన్లుగా చూసి చూసి ప్రేక్షకులకు బోర్ కొడుతోంది. అందులోనూ ఇలాంటి సైకో కిల్లర్ కథలకు రెగ్యులర్ ఫేస్ అయితే అస్సలు బాగుండదు. అందుకే వెతికి మరీ బెంగాలీ నటుడిని తీసుకొచ్చారు. కాకపోతే అతని పేరు ఎవరికి పెద్దగా అవగాహనా లేకపోవడంతో ఎవరా అని ఆలోచించిన వాళ్ళే ఎక్కువ.

అతని పేరు జిస్సుసేన్ గుప్తా. చాలా టాలెంటెడ్ యాక్టర్. బెంగాలీలో ఇతనికి స్టార్ స్టేటస్ ఉంది. తెలుగులో అశ్వద్ధామ మొదటి సినిమా కాదు. బాలకృష్ణ హీరోగా నటించిన ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడులో ఎల్వి ప్రసాద్ గా నటించింది ఇతనే. కాకపోతే చిన్న సీన్లు కావడంతో ఎవరూ పట్టించుకోలేదు అంతే. జిస్సు సేన్ గుప్తా పరిశ్రమకు వచ్చి పదేళ్లు దాటింది. 2000లో శేష్ ఠికానా అనే బెంగాలీ మూవీతో తెరంగేట్రం చేసి ఇప్పటిదాకా 90పైగా సినిమాల్లో నటించాడు. సెంచరీకి అతి దగ్గరలో ఉన్నాడు. హిందీలో సుభాష్ చంద్ర బోస్ ది ఫర్గాటెన్ హీరో, పీకూ, మర్దానీ, మణికర్ణిక లాంటి విభిన్నమైన సినిమాల్లో మంచి పాత్రలు పోషించాడు

కానీ బయటి భాషల్లో ఆశించినంత గుర్తింపు ఇంకా రాలేదు. నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ టైప్ రైటర్ లో కూడా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం దేవిదాస్ ఠాకూర్ అనే హిందీ మూవీ చేస్తున్న జిస్సుసేన్ గుప్తా ఇప్పటికీ చాలా బిజీ ఆర్టిస్ట్. అశ్వద్ధామలో పాత్ర పేరు తెచ్చి ఇక్కడ మంచి ఆఫర్స్ తెస్తుందని నమ్మకంతోనే ఉన్నాడు. ఫలితం ఏమో కానీ సినిమా అయ్యాక హీరో కన్నా ఓ రెండు పాళ్ళు జిస్సుసేన్ గుప్తానే ఎక్కువ గుర్తుంటున్నాడు అంటే ఇతగాడు విలనీని ఏ స్థాయిలో పండించాడో వేరే చెప్పాలా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి