iDreamPost

ప్రేమ పెళ్లి.. భార్య కుటుంబం మొత్తాన్ని చంపేశాడు!

ప్రేమ పెళ్లి.. భార్య కుటుంబం మొత్తాన్ని చంపేశాడు!

నేటి సమాజంలో ప్రేమ పెళ్లిళ్లు పేక మేడల్లా కూలిపోతున్నాయి. ఏళ్ల తరబడి పోటాపోటీగా ప్రేమించుకుని, పెళ్లి బంధంతో ఒక్కటైన వారు కూడా నిత్యం గొడవలు పడుతూ విడాకులు తీసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. అంతేకాదు! కొన్ని సార్లు గొడవలు హద్దు దాటి ఆత్మహత్యలకు.. హత్యలకు కూడా దారితీస్తున్నాయి. తాజాగా, ఓ జంట ఫేస్‌బుక్‌ ద్వారా ప్రేమలో పడి, పెద్దలను ఎదురించి మరీ పెళ్లి చేసుకుంది. అయితే, వీరి ప్రేమ పెళ్లి ఎక్కువ కాలం నిలవలేదు. గొడవల కారణంగా మొత్తం మూడు హత్యలు జరిగాయి.

ఈ అస్సాంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. అస్సాంలోని గోలాఘాట్‌కు చెందిన 25 ఏళ్ల నాజిబుర్‌ రహ్మాన్‌ బోరాకు లాక్‌డౌన్‌ సమయంలో అదే ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల సంఘమిత్ర ఘోస్‌ అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వీరి ప్రేమ విషయం సంఘమిత్ర ఇంట్లో వారికి తెలిసింది. దీంతో వారు పెళ్లికి ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలోనే ప్రేమికులిద్దరూ 2020 అక్టోబర్‌ నెలలో కోల్‌కత్తా పారిపోయారు. సంఘమిత్ర తల్లిదండ్రులు పోలీస్‌ స్టేషన్‌లో రహ్మాన్‌పై కేసు పెట్టారు. బలవంతంగా తమ కూతుర్ని కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లిపోయాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

సంఘమిత్ర ఎక్కడుందో తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు బలవంతంగా ఆమెను ఇంటికి తిరిగి తీసుకువచ్చారు. అయితే, సంఘమిత్ర-రహ్మాన్‌లు అప్పటికే రిజిస్ట్రర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. నాలుగు నెలల తర్వాత ఊహించని విధంగా తల్లిదండ్రులు సంఘమిత్ర మీద దొంగతనం కేసు పెట్టారు. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కొన్ని రోజులు జైలులో ఉన్న ఆమె బెయిల్‌ మీద బయటకు వచ్చింది. ఇక, అప్పటినుంచి తల్లిదండ్రుల దగ్గరే ఉంటోంది. అయితే, 2022లో సంఘమిత్ర-రహ్మాన్‌లు మరో సారి ఇంటినుంచి పారిపోయారు. చెన్నైలో దాదాపు 5 నెలలు కలిసి జీవించారు. మళ్లీ గోలాఘాట్‌కు తిరిగి వచ్చారు. ఇక, అప్పటినుంచి ఆమె తన భర్త ఇంట్లో ఉంటోంది. నవంబర్‌ నెలలో వీరికి ఓ పాప పుట్టింది. నాలుగు నెలల తర్వాత రహ్మాన్‌పై భార్యను వేధిస్తున్నాడంటూ కేసు నమోదైంది.

భర్త వేధింపుల కారణంగా సంఘమిత్ర తల్లిదండ్రుల దగ్గరకు వచ్చింది. సంఘమిత్ర పెట్టిన కేసు కారణంగా రహ్మాన్‌ జైలు పాలయ్యాడు. కొన్ని నెలలు జైలులో ఉండి.. బెయిల్‌ మీద తిరిగి వచ్చాడు. ఆ తర్వాత ఈ సంఘటన మరో మలుపు తిరిగింది. ఈసారి రహ్మాన్‌ అత్తామామలపై కేసు పెట్టాడు. తనను దారుణంగా కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ కేసు విషయంలో.. పాప విషయంలోనూ.. భార్యాభర్తలకు గత కొద్దిరోజులనుంచి గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం అతడు అత్తింటికి వెళ్లాడు. అక్కడ మళ్లీ వారి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలోనే రహ్మాన్‌ భార్యా, అత్తా, మామల్ని కత్తితో నరికి చంపాడు. తర్వాత పాపతో సహా పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు అతడ్ని అరెస్ట్‌ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి