iDreamPost

అర్య సమాజ్ లో పెళ్ళికి ప్లాన్ చేస్తున్నారా? – ఈ కోర్టు తీర్పు మీ కోసమే! 

అర్య సమాజ్ లో పెళ్ళికి ప్లాన్ చేస్తున్నారా? – ఈ కోర్టు తీర్పు మీ కోసమే! 

పెళ్ళికి ఇంట్లో వాళ్ళు అడ్డు చెప్పినా, లేక ఏ ఇతర కారణమైనా, అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు ఆర్య సమాజ్. సినిమాలు, నిజ జీవితంలో ప్రేమికులు తమ ప్రేమని నిలుపుకునేందుకు ఆర్య సమాజ్ ను ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ అంశంపై సుప్రీం కోర్టు మాత్రం కీలక వ్యాఖ్యలు చేసింది.

వివాహాలను ధ్రువీకరిస్తూ పత్రాలు జారీ చేసే హక్కు ఆర్యసమాజ్ కు లేదని, అందుకు నిర్ణీత అధికారులు ఉన్నారని ధర్మాసనం పేర్కొంది. న్యాయస్థానానికి నిజమైన సర్టిఫికేట్ మాత్రమే కావాలని స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్ లో ఒక ప్రేమ పెళ్ళి మీద నమోదైన కేసు విచారణలో భాగంగా ఈ తీర్పు చెప్పింది.

ఓ బాలిక కుటుంబం ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు మొదలైంది. మైనర్ గా ఉన్న తన కుమార్తెను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ యువకుడిపై కేసు వేశారు సదరు కుటుంబ సభ్యులు. పోలీసులు కేసు నమోదు చేయగా, ఆ కేసును సవాలు చేస్తూ యువకుడు సుప్రీం కోర్టుకు వచ్చాడు. మైనర్ గా పేర్కొన్న యువతి వాస్తవంలో మేజర్ అంటూ, తమ పెళ్ళి ఆర్య సమాజ్ లో జరిగిందని వివరించాడు.

తమ వివాహానికి సాక్ష్యంగా ఆర్య సమాజ్ వారి వివాహ ధ్రువీకరణ పత్రాన్ని కూడా చూపించాడు. ఇక్కడే వారి వాదనను ధర్మాసనంలోని న్యాయమూర్తులైన బీవీ నాగరత్నం, అజయ్ రస్తోగి తిరస్కరించారు. వివాహ ధ్రువీకరణ పత్రాలు అందించేందుకు ప్రత్యేకంగా అధికారులు ఉన్నరాని చెప్తూ, ఇది ఆర్యసమాజ్ పని కాదని స్పష్టతనిచ్చారు.

సుప్రీం కోర్టు తీర్పుతో ఇన్నేళ్ళుగా వివాహాలకు వేదికగా నిలిచిన ఆర్య సమాజ్ పై అందరూ ఆలోచనలో పడ్డారు. కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తూ హిందూ సంస్కరణలు, పౌర హక్కుల కోసం పని చేస్తోంది ఆర్య సమాజ్. చూడాలి మరి, ఈ నిర్ణయం అటు ఆర్య సమాజ్ ను, ఇటు ప్రజలను ఎలా ప్రభావితం చేస్తుందో.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి