iDreamPost

ఉపాధి కల్పనలో ఏపి ముందడుగు: రాష్ట్రంలో 63 లక్షల మందికి ఉపాధి : దేశంలోనే ఎపి నెంబర్ వన్

ఉపాధి కల్పనలో ఏపి ముందడుగు: రాష్ట్రంలో 63 లక్షల మందికి ఉపాధి : దేశంలోనే ఎపి నెంబర్ వన్

కరోనా వైరస్ మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థను, మరి ముఖ్యంగా ఉపాధి రంగాన్ని ధ్వంసం చేసింది. అందులో భాగంగానే రాష్ట్రాల్లో కూడా ఉపాధి రంగం దెబ్బతిన్నది. రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు అంతంతమాత్రంగానే తయారు అయ్యాయి. నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఒకపక్క కరోనా వైరస్ వ్యాప్తిని కట్టిడి చేస్తూ…మరోవైపు ఆర్థిక రంగాన్ని బలోపేతం చేసేపనిలో నిమగ్నమైంది. రాష్ట్రంలో ఉపాధి కల్పనపై దృష్టి పెట్టింది. కనుకనే రాష్ట్రంలో 63 లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ సిఎం వైఎస్ జగన్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.

ఏప్రిల్, మే నెలల్లో లాక్‌డౌన్‌ కారణంగా దేశమంతటా ఇబ్బందులే. పరిశ్రమలు, పారిశ్రామిక వాడలు అన్ని మూసి వేయడంతోనూ, ఆర్థిక కార్యకలాపాలు స్తంభించడంతోనూ ఉపాధి రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంది. దాదాపు 15 కోట్ల మంది ఉపాధిని కోల్పోయారని కేంద్ర ప్రభుత్వ ‌సంస్థ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ తెలిపింది. అయితే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఉపాధి కల్పనలో దేశంలోనే అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ నిలిచి వారెవ్వా అనిపించింది. ఆర్థిక వేత్తలు, ఆర్థిక మేథావుల నుంచి ప్రశంశలు అందుకుంటుంది.

దేశమంతా కరోనాతో విలవిల్లాడుతున్న వేళ కూడా ఏప్రిల్, మే నెలల్లో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే 63.29 లక్షల మంది పేదలు ఉపాధి హామీ పథకం పనులు చేయటం ద్వారా రూ.2,380 కోట్లు సంపాదించుకున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం విపత్తు సమయంలో ఉపాధి హామీ పథకం పనులను భారీగా పెంచడంతో గడచిన రెండున్నర నెలల్లో 39 లక్షల కుటుంబాలు ఉపాధి పొందాయి.

ప్రస్తుతం ప్రతి రోజూ 50 లక్షల మందికి పైగా పేదలు ఉపాధి హామీ పనులకు హాజరవుతున్నారు. వారిలో 83.66 శాతం మంది బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కుటుంబాలు ఉన్నాయి. ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం జిల్లాల్లో ఉపాధి హామీ పథకం పనులకు హాజరయ్యే వారి సంఖ్య అధికంగా ఉంటోంది. 

ఉపాధి పనులకు హాజరయ్యే వారికి రోజుకు రూ.230 చొప్పున వేతనంగా అందుతోంది. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి 70 రోజుల వ్యవధిలో పేదలకు 10.33 కోట్ల పని దినాలను ప్రభుత్వం కల్పించింది. రాష్ట్రంలో 13,371 గ్రామ పంచాయతీలు ఉండగా.. వాటిలో 5,017 గ్రామాల్లో  రెండున్నర నెలల్లో రూ.20 లక్షలకు పైబడి విలువ గల ఉపాధి హామీ పనులు జరిగాయి. మరో 3,935 గ్రామాల్లో రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షల మధ్య విలువ చేసే పనులు జరిగాయి. ఇంకో 2,066 గ్రామాల్లో రూ.5 లక్షలు నుంచి రూ.10 లక్షల మధ్య విలువ చేసే పనులు జరిగాయి. ఈ రకంగా దేశంలోనే ఉపాధి కల్పనలో ఏపి ముందుంది.

గత టిడిపి ప్రభుత్వ హయాంలో గడచిన ఐదేళ్లలో ఏ ఒక్క రోజు 35 లక్షల మంది కూలీలకు మించి ఉపాధి హామీ పనులు కల్పించిన దాఖలాలు లేవు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కూలీలకు భారీగా పనులు కల్పించడంపైనే దృష్టి పెట్టడంతో ఈ నెల 8వ తేదీన ఒక్క రోజే 54.14 లక్షల మంది కూలీలు ఉపాధి పనులకు హాజరయ్యారు.  శనివారం (జూన్ 13)న కూడా రాష్ట్ర వ్యాప్తంగా 46,85,264 మంది కూలీలు హాజరైనట్టు గ్రామీణాభివృద్ధి శాఖ వెల్లడించింది. 

లాక్‌డౌన్‌ సమయంలో ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించడంలో దేశంలో మన రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. అన్ని రాష్ట్రాల్లో కలిపి 4.48 కోట్ల మంది కూలీలకు ఏప్రిల్, మే, ప్రస్తుత జూన్‌ నెలల్లో పనులు కల్పిస్తే.. మన రాష్ట్రంలో 63.29 లక్షల మంది పనులకు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా కూలీలకు రూ.13,415 కోట్లను వేతనాల రూపంలో చెల్లిస్తే, మన రాష్ట్రంలో రూ.2,380 కోట్లను వేతనాలుగా చెల్లించారు.  

రాష్ట్రంలో 64,09,092 కుటుంబాలకు జాబ్ కార్డులు ఉన్నాయి. అందులో ఏప్రిల్, మే నెలల్లో 39,00,736 కుటుంబాలు ఉపాధి పనుల్లో భాగస్వామ్యం అయ్యాయి. ఆయా కుటుంబాల నుంచి 63,29,493 మంది కుటుంబ సభ్యులు ఉపాధి పనులకు హాజరయ్యారు. అందులో 30,11,103 మంది బిసిలు, 15,50,797 మంది ఎస్సీలు, 6,11,586 మంది ఎస్టీలు, 81,839 మంది మైనార్టీలు, 10,02,438 మంది ఇతరులు, 71,730 మంది దివ్యాంగులు ఉన్నారు. ఏప్రిల్, మే రెండు నెలల్లో వీరందరికి కలిపి 2,480.08 కోట్లు అందాయి.

రాష్ట్రంలో పేద కుటుంబాలను ఉపాధి హామీ పథకంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది. అందరికీ కలిపి 10.33 కోట్ల పని దినాలు కల్పించింది. కరోనా కష్ట కాలంలో పేదలు ఒక్కొక్కరు రూ.20 వేలకుపైగా ఆదాయం పొందారు. ఉదాహరణకు ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం చిన ఓబినేనిపల్లెకు చెందిన ఇద్దరు సభ్యులున్న బండ్లమూడి బాలవర్దన్‌రాజు కుటుంబం ఉపాధి హమీ పథకం పనులు చేసుకుని ఆ రెండు నెలల్లో రూ.24,261 సంపాదించుకున్నారు. అదే గ్రామంలోని 242 కుటుంబాలు ఆ రెండు నెలలూ ఉపాధి హామీ పనులు చేసి దాదాపు రూ.39 లక్షలు సంపాదించుకున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి