iDreamPost

మహిళా రక్షణకు మరో ముందడుగు

మహిళా రక్షణకు మరో ముందడుగు

మహిళా రక్షణకు జగన్‌ సర్కార్‌ పెద్దపీట వేస్తోంది. మహిళలపై అఘాయిత్యాల నివారణే లక్ష్యంగా దిశ చట్టం కోసం బిల్లు రూపొందించిన జగన్‌ ప్రభుత్వం, ఆపదలో ఉన్న మహిళలు సహాయం పొందేందుకు దిశ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న దాదాపు ప్రతి మహిళ దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుంది. దిశ యాప్‌ ఉపయోగంపై ప్రభుత్వం విరివిగా ప్రచారం చేసింది. అంతేకాకుండా ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి, ఆపద సమయంలో ఎలా వినియోగించాలో కూడా అవగాహన కల్పించింది.

దిశ యాప్‌ తర్వాత.. పని చేసే చోట మహిళలకు రక్షణ కల్పించాలనే లక్ష్యంతో సబల అనే వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. పని ప్రదేశంలో మహిళలు ఏదైనా ఆపద, లైంగికపరమైన వేధింపులు ఎదుర్కొనే పరిస్థితి నుంచి రక్షణ పొందేందుకు ఈ సబల ఉపయోపడనుంది. ఈ మేరకు ఆపదలో ఉన్న మహిళలు సబలకు ఫిర్యాదు చేసేందుకు అవసరమైన వాట్సాప్‌ నంబర్‌ను వైసీపీ సర్కార్‌ తాజాగా అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్మన్‌ వాసిరెడ్డి పద్మ సబల వాట్సాప్‌ నంబర్‌ 63026 66254ను ఆవిష్కరించారు. దిశ మాదిరిగానే సబలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం విస్తృత అవగాహన కల్పించాలని సంకల్పించింది.

మహిళా సాధికారితకు పెద్దపీట వేస్తున్న వైసీపీ సర్కార్‌.. అదే సమయంలో మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మహిళలు ఎదిగేలా వివిధ పథకాలు, కార్యక్రమాలు చేపట్టింది. విధాన పరమైన నిర్ణయాలు తీసుకుంది. రాజకీయంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం ఉన్నత పదవులను మహిళలకే కేటాయించింది. వివిధ సంక్షేమ పథకాల ద్వారా మహిళలకు నగదును నేరుగా వారి ఖాతాలోకే జమ చేస్తోంది. మహిళల పేరుపై 30 లక్షలకు పైగా విలువైన ఇళ్ల స్థలాలు ఇవ్వడమేగాక, అందులో ఇళ్లు నిర్మించుకునేందుకు సాయం చేస్తోంది. ప్రభుత్వ కాంట్రాక్టుల్లోనూ 50 శాతం మహిళలకే ఇవ్వాలని నిర్ణయించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి