iDreamPost

మంత్రి కొడాలి నానిపై చర్యలు…

మంత్రి కొడాలి నానిపై చర్యలు…

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కేంద్రంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ రాష్ట్ర ప్రభుత్వంతో కయ్యానికి కాలుదువ్వుతున్నట్లుగా కనిపిస్తోంది. మంత్రి కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కొద్దిసేపటి క్రితం గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిర్వహణపై కొడాలి నాని పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పేర్కొన్నారు. తనపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని కూడా ఫిర్యాదులో ప్రస్తావించారు.

ఎన్నికల నిర్వహణపై తాను రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతుంటే.. కొడాలి నాని ఉద్యోగులను తనపైకి రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని నిమ్మగడ్డ ఆరోపించారు. కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వివిధ పత్రికల్లో వచ్చిన న్యూస్‌ క్లిప్పింగ్‌లు, న్యూస్‌ ఛానెళ్లలో ప్రసారమైన వీడియో క్లిప్పింగులు తన ఫిర్యాదుకు జత చేసి పంపిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. వెంటనే మంత్రి కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

కొడాలి నాని ఏమన్నారంటే..

‘‘రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ హైదరాబాద్‌లో కూర్చొని ఫిబ్రవరిలో ఏపీ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. కరోనా సమయంలో రాష్ట్ర ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేలా ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్దంగా లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని చెప్పారు. ఒక్క పోలీసు శాఖలోనే 12 వేల మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే రెవెన్యూ, విద్యా శాఖలో వేలాది మందికి కరోనా వైరస్‌ సోకింది. వైరస్‌ తగ్గాక కూడా వీరిలో చాలా మంది అనారోగ్య కారణాలతో విధులకు దూరంగా ఉన్నారు. బ్యాలెట్‌ పద్ధితిలో ఎన్నికలు నిర్వహిస్తే మరింత ప్రమాదం.

మార్చిలో పదవీ విరమణ చేస్తున్న నిమ్మగడ్డను అడ్డుపెట్టుకుని చంద్రబాబు.. తప్పుడు మార్గంలో ఎన్నికల నిర్వహింపజేసి టీడీపీ ఉనికిని కాపాడుకోవాలనుకుంటున్నారు. రాజకీయ పార్టీల ముసుగులో ఉంటున్న నిమ్మగడ్డ వెంటనే పదవికి రాజీనామా చేయాలి. నిమ్మగడ్డకు రాజ్యాంగ వ్యవస్థలు, ప్రభుత్వంపై నమ్మకం లేదు’’ అని కొడాలి నాని బుధవారం మీడియాతో మాట్లాడారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి