iDreamPost

స్థానిక మంత్రం.. అ”ద్వి”తీయ నిర్ణయం!

స్థానిక మంత్రం.. అ”ద్వి”తీయ నిర్ణయం!

పాలన, అధికారం వికేంద్రీకరణ వల్ల ప్రజలకు సులభంగా, సరళంగా పాలన ఫలాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల్లో స్థానిక పాలన విషయంలోనూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై నగరపాలక సంస్థకు ఇద్దరు డిప్యూటీ మేయర్ లు, మునిసిపాలిటీ కు ఇద్దరు వైస్ చైర్మన్ లు నియమించే కీలకమైన నిర్ణయానికి ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చింది. దీనికి బుధవారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేయడంతో స్థానిక పాలనలో కీలక అడుగు పడినట్లయింది.

నిజంగా ప్రత్యేకమే!

ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్సిపి ఏకంగా 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే 74 మున్సిపాలిటీల్లో, 11 కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం అన్నింట్లో విజయం సాధించడం ద్వారా చరిత్ర సృష్టించింది. గతంలో ఏ పార్టీకి అందనంత పెద్ద విజయం ఇది. దీంతో స్థానిక మున్సిపల్ పాలనలోనూ కీలకమైన మార్పులు తీసుకురావాలని, అధికారం అన్ని వర్గాలకూ అందాలని జగన్ భావించారు. స్థానిక సంస్థల పాలనలో మేయర్, చైర్మన్ తర్వాత కీలకంగా వ్యవహరించే డిప్యూటీ మేయర్, మున్సిపల్ వైస్ చైర్మన్ పదవులను ఎక్కువ మందికి అందించేలా మున్సిపల్ చట్టంలో మార్పులు తీసుకు వస్తూ ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకువచ్చారు.

దీనివల్ల పాలనలో ఒత్తిడి తగ్గడంతో పాటు, మున్సిపాలిటీ లో ఉన్న ప్రత్యేకమైన విభాగాల మీద పాలకులకు గట్టి పట్టు ఉంటుంది. అన్ని విభాగాల మీద దృష్టి సారించే అవకాశం ఏర్పడుతుంది. డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ లు మున్సిపాలిటీ నగరపాలక సంస్థ లోని కీలకమైన విభాగాలను పంచుకుని వాటి మీద తమ మార్కు చూపించేందుకు తాపత్రయపడతారు. కిందిస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారు అన్న దాని మీద స్పష్టమైన అవగాహన ఏర్పడడానికి ఇదో మంచి మార్గం.

మేయర్, మున్సిపల్ చైర్మన్ విధులు ప్రధానమైన ప్పటికీ స్థానిక సంస్థల పాలనలో డిప్యూటీ మేయర్, మున్సిపల్ వైస్ చైర్మన్ కు ప్రత్యేకమైన విధులు, అధికారాలు ఉంటాయి. దీన్ని అన్నీ వర్గాలుగా చేరువ చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ముఖ్యంగా వెనుకబడిన సామాజిక వర్గాలు, బలహీనవర్గాలు, ఇప్పటివరకు అధికారానికి దూరంగా ఉన్న వారికీ కచ్చితంగా ఈ పదవుల పెంచడం ద్వారా వారికీ తగిన ప్రాధాన్యం లభిస్తుంది అన్నది సీఎం జగన్ ఉద్దేశం. ప్రతిసారి పదవులు పంపకంలో వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరుగుతుందన్న మాటను పూర్తిగా రూపుమాపేందుకు ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్లేషకుల మాట. ఇప్పటి వరకు దేశంలో ఇలాంటి కీలక నిర్ణయాన్ని ఏ రాష్ట్రం తీసుకోలేదు.

ప్రజలకు ప్రత్యేకమైన అజమాయిషీ దీని వల్ల కలుగుతుంది. అధికారాన్ని పెంచడం ద్వారా నాయకుల్లో పోటీతత్వం ఏర్పడుతుంది. ఫలితంగా ప్రజలకు నాయకులు దగ్గర కావడానికి అవకాశం ఉంటుంది. రాజకీయంగా ఎదిగేందుకు, తమ మార్కు చూపించేందుకు నాయకులు ప్రజలతో మమేకం అవ్వడం పెరుగుతుంది. ఫలితంగా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు వేగంగా ప్రజలకు అందడానికి ఒక ఆరోగ్యకరమైన పోటీ, ప్రత్యామ్నాయ పాలన విధానం పెరగడం ద్వారా కొత్త అజమాయిషీ పుష్కలంగా ఉంటుంది. పదవులు రాని వారు సైతం వాటిని అందుకోవడానికి, ఉన్న అపార అవకాశాలు వినియోగించుకోవడానికి గట్టిగా పని చేస్తారు. దీంతో ప్రభుత్వ నిర్ణయం భవిష్యత్తులో రాజకీయ మైలురాయి అవుతుందనడం లో సందేహం లేదు.

సాయంత్రం లేదా రేపటికి స్పష్టత!

అధికార పార్టీ గెలిచిన మున్సిపాలిటీలకు చైర్మన్లు వైస్ ఛైర్మన్ ల ఎంపిక, నగరపాలక సంస్థకు మేయర్, డిప్యూటీ మేయర్ల ఎంపిక దాదాపు పూర్తి కావచ్చింది. అన్ని వర్గాలకు సమప్రాధాన్యం ఇస్తూ, ఎవరికీ ఇబ్బంది కలగని రీతిలో ఇప్పటికే ఆయా జిల్లాల ఇన్చార్జి మంత్రులు ఈ ప్రక్రియను బుధవారం సాయంత్రానికే పూర్తి చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, మంత్రుల తో మాట్లాడి అధిష్టానం నిర్ణయం మేరకు పార్టీ కోసం కష్ట పడిన వారికి, అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగేలా ఈ ఎంపికలు కొనసాగాయి. దాదాపు 74 మున్సిపాలిటీలకు, 11 కార్పొరేషన్లకు ఎంపికలు పూర్తి కావడంతో బుధవారం రాత్రి లేదా, గురువారం ఉదయం వీరి పేర్లు అధికారికంగా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అసంతృప్తులను, పదవులు రాని వారిని సైతం ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వారితో ప్రత్యేకంగా మాట్లాడి సర్ది చెప్పాలని సీఎం జగన్ ప్రత్యేకంగా మంత్రులను ఆదేశించారు. భవిష్యత్తులో కచ్చితంగా పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని భరోసా ఇస్తున్నారు. దీంతో అంతా సాఫీగానే సాగుతుందని, చిన్న చిన్న అవాంతరాలు సహజమే అనే రీతిలో ముందుకు వెళ్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి