iDreamPost

కరోనా పై పోరు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం…

కరోనా పై పోరు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం…

కరోనా వైరస్ పై పోరులో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ నియంత్రణకు విరివిగా నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించింది. ప్రతి మండలాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ర్యాండం గా శాంపిల్ సేకరించి పరీక్షలు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో కరోనా నియంత్రణ చర్యలు, లాక్ డౌన్ అమలు పై సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం జగన్ ఈ మేరకు పలు సూచనలు చేశారు.

ఇంటింటి సర్వే ద్వారా గుర్తించిన కరోనా వైరస్ అనుమానిత లక్షణాలు గల 32 వేల మందికి ముందుగా పరీక్షలు నిర్వహించాలని జగన్ ఆదేశించారు. ఆ తర్వాత మండలాన్ని ఒక యూనిట్ గా తీసుకొని పరీక్షలు నిర్వహించాలని సూచించారు. క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్న వారికి సరైన ఆహారం, సౌకర్యాలు కల్పించాలని సూచించారు. క్వారంటైన్ పూర్తి చేసుకొని ఇళ్లకు వెళ్లే వారికి ప్రతి ఒక్కరికి రెండు వేల రూపాయల చొప్పున ఇవ్వాలని ఆదేశించారు. క్వారంటైన్ లో ఉన్న ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకునే విధంగా అధికారులు వారికి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

లాక్ డౌన్ నేపథ్యంలో రైతులు ఇబ్బంది పడకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖను ఆదేశించారు. అరటి, పుచ్చకాయ రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు సరైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని మార్కెటింగ్ శాఖ ను ఆదేశించారు. రైతులు నష్టపోకుండా తీసుకోవాల్సిన అన్ని చర్యలను సీఎం ఈ సందర్భంగా సంబంధిత శాఖ అధికారులకు తెలియజేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి