iDreamPost

వైసీపీ విజ‌యం లాంఛ‌న‌మే…

వైసీపీ విజ‌యం లాంఛ‌న‌మే…

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌కు నేడే ముహూర్తం.. శుక్ర‌వారం ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ కొన‌సాగుతుంది. అనంత‌రం సాయంత్రం 5 గంట‌ల‌కు లెక్కింపు ప్రారంభం అవుతుంది. నాలుగు రాజ్యసభ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి.

ఏపీ శాస‌న‌స‌భ‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 స్థానాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉండ‌గా.. (వారిలో ముగ్గురు ఇప్ప‌టికే  వైసీపీకే మ‌ద్ద‌తు తెలిపారు), జ‌న‌సేన పార్టీకి ఒకే ఒక శాస‌న‌స‌భ్యుడు ఉన్నారు. వైసీపీ కి మొత్తం 151 మంది శాస‌న‌స‌భ్యులు, రాజ్యసభ పోటీలో న‌లుగురు ఉన్నందున‌.. ముగ్గురు అభ్య‌ర్థులకు ఒక్కొక్క‌రికి 38, మ‌రొక‌రికి 37 ఓట్లు వేసేలా ఆయా ఎమ్మెల్యేల‌ను విభ‌జించి త‌ద‌నుగుణంగా ఓటు వేయాల‌ని వారికి వైసీపీ సూచించింది.

ఎమ్మెల్యేలు తొలి ఓటును త‌మ‌కు కేటాయించిన అభ్య‌ర్థికి, రెండో ప్రాధాన్య ఓటును 37 ఓట్లు కేటాయించిన నాలుగో అభ్య‌ర్థికి వేస్తారు. బ్యాలెట్ ప‌ద్ధ‌తిలోనే ఎన్నిక జ‌రుగుతుంది. ఆయా పార్టీల నుంచి ఒక ప్ర‌తినిధి పోలింగ్ కేంద్రంలో ఉంటారు. ఏ ఎమ్మెల్యే ఎవ‌రికి ఓటు వేశారో ముందుగానే ఆ ప్ర‌తినిధికి చూపించాల్సి ఉంటుంది. మొద‌టి ప్రాధాన్య‌తా ఓటు లెక్కింపుతోనే.. తొలి రౌండ్ లోనే విజేత‌లు ఎవ‌రో తెలిసిపోతుంది. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్ర‌బోస్, మంత్రి మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణ‌, రిల‌య‌న్స్ సంస్థ‌కు చెందిన ప‌రిమ‌ళ్ స‌త్వానీ, రాంకీ సంస్థ‌కు చెందిన అయోధ్య రామిరెడ్డి పోటీ చేస్తున్నారు. సంఖ్యా బ‌లాన్ని బ‌ట్టి చూస్తే వీరు గెలుపు ఖాయ‌మే..!

టీడీపీకి ఆ చాన్సే లేదు…

ఒక్క రాజ్య‌స‌భ సీటు కూడా పొందే సంఖ్యా బ‌లం తెలుగుదేశం పార్టీకి లేదు. ఆ పార్టీ గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 23 స్థానాల‌కే ప‌రిమితం అయింది. త‌ద‌నంత‌రం వైసీపీ ప్ర‌జా సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు ఆక‌ర్షితులై.. వ‌ల్ల‌భ‌నేని వంశీ, మ‌ద్దాలి గిరి, క‌ర‌ణం బ‌ల‌రాం లాంటి వారు చాలా కాలంగా తెలుగుదేశానికి దూరంగా ఉంటున్నారు. త‌న స‌భ్యుల‌తో పాటు వీరికి కూడా తెలుగుదేశం పార్టీ విప్ జారీ చేసింది. పార్టీ నుంచి వ‌ర్ల రామ‌య్య‌ను బ‌రిలోకి దింపింది. బ‌లం లేద‌ని తెలిసినా వ‌ర్ల‌ను పోటీలోకి దింపి ఆయ‌న‌ను బ‌లి ప‌శువును చేసింద‌ని ఆ పార్టీకి చెందిన నేత‌లే చ‌ర్చించుకుంటుండ‌డం గ‌మ‌నార్హం. నెగ్గే చాన్స్ ఉంటే వ‌ర్లకు పోటీ చేసే అవ‌కాశం ద‌క్క‌క‌పోయేద‌ని టీడీపీ లోనే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దీనిపై మ‌రి అధినేత ఏమంటారో.. ఎందుకు వ‌ర్ల‌ను పోటీకి దింపారో..!! మొత్తంమ్మీద గ‌మ‌నిస్తే.. నాలుగు సీట్ల‌కు గాను బ‌రిలో ఐదుగురు ఉన్న‌ట్లు లెక్క‌.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి