iDreamPost

నిమ్మగడ్డ మళ్లీ మంతనాలు జరపాల్సిందే, స్థానిక ఎన్నికలపై హైకోర్టు తీర్పు..

నిమ్మగడ్డ మళ్లీ మంతనాలు జరపాల్సిందే, స్థానిక ఎన్నికలపై హైకోర్టు తీర్పు..

అసలే కరోనా వైరస్ తీవ్రత ఎంతవరకూ ఉంటుందన్నది అంతుబట్టడం లేదు. అంతర్జాతీయంగా అందరూ అల్లాడిపోతున్నారు. అదే సమయంలో దేశంలో ప్రజలకు వ్యాక్సిన్ ని వీలయినంత త్వరగా అందిస్తామని కేంద్రం చెబుతోంది. దానికి అనుగుణంగా ఏపీలో కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది దశల వారీగా కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సన్నాహాలు చేస్తోంది. కేంద్రం నుంచి వ్యాక్సిన్ రాగానే పంపిణీ చేసేందుకు సన్నద్ధమవుతోంది. సరిగ్గా అలాంటి సమయంలో ప్రజారోగ్యం పక్కన పెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాట మొదలయ్యింది. స్థానిక ఎన్నికల పేరుతో విపక్ష రాజకీయాలకు ఎస్ ఈ సీ వంతపాడడం విశేషంగా మారింది. ముఖ్యంగా నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ తన పదవీకాలం ముగుస్తున్న వేళ తన మాటే చెల్లుబాటు కావాలనే ధోరణిలో వ్యవహరించడం చర్చనీయాంశం అయ్యింది.

వాస్తవానికి ఏపీలో స్థానిక ఎన్నికలకు రెండేళ్ల క్రితమే గడువు ముగిసింది. కానీ అప్పట్లో చంద్రబాబు హయంలో వాటిని నిర్వహించేందుకు చిన్న ప్రయత్నం కూడా ఎన్నికల సంఘం తరుపున నిమ్మగడ్డ ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు. పైగా ఆయన రాష్ట్రానికి వెలుపల హైదరాబాద్ లో ఉంటూ ఏపీ స్థానిక సంస్థలను గానీ, ప్రజల ప్రయోజనాలను పట్టించుకుంటున్నట్టు కనిపించలేదు. చివరకు జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని అడ్డంకులు తొలగించి ఎన్నికలకు సన్నద్దమయితే చివరి క్షణంలో కనీసం సమాచారం లేకుండా వాయిదా వేసేశారు. దానిమీద సుప్రీంకోర్ట్ కూడా నిమ్మగడ్డ వైఖరిని తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వంతో సంప్రదించి ఉండాల్సిందని కోర్టు అభిప్రాయపడింది.

అయినా తన బుద్ధి మార్చుకోని నిమ్మగడ్డ ఏకపక్షంగా తనకున్న అధికారాలను వినియోగించేందుకు ప్రయత్నించారు. ఏపీలో పరిస్థితి కేసుల పరంగా సర్థుమణిగినట్టు కనపించడంతో ఆయన చెలరేగిపోయారు. వాస్తవానికి అసలు కేసులే లేని సమయంలో ఎన్నికల నిర్వహణను వాయిదా వేసి, కేసులు కొనసాగుతుండగా, మరోసారి పెరిగే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తుండగా నిమ్మగడ్డ మాత్రం తన మాటే చెల్లుబాటు కావాలనే ధోరణి ప్రదర్శించారు. ఇప్పటికే సెకండ్ వేవ్ తాకిడి ఎలా ఉంటుందో అంతుబట్టడం లేదు. తాజాగా యూకే నుంచి కరోనా స్ట్రెయిన్ బారిన పడిన ఓ బాధితురాలు రాజమహేంద్రవరం రావడం కలకలం రేపింది. ఇలాంటి పరిస్థితుల్లో వైరస్ మ్యూటేషన్ తర్వాత వ్యాపిస్తే ప్రమాదం ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయం ఉంది. దానిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే నిమ్మగడ్డ మాత్రం తాను రిటైర్ అయ్యేలోగా ఎన్నికలు జరపాలనే పట్టుదలన ప్రదర్శించడం విస్మయకరంగా మారింది.

చివరకు ఈ అంశంలో కోర్టు స్పష్టతనిచ్చింది. ఎన్నికల సంఘం అధికారులు ప్రభుత్వంతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. చర్చల బాధ్యతను ఎస్ ఈ సీ కే అప్పగించింది. వ్యాక్సిన్ పంపిణీ కూడా కీలకమేనని వ్యాఖ్యానించింది. దాంతో ఇప్పుడు మరోసారి అనివార్యంగా నిమ్మగడ్డ ప్రభుత్వంతో సంప్రదింపులకు సిద్ధంకావాల్సి వస్తోంది. వాస్తవానికి ప్రభుత్వం కూడా అదే చెప్పింది. పరిస్థితులను గమనంలో ఉంచుకుని చర్చలు చేద్దామని అభిప్రాయపడింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏకపక్ష వైఖరి సరికాదని నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా తెలిపారు. అయినా పెడచెవిన పెట్టి న్యాయపోరాటం అంటూ తయారయిన నిమ్మగడ్డకు హైకోర్టు తగిన పాఠమే చెప్పినట్టయ్యింది. ఎన్నికలు నిర్వహించాల్సిన సిబ్బంది కూడా ససేమీరా అంటున్న సమయంలో పట్టుదలకు పోయి ఎన్నికల సంఘం పరిధి దాటి వ్యవహరించాలని ప్రయత్నించడం ఆయన తీరుని చాటుతుందనే విమర్శలున్నాయి. ఇప్పటి నుంచైనా నిమ్మగడ్డ ప్రభుత్వంతో సామరస్యంగా వ్యవహరించే ధోరణి అలవర్చుకోవాలసిన అవసరం ఉంది. ప్రభుత్వాన్ని ఢీకొట్టాలనే రాజకీయ యత్నాలు విరమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైకోర్టు తీర్పు కారణంగతా ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ విషయంలో మరోసారి చర్చలు జరిపి, పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ముందుకెళ్లడం అందరికీ శ్రేయస్కరంగా చెప్పవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి