iDreamPost

‘ఇంగ్లిష్‌’పై తల్లిదండ్రుల అభిప్రాయ సేకరణకు శ్రీకారం..

‘ఇంగ్లిష్‌’పై తల్లిదండ్రుల అభిప్రాయ సేకరణకు శ్రీకారం..

ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పేదలకు మంచి చేసే విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తి లేదని ఏపీ ప్రభుత్వం తన విధానాల ద్వారా స్పష్టం చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం వ్యవహారంలో పలువురు హైకోర్టుకు వెళ్లడంతో న్యాయస్థానం సంబంధిత జీవోలను ఇటీవల కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీంతో రాబోయే విద్యా సంవత్సరంలోనే ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టేందుకు గాను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది.

ఒకటవ తరగతి నుంచి 5వ తరగతి వరకు తమ పిల్లలు ఏ మాధ్యమంలో చదవాలో నిర్ణయించుకునే అవకాశం తల్లిదండ్రులకే కల్పించింది. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇందుకు సంబంధించిన ఎంపిక ఫారాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా స్కూళ్లు అన్నీ మూతవేసిన నేపథ్యంలో.. ప్రత్యేక నమూనా గల ఫారాల ద్వారా తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించనుంది. వచ్చే విద్యా సంవత్సరంలో మీ పిల్లలను ఏ మాధ్యమంలో చదివించాలనుకుంటున్నారు? కారణాలు ఏంటి? కుటుంబనేపథ్యం తదితర వివరాలను సేకరించనున్నారు. వీటన్నిటినీ పలు దశల్లో స్థానిక విద్యాధికారులు, జిల్లా విద్యా శాఖాధికారులు మదించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తారు. వెంటనే ఈ ప్రక్రియ మొదలు కావాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియాన్ని ప్రవేశపెట్టడాన్ని 93.77 శాతం తల్లిదండ్రుల కమిటీలు స్వాగతించాయంటూ.. అందుకు సంబంధించిన నివేదికలను ప్రభుత్వ న్యాయవాదులు హైకోర్టుకు గతంలోనే సమర్పించిన విషయం తెలిసిందే. తెలుగు మీడియం చదవాలనే వారి కోసం మండలానికి ఒక తెలుగు మీడియం పాఠశాల ఏర్పాటు చేస్తామని, ఆయా విద్యార్థుల కోసం ప్రభుత్వమే రవాణా సౌకర్యం కల్పిస్తామని తెలిపింది. అయినప్పటికీ కోర్టు ప్రభుత్వ వాదనలను తోసిపుచ్చింది. తమ పిల్లలు ఏ మీడియంలో చదవాలన్నది నిర్ణయించుకునే హక్కు తల్లిదండ్రులకే ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తల్లిదండ్రుల అభిప్రాయ సేకరణకు ఆదేశాలు జారీ చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి